Begin typing your search above and press return to search.

18 ఏళ్ల కుర్రాడి ఉన్మాదం.. న్యూయార్క్ సూపర్ మార్కెట్లో కాల్పులు.. 10 మంది మృతి

By:  Tupaki Desk   |   15 May 2022 3:41 AM GMT
18 ఏళ్ల కుర్రాడి ఉన్మాదం.. న్యూయార్క్ సూపర్ మార్కెట్లో కాల్పులు.. 10 మంది మృతి
X
తెలిసి తెలియని వయసులో దేనికి ప్రభావితమయ్యాడో కానీ.. పద్దెనిమిదేళ్ల కుర్రాడి ఉన్మాదానికి ఏ పాపం ఎరుగని పది మంది ప్రాణాలు కోల్పోయిన అసాధారణ సంఘటన అగ్రరాజ్యంలోని న్యూయార్కు మహానగరంలో చోటు చేసుకుంది. కొద్ది గంటల ముందు చోటు చేసుకున్న (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.30 గంటలకు) ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. న్యూయార్కులోని బఫెల్లో సూపర్ మార్కెట్లో పద్దెనిమిదేళ్ల కుర్రాడు ఒకడు విచక్షణ రహితంగా గన్ తో కాల్పులు జరపటం.. ఈ షాకింగ్ ఉదంతం నుంచి తేరుకోకముందే.. పది మంది ప్రాణాలు అక్కడికక్కడే విడవటం జరిగిపోయాయి.

అమెరికాలోని గన్ కల్చర్ ఈ దారుణానికి కారణంగా భావిస్తున్నారు. సూపర్ మార్కెట్లోకి సైనికుడి వేషధారణలో వెళ్లిన యువకుడు.. తన వద్ద ఉన్న ఆయుధంతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఉన్మాదంతో ఉన్న ఆ యువకుడి కారణంగా పది మంది ప్రాణాలు విడిచారు. న్యూయార్కు కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ దారున ఉదంతం చోటు చేసుకుందని చెబుతున్నారు.

ఈ కాల్పులకు కారణం జాతి విద్వేషమేనన్న వాదన వినిపిస్తోంది. ఈ పెను విషాదంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ తన సంతాపాన్ని తెలియజేశారు. మరణించిన పది మందిలో ఎక్కువ మంది ఆఫ్రికన్ అమెరికన్లే కావటం గమనార్హం. మృతుల్లో నలుగురు సూపర్ మార్కెట్ ఉద్యోగులు కాగా.. మిగిలిన ఆరుగురు షాపుకు వచ్చిన కస్టమర్లుగా గుర్తించారు. ఈ సూపర్ మార్కెట్ న్యూయార్క్ మహానగరంలోని డౌన్ టౌన్ కు ఉత్తరాన నల్లజాతీయులు ఎక్కువగా ఉండే పరిసరాల్లో ఉండటం గమనార్హం.

ఈ దారుణ హననానికి పాల్పడిన దుర్మార్గుగ్ని పేటన్ జెండ్రాన్ గా గుర్తించారు. ఈ టీనేజ్ ఉన్మాది తీరుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పేటన్ జెండ్రాన్ ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే.. తాను లొంగిపోనని.. తనను తాను కాల్చుకుంటానని బెదిరింపులకు దిగాడు. అయితే.. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇతగాడిని వదిలి పెట్టకూడదని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడికి సంబంధించిన వివరాలు సేకరిస్తూ.. కాల్పుల వెనుకున్న అసలు కారణం ఏమిటన్న అంశాన్ని ఆరా తీస్తున్నట్లుగా చెబుతున్నారు.