Begin typing your search above and press return to search.

జైరాం రమేశ్.. ఇదెక్కడి టెంపర్ మెంట్ సామీ?

By:  Tupaki Desk   |   24 Jan 2023 3:00 PM GMT
జైరాం రమేశ్.. ఇదెక్కడి టెంపర్ మెంట్ సామీ?
X
రాజకీయ నేతల్లో ఒక సిత్రమైన వర్గం ఉంటుంది. వీరికి అంశాల మీద అవగాహన చాలా ఉంటుంది. కానీ.. వారికి ఉండాల్సిన కనీస కామన్ సెన్సు మాత్రం ఉండదు. విషయాల మీద.. సమస్యల పరిష్కారం మీద గుక్క తిప్పుకోకుండా మాట్లాడే వారు.. కొన్ని ఇబ్బందికర సందర్భాల్లో తెలివిగా వ్యవహరించే బతకనేర్చినతనం మాత్రం వారిలో మిస్ అవుతూ ఉంటుంది. నిజానికి ఇలాంటి మేధోపరమైన నేతల్ని నాలుగు గోడల మధ్యనే మాట్లాడేలా రాజకీయ పార్టీ డిజైన్ చేసుకుంటే మంచిది. అలా కాకుంటే.. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితే ఎదురవుతుంది.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న గొప్పతనం ఏమంటే.. రాజకీయం అంటే కనీస అర్థం కూడా తెలీని నేతల దగ్గర నుంచి అత్యున్నత స్థాయి వరకు అవగాహన ఉన్న తోపు నేతల వరకు ఉంటారు. అలాంటి కోవలోకే వస్తారు జైరాం రమేశ్ లాంటి నేతలు. వీరు బుద్ధి జీవులు. కాకుంటే.. వీరికి భావోద్వేగం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. టెంపర్ మెంట్ కు లోనై.. తెలివితక్కువ పనులు చేస్తుంటారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు వ్యవహరించే తీరుకు.. విపక్షంలోఉన్న పార్టీ వ్యవహరించే తీరులో తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది.

అధికారంలో ఉన్న పార్టీకి ఇబ్బందికర ప్రశ్నలకు అధికార దర్పంతో సమాధానం ఇవ్వటం కనిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో విపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలకు చెందిన నేతల్ని ఇరుకున పెడేలా వేసే ప్రశ్నలతో.. మైలేజీ సొంతం చేసుకునేలా జవాబులు ఇస్తూ తెలివిగా వ్యవహరిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఎంతటి తెలివైన వారు సైతం టెన్షన్ కు గైర.. తెలివి తక్కువ పనులు చేస్తారు.

కేంద్రంలో అధికారం చేజారి ఎనిమిదిన్నరేళ్లు అవుతున్నా.. సమీప భవిష్యత్తులో మళ్లీ అధికారాన్ని చేపడతామా? అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.దీనికి తగ్గట్లే పార్టీ నేతల్లోనూ ఇలాంటి సందేహాలు బోలెడన్ని ఉన్నాయి. ఇవి సరిపోనట్లుగా కొందరు నేతలు చేసే పనికిమాలిన వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ మరింత ఇరుకున పడుతుంటుంది.

తాజాగా మోడీ సర్కారు నిర్వహించినట్లుగా చెప్పుకునే సర్జికల్ స్ట్రైక్స్ పై ద్విగ్విజయ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో.. మరింత డ్యామేజ్ జరగకుండా ఉండేందుకు ఆయన పక్కనే ఉన్న మరోసీనియర్ నేత జైరాం రమేశ్ ఆ అంశంలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఈ సందర్భంగా తనకు ఎదురైన కష్టమైన ప్రశ్నకు సమాధానం చెప్పేయటమో.. పక్క దారిలోకి తీసుకెళ్లేలా చేయని ఆయన.. మైకును దూరంగా పెట్టేస్తూ ఆ అంశంపై మరింత మాట్లాడటానికి ఏమీ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఎప్పుడేం మాట్లాడాలో సరిగా తెలియని డిగ్గీ రాజా ఒకలాంటి తప్పు చేస్తే.. డ్యామేజ్ కంట్రోల్ కోసం బాధ్యత తీసుకున్న జైరాం.. అలాంటి పనే చేయటం దేనికి నిదర్శనం? ఇలా చేయటం ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదని.. ఇదెక్కడి తీరు? అని ప్రశ్నించే వారికి సమాధానం ఏం చెబుతారు? అధికారానికి దూరమై విపక్షంలో ఉన్న వేళ.. ఇష్టారాజ్యంగా వ్యవహరించే కంటే.. కాస్తంత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఈ విషయాన్ని జైరాం లాంటి నేతలు ఎప్పటికి గుర్తిస్తారు?