విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?
ఉపాధి వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లిన యువతకు ఊహించని నరకం ఎదురైంది.
By: A.N.Kumar | 2 Nov 2026 7:19 PM ISTఉపాధి వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లిన యువతకు ఊహించని నరకం ఎదురైంది. కష్టపడి నాలుగు రాళ్లు సంపాదించి.. స్వదేశంలో ఉన్న కుటుంబానికి అండగా నిలబడదామని ఆశపడిన ఆ యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది. సైన్యంలో 'ఫుడ్ ప్యాకింగ్' ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి తీరా అక్కడికి వెళ్లాక చేతికి తుపాకులు ఇచ్చి యుద్ధరంగంలోకి తోసేశారంటూ విశాఖపట్నానికి చెందిన యువకులు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన కన్నీటి వీడియో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీరని ఆందోళనను.. బాధితుల కుటుంబాల్లో తీవ్ర నిరాశను నింపుతోంది.
ఆ యువకులు తెలిపిన వివరాల ప్రకారం... మెరుగైన భవిష్యత్తు కోసం విశాఖ నుంచి మొత్తం ఐదుగురు యువకులు రష్యాకు వెళ్లారు. అక్కడ మిలటరీ విభాగంలో ఆహార ప్యాకేజింగ్ వంటి సురక్షితమైన ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్లు నమ్మించడంతోనే తాము వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అక్కడ అడుగుపెట్టిన కొద్ది రోజులకే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మిలటరీ ట్రైనింగ్ పేరుతో తమను నేరుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ రంగానికి పంపించారని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
"మొత్తం ఐదుగురం వచ్చాం.. అందరం ఇక్కడే చిక్కుకుపోయాం. ఎప్పుడు ఎటు నుంచి బాంబులు పడతాయో.. ఏ క్షణంలో ప్రాణాలు పోతాయో తెలియడం లేదు. చుట్టూ మరణ మృదంగం మోగుతోంది. భయంతో క్షణమొక యుగంలా గడుపుతున్నాం" అంటూ ఆ యువకులు వీడియోలో చెప్పిన మాటలు గుండెలను పిండేస్తున్నాయి. నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఎప్పుడు తమ చివరి క్షణం వస్తుందోనని వణికిపోతున్నామని వారు అవేదన చెందుతున్నారు.
"మా కుటుంబాలను మళ్లీ చూస్తామో లేదో తెలియదు.. భారత ప్రభుత్వం.. విదేశాంగ శాఖ వెంటనే స్పందించి మమ్మల్ని ఇక్కడి నుంచి కాపాడాలి. రష్యన్ ఎంబసీ ద్వారా తక్షణ చర్యలు తీసుకుని మమ్మల్ని సురక్షితంగా సొంత ఊరికి చేర్చండి" అంటూ చేతులు జోడించి ప్రధానమంత్రికి.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అక్కడ తమ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో తెలియక విశాఖలోని వారి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ వారిలో నిరీక్షణ కన్నీళ్లుగా మారుతోంది.
ఇటీవలి కాలంలో విదేశీ ఉద్యోగాల పేరుతో అమాయక యువకులను ఆకర్షించి.. రష్యా సైన్యంలోకి నెట్టివేస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై విదేశాంగ శాఖ తక్షణమే విచారణ జరిపి.. విశాఖ యువకులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించాలని వారి బంధువులు కోరుతున్నారు. తమ బిడ్డలు క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకోవాలని దేవుడిని ప్రార్థిస్తూ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కోసం వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.
