మొన్న మైక్రోసాఫ్ట్.. నేడు అమెరికా బ్యాంకులు.. అగ్రరాజ్యంలో అసలేం జరుగుతోంది?
అమెరికాలో మైక్రోసాఫ్ట్ సేవల అంతరాయం తర్వాత బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గాన్ చేజ్, వెల్స్ ఫార్గో ఆన్లైన్ సేవలు కూడా నిలిచిపోయాయి. సాంకేతిక లోపాల వల్లే సమస్య తలెత్తిందని బ్యాంకులు వెల్లడించాయి. సైబర్ దాడులపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా, అందుకు ఆధారాలు లేవు. కీలక రంగాలు డిజిటల్ వ్యవస్థలపై అతిగా ఆధారపడటంపై ఈ ఘటనలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
By: A.N.Kumar | 17 Nov 2026 4:00 PM ISTప్రపంచానికి సాంకేతిక పాఠాలు నేర్పే అగ్రరాజ్యం అమెరికాకు ఇప్పుడు ‘సర్వర్ డౌన్’ అనే కొత్త జ్వరం పట్టుకుంది. మన ఊర్లో కరెంట్ పోతేనో.. లేక ఎస్బీఐ సర్వర్ ఆగిపోతేనో సాధారణంగా తీసుకుంటాం కానీ.. "మేమే టెక్నాలజీకి బాసులం" అని కాలర్ ఎగరేసే అమెరికాలో వరుసగా డిజిటల్ వ్యవస్థలు చేతులెత్తేస్తుండటం చూస్తుంటే.. ప్రపంచమంతా ముక్కున వేలేసుకుంటోంది. మొన్న మైక్రోసాఫ్ట్ ‘బ్లూ స్క్రీన్’ చూపించి విమానాలను ఎయిర్‌పోర్టుల్లోనే కట్టేస్తే.. తాజాగా అమెరికా దిగ్గజ బ్యాంకులు "మా వల్ల కాదు బాబోయ్" అంటూ ఆన్లైన్ షట్టర్లు మూసేశాయి.
బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గాన్ చేజ్, వెల్స్ ఫార్గో.. పేర్లు వింటేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకల్లా కనిపిస్తాయి. కానీ తాజాగా వీటి ఆన్లైన్ సేవలు ఒక్కసారిగా కుప్పకూలడంతో అకౌంట్లో కోట్లు ఉన్నా కాఫీ కొనుక్కోలేని దీనస్థితి లక్షలాది మంది అమెరికన్లకు ఎదురైంది. డిజిటల్ చెల్లింపులంటూ ఊదరగొట్టే అగ్రరాజ్యంలో ఒక్కసారిగా సర్వర్లు మొరాయించడంతో జనం జేబుల్లో చిల్లర వెతుక్కునే పరిస్థితి వచ్చింది. "అయ్యో ఇది సైబర్ దాడి కాదండీ.. కేవలం చిన్న సాంకేతిక లోపం మాత్రమే" అని బ్యాంకులు తీరిగ్గా వివరణ ఇచ్చాయి. అంటే హ్యాకర్లు దాడి చేస్తేనే కాదు.. వాళ్ల సాఫ్ట్వేర్ వాళ్లే సరిగ్గా నడుపుకోలేకపోయినా వ్యవస్థలు స్తంభించిపోతాయని అర్థమైందన్నమాట..
గత శుక్రవారం మైక్రోసాఫ్ట్ పుణ్యమా అని విమానాలు ఆకాశంలోకి ఎగరలేక రన్‌వేలపైనే నిద్రపోయాయి. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే జాగారం చేశారు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే ఇప్పుడు బ్యాంకింగ్ రంగం వంతు వచ్చింది. రవాణా, ఆర్థిక రంగాలు రెండూ ఒకదానికొకటి పోటీ పడి మరీ మొరాయిస్తుంటే.. అసలు అమెరికాను నడిపిస్తోంది మనుషులా.. లేక ఎప్పుడో ఒకసారి క్రాష్ అయ్యే సాఫ్ట్వేర్ కోడ్లా? అనే సందేహం కలగక మానదు.
వరుసగా ఇలా జరగడంతో సోషల్ మీడియాలో మేధావులంతా రంగంలోకి దిగారు. ఇది కచ్చితంగా ఏదో పెద్ద కుట్ర.. శత్రు దేశాల సైబర్ దాడి అంటూ కథనాలు అల్లేస్తున్నారు. కానీ తీరా చూస్తే ఎక్కడా కుట్ర ఆధారాలు కనిపించడం లేదు. బహుశా శత్రువులు దాడి చేయాల్సిన అవసరం లేకుండా అమెరికా టెక్ దిగ్గజాల అతి విశ్వాసమే ఆ వ్యవస్థలను దెబ్బతీస్తున్నట్లుంది. మా సిస్టమ్స్‌కు తిరుగులేదు అనుకుంటూ చిన్న లోపం వస్తే ప్రత్యామ్నాయం ఏంటో ఆలోచించకపోవడమే అసలు సమస్యలా కనిపిస్తోంది.
