ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?
స్టీఫెన్ మిల్లర్‌కు వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ బాధ్యతలు అప్పగించడంతో అమెరికాలోని భారతీయ టెకీల్లో ఆందోళన మొదలైంది. గతంలో హెచ్1బీ వీసాల లాటరీ విధానాన్ని రద్దు చేయాలని, అధిక వేతనాలు పొందే నిపుణులకే వీసాలు ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారు. దీంతో ట్రంప్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తుందా అనే చర్చ మొదలైంది.
By: A.N.Kumar | 12 Nov 2026 1:46 PM ISTచింత చచ్చినా పులుపు చావదంటారు.. మిడ్ టర్మ్ ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్ట బోయినా కూడా ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు బుద్దిరాలేదు. మళ్లీ ఇమ్మిగ్రేషన్ విధానాల్లో కరుడుగట్టిన విద్వేషిని తీసుకొచ్చి పెట్టాడు. దీంతో అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కంటున్న వేలాది మంది భారతీయులకు ఈ పరిణామం షాకింగ్ గా మారింది. మళ్లీ ఇమ్మిగ్రేషన్ భయాలు మొదలయ్యాయి.
హెచ్1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయ టెకీలకు రాబోయే రోజులు గడ్డు కాలమేనని అర్థమవుతోంది. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన పెట్టిన పెంటనే.. తన అత్యంత నమ్మకస్తుడైన స్టీఫెన్ మిల్లర్ కు ట్రంప్ తాజాగా వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు వలసదారుల భవిష్యత్తును మరింత గందరగోళంలో పడేస్తోంది.
అసలు ఈ ఇమ్మిగ్రేషన్ విధానాలు ఇంత కఠినంగా మారడానికి కారణమే స్టీఫెన్ మిల్లర్. ఈయన తెరవెనుక కీలక పాత్ర పోషించాడు. ఇకపై అధ్యక్షుడు ట్రంప్ కు అత్యంత సమీపంలో ఉంటూ ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే కీలక స్థానంలోకి వచ్చారు. దీంతో అమెరికా వలస విధానాలు మరింత కఠినంగా మారతాయా? హెచ్1బీ వీసాలపై కొత్త ఆంక్షలు వస్తాయా? భారతీయ ఐటీ నిపుణులకు గడ్డు కాలమేనా? అన్న చర్చ మొదలైంది.
ఎన్నికల్లో ఓడిపోగానే ట్రంప్ కు జ్ఞానోదయం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అని ట్రంప్ నిరూపించుకున్నాడు. ఇమ్మిగ్రేషన్ విధానాలపై ఆదినుంచి దమ్మెత్తిపోస్తూ కఠిన నిబంధనలు రూపొందించిన స్టీఫెన్ మిల్లర్ ను తాజాగా తన పక్కనే తీసుకొచ్చి పెట్టుకోవడంతో ఈ నిర్ణయం వలసదారులకు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
గతంలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా వ్యవహరించిన సూసీ వైల్స్ స్థానంలో మిల్లర్ నియమితులయ్యారు. నవంబర్ 9 నుంచి కొత్త బాధ్యతలు చేపట్టారు. 2026 మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఎదురైన దారుణ ఓటముల నేపథ్యంలోనే ట్రంప్ తన వైట్ హౌస్ లో ఈ మార్పులు చేశారు.
ట్రంప్ రాజకీయ ప్రస్తానంలో మిల్లర్ ఆదినుంచి కీలకపాత్ర పోషించారు. ట్రంప్ మొదటి ప్రభుత్వంలోనూ.. రెండో ప్రభుత్వంలోనూ ఇమ్మిగ్రేషన్ విధానాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. అమెరికా సరిహద్దుల భద్రత, అక్రమ వలసల నియంత్రణ, డిపోర్టేషన్ చర్యలకు సంబంధించిన విధానాల్లో ఆయన ప్రభావం స్పష్టంగా కనిపించింది. 2017లోనే హెచ్1బీ వీసాల కేటాయింపులో అమలవుతున్న లాటరీ విధానాన్ని రద్దు చేయాలని ఈ మహానుభావుడు ప్రతిపాదించాడు. అధిక నైపుణ్యం ఉండి ఎక్కువ వేతనాలు తీసుకునే ఉద్యోగులకే హెచ్1బీ ఇవ్వాలని ఈయన ప్రతిపాదించారు. అమెరికాలో పుట్టిన పిల్లలకు పౌరసత్వం కల్పించే బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ విధానాన్ని రద్దు చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ ప్రయత్నాలకు మిల్లర్ మద్దతుగా నిలిచారు. బర్త్ టూరిజంపై కూడా కఠిన చర్యలను సమర్థించారు.
మిల్లర్ నియామకంతో అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలు మరింతగా కఠినంగా మారుతాయని.. హెచ్1బీ వీసాల విషయంలో ఈయన గతంలో చేసిన ప్రతిపాదనలు అమలైతే మాత్రం భారతీయులకు గడ్డుపరిస్థితులు ఎదురుకావడం ఖాయమని అంటున్నారు.
