యుద్ధంలో గెలుపు ఎవరిది? రష్యాకు మిగిలేది శవాల లెక్కేనా?
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా భారీ ప్రాణనష్టం చవిచూసినట్లు లీకైన రోస్సాట్ రహస్య డేటా వెల్లడించింది. ఇప్పటివరకు సుమారు 4.5 లక్షల మంది రష్యా సైనికులు మరణించి ఉండొచ్చని అంచనా. అధికారికంగా మరణాల వివరాలు వెల్లడించకపోయినా, ఈ గణాంకాలు యుద్ధం రష్యాపై చూపుతున్న తీవ్ర ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి.
By: A.N.Kumar | 9 Nov 2026 9:00 PM ISTయుద్ధంలో చివరకు ఏం మిగులుతంది? శవాల దిబ్బలు.. సైనికుల కుటుంబాలకు కడుపు కోతలు.. జయాపజయాలు ఎవరివైనా యుద్ధంలో విషాదం ఇరువైపులా ఉంటుంది. అందుకే యుద్ధంలో గెలిచినా.. ఓడినా.. శశ్మానాల్లో సైనికుల శవాలకు అంత్యక్రియలు తప్ప సాధించేది ఏదీ ఉండదు..ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో ఇది తేటతెల్లమైంది.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించి దాదాపు నాలుగేళ్లు కావస్తోంది. ప్రపంచానికి తన సైనిక సత్తా చాటాలని భావించిన మాస్కోకు ఇప్పుడు ఊహించని రీతిలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. యుద్ధరంగంలో సాధిస్తున్న కొద్దిపాటి భూభాగం కంటే కోల్పోతున్న సైనికుల ప్రాణాల సంఖ్యే ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా లీకైన రహస్య మరణాల రికార్డులు వెల్లడిస్తున్న నిజాలు గుండెల్ని పిండేసేలా ఉన్నాయి.
అధికారికంగా మరణాలను దాచిపెడుతున్నా రోస్సాట్ సంస్థకు సంబంధించిన లీకైన రహస్య డేటా ప్రకారం.. ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన రష్యా సైనికుల సంఖ్య సుమారు 4.5 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ఒక కిలోమీటర్ భూభాగం కోసం వందలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే ఈ విజయానికి చెల్లిస్తున్న మూల్యం ఎంత గొప్పదన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తోంది. కేవలం సైనిక స్థావరాలే కాకుండా 30 నుంచి 49 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులు భారీ సంఖ్యలో బలవుతుండటం రష్యా సామాజిక, జనాభా నిర్మాణంపై తీరని లోటును మిగులుస్తోంది. పనిచేసే చేతులు నేలకొరగడంతో ఆర్థిక, ఉత్పాదక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
ఇక్కడ మరో కీలకమైన అంశం ఉంది. యుద్ధంలో మరణించిన వారి వివరాలను ప్రభుత్వాలు బయటపెట్టకపోయినా.. మరణ ధ్రువీకరణ పత్రాలు, పౌర రిజిస్ట్రీలు, కుటుంబ సభ్యుల రికార్డులు వంటి వ్యవస్థల్లో వాటి ఆనవాళ్లు మిగిలిపోతాయి. ఒక వ్యక్తి యుద్ధరంగంలో మరణించినా.. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినా చివరకు ప్రభుత్వ రికార్డుల్లో మరణంగానే నమోదవుతాడు. ఈ రికార్డులను విశ్లేషించడం ద్వారా అధికారిక ప్రకటనలకు మించిన ప్రాణనష్టాన్ని రష్యా చవిచూసిందని సదురు డేటా వెల్లడిస్తోంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఈ యుద్ధం కేవలం ఉక్రెయిన్‌తో భూభాగ వివాదం మాత్రమే కాదు. అంతర్జాతీయ రాజకీయాల్లో రష్యా ఆధిపత్యాన్ని చాటుకోవడం.. నాటో విస్తరణను అడ్డుకోవడం.. తన దేశ భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవడం వంటి అనేక వ్యూహాత్మక లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. కానీ ఈ లక్ష్యాలను సాధించే క్రమంలో రష్యా సైన్యం భారీ ప్రాణనష్టాన్ని ఎదుర్కొంటోందనే వాదనలు బలపడుతున్నాయి.
యుద్ధం ఎప్పుడో ఒకప్పుడు ముగుస్తుంది. కానీ వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం వల్ల అభంశుభం తెలియని పసిపిల్లలు తండ్రులను, వృద్ధాప్యంలో తల్లదండ్రులు తమ కొడుకులను.. ఎంతోమంది భార్యలు తమ భర్తలను కోల్పోయి కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు.
ఈ యుద్ధ విషాదానికి ఏ దేశం కూడా పరిహారం చెల్లించలేవు. అంతిమంగా ఒక దేశం భూభాగాన్ని ఆక్రమించవచ్చు.. శత్రువులను ఓడించవచ్చు.. కానీ ఒక తరం భవిష్యత్తును బలిచ్చి సాధించే ఆ గెలుపు ఎవరికి కావాలి? రష్యాకు మిగిలేది విజయాల చరిత్రనా లేక అంతులేని శవాల లెక్కనా అన్నదే ఇప్పుడు చరిత్ర వేస్తున్న తీవ్రమైన ప్రశ్న.
రష్యా రహస్య మరణాల రికార్డుల లీక్ వ్యవహారం ఇప్పుడు ఇదే విషయాన్ని గుర్తుచేస్తోంది. యుద్ధంలో ఎవరు గెలుస్తారన్నది ఒక ప్రశ్న అయితే.. ఆ గెలుపు కోసం ఎన్ని కుటుంబాలు కన్నీరు పెట్టుకున్నాయి? ఒక దేశం తన భవిష్యత్తులో ఎంత భాగాన్ని కోల్పోయింది అన్నది అంతకంటే పెద్ద ప్రశ్న. ఉక్రెయిన్ యుద్ధం రష్యాకు మిగిల్చే అసలైన నష్టం బహుశా యుద్ధం ముగిసిన తర్వాతే పూర్తిగా బయటపడవచ్చు.
