Begin typing your search above and press return to search.

‘వైరల్’ ఫీవర్ ముదిరితే ‘పులి’ నోట్లో తలపెట్టడమే.. రీల్స్ కోసం నిండు ప్రాణం బలి

పాకిస్థాన్‌లోని లాహోర్ సమీపంలో టిక్‌టాక్ వీడియో కోసం పులిని బోను నుంచి బయటకు తీయగా అది 19 ఏళ్ల తల్హాపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనకు సంబంధించి కంటెంట్ క్రియేటర్ నౌమాన్ హసన్, ఫామ్ యజమాని ఫయ్యాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

By:  A.N.Kumar   |   13 Nov 2026 10:06 PM IST
‘వైరల్’ ఫీవర్ ముదిరితే ‘పులి’ నోట్లో తలపెట్టడమే.. రీల్స్ కోసం నిండు ప్రాణం బలి
X

సోషల్ మీడియాలో ఒక మిలియన్ వ్యూస్ వస్తే చాలు.. నోబెల్ ప్రైజ్ వచ్చినంతగా ఫీలైపోతున్నారు నేటి తరం కంటెంట్ క్రియేటర్లు. లైకుల కోసం కొండచిలువలను మెడలో వేసుకోవడం.. వ్యూస్ కోసం రైలు పట్టాలపై పడుకోవడం పాత చింతకాయ పచ్చడి అయిపోయింది. అందుకే కాబోలు.. పాకిస్థాన్‌కు చెందిన ఓ ఘనత వహించిన టిక్‌టాక్ వీరుడు ఏకంగా ‘పెద్ద పులి’తోనే రీల్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. చివరకు పులి తన సహజ సిద్ధమైన వేట నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో ఆ ‘వైరల్’ ఆశ కాస్తా ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

పాకిస్థాన్‌లోని లాహోర్ సమీపంలోని కహ్నా ప్రాంతంలో ఒక ప్రైవేటు ఫామ్ ఉంది. అక్కడ ఉన్న పెద్ద పులిని చూసి నౌమాన్ హసన్ అనే కంటెంట్ క్రియేటర్‌కు అద్భుతమైన ఐడియా తట్టింది. అదేంటంటే.. పులిని బోనులో నుంచి బయటకు తీసి దాని పక్కన హీరోలా నిలబడి ఒక మాస్ టిక్‌టాక్ వీడియో తీయడం.. అడవిలో ఉంటే ఎవరినైనా చంపి తినే ఆ మృగరాజు తన కెమెరా ఫ్రేమ్‌లోకి రాగానే పిల్లిలా మారిపోయి ఫోజులిస్తుందని ఆ మేధావి భ్రమపడ్డాడు.

అసలు ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఆ ఫామ్ యజమాని ఫయ్యాజ్‌ను. క్రియేటర్ అడగడమే ఆలస్యం.. ఏదో పెంపుడు కుక్కను బయటకు వదిలినట్లు పెద్ద పులి బోను తలుపులు తెరిచేశారు. పులికి టిక్‌టాక్ అల్గారిథమ్ తెలియదు కదా.. బోనులో నుంచి బయటకు రాగానే తన ముందున్న 19 ఏళ్ల యువకుడు తల్హాపై ఒక్కసారిగా విరుచుకుపడింది.

పులి దాడిలో తీవ్రంగా గాయపడిన తల్హాను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆ యువకుడు ప్రాణాలు విడిచాడు. ఇక్కడ అసలు విషాదం ఏంటంటే.. రీల్ చేయాలని ఉబలాటపడింది కంటెంట్ క్రియేటర్ అయితే ఆ వికృత క్రీడకు బలైంది మాత్రం అక్కడ పనిచేస్తున్న అమాయకపు యువకుడు.

ఘటన జరిగిన తర్వాత తీరిగ్గా రంగంలోకి దిగిన పోలీసులు.. కంటెంట్ క్రియేటర్ నౌమాన్ హసన్‌ను.. ఫామ్ యజమాని ఫయ్యాజ్‌ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఇప్పుడు వీరిద్దరికీ జైల్లో బోలెడంత ‘కంటెంట్’ దొరుకుతుందనడంలో సందేహం లేదు.

అడవి జంతువులకు కావాల్సింది ఆకలి తీర్చుకోవడం తప్ప.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. టిక్‌టాక్ ట్రెండ్స్ కాదు. వాటి సహజ స్వభావాన్ని మరిచి వినోదం కోసం ప్రాణాలతో చెలగాటమాడటం మూర్ఖత్వానికి పరాకాష్ట. ఒక వీడియోకు వచ్చే లైకులు.. షేర్లు కొన్ని గంటల్లోనే పాతబడిపోతాయి. కానీ ఆ క్షణికావేశపు స్టంట్ల వల్ల కోల్పోయిన ప్రాణాలు తిరిగి రావు. ఇప్పటికైనా సోషల్ మీడియా వీరులు కళ్ళు తెరవకపోతే వారి తర్వాతి వీడియోలు ఆస్పత్రి బెడ్లపై నుంచో లేదా స్మశానం నుంచో అప్‌లోడ్ చేయాల్సి వస్తుంది.