డాలర్లతో సొంతింటి కల.. తల్లిదండ్రుల భద్రతే ఎన్నారైల తొలి ప్రాధాన్యం
సముద్రాలు దాటినా.. డాలర్ల కొలువుల్లో స్థిరపడినా.. భారతీయుల మనసంతా కన్నవారి చుట్టూ.. పుట్టిన నేల చుట్టూనే తిరుగుతుంటుంది.
By: A.N.Kumar | 1 Nov 2026 5:00 AM ISTసముద్రాలు దాటినా.. డాలర్ల కొలువుల్లో స్థిరపడినా.. భారతీయుల మనసంతా కన్నవారి చుట్టూ.. పుట్టిన నేల చుట్టూనే తిరుగుతుంటుంది. విదేశాల్లో ఎంత హోదా ఉన్నా.. స్వదేశంలో ఉన్న తల్లిదండ్రుల క్షేమం.. వారి ముఖాల్లోని చిరునవ్వు మాత్రమే ఎన్నారైలకు నిజమైన తృప్తినిస్తాయి. ఒకప్పుడు స్వదేశంలో ఇల్లు కొనడమంటే కేవలం పెట్టుబడి.. అద్దె ఆదాయం.. లేదా ఆస్తి విలువ పెరగడం గురించే ఆలోచించేవారు. కానీ నేడు ఆ ఆలోచనా దృక్పథంలో ఒక అద్భుతమైన.. ఆర్ద్రతతో కూడిన సానుకూల మార్పు వచ్చింది.
అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎంత బిజీగా జీవిస్తున్నా.. స్వదేశంలో ఉన్న కన్నవారి వృద్ధాప్య భద్రతే ఎన్నారైలకు తొలి ప్రాధాన్యంగా మారింది. పెట్టుబడికి మించి.. తల్లిదండ్రులపై ఉన్న అపారమైన ప్రేమకు, బాధ్యతకు ప్రతిరూపంగా 'సొంతింటి కల' రూపాంతరం చెందుతోంది.
రెక్కలు ముక్కలు చేసుకుని తమను ఉన్నత స్థానాల్లో నిలబెట్టిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, ఒంటరితనం ఎన్నారైలను తరచూ కలవరపెడుతుంటాయి. అత్యవసర వేళల్లో వారికి అండగా ఉండే వ్యవస్థ ఉందా? అనే ఆందోళన వారిని వెంటాడుతుంటుంది. అందుకే ఇప్పుడు ఇల్లు కొనేటప్పుడు కేవలం చదరపు అడుగుల విస్తీర్ణం చూడటం లేదు.
ఇంట్లో లిఫ్ట్ సౌకర్యం ఉందా? సమీపంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించే ఆసుపత్రులు ఉన్నాయా? 24 గంటల సెక్యూరిటీ, అత్యవసర సహాయం లభిస్తుందా? ఒంటరితనం తెలియకుండా గడిపే వాతావరణం ఉందా? ఈ ప్రశ్నలన్నీ బేరీజు వేసుకుంటూ ఆ సమీపంలో దొరికే ఇళ్లనే తమ కన్నవారి కోసం ఎంచుకుంటున్నారు.
భారతదేశంలోని ప్రధాన నగరాలను పరిశీలిస్తే ఎన్నారైల చూపు ఎక్కువగా హైదరాబాద్ వైపే మొగ్గు చూపుతోంది. ముంబై, బెంగళూరు, ఢిల్లీ, పుణె వంటి నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ అందిస్తున్న ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. మెరుగైన కనెక్టివిటీ వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్లయిన గచ్చిబౌలి, నానక్రామ్గూడ, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలు విలాసవంతమైన జీవితంతో పాటు ప్రశాంతతను అందిస్తుండటంతో ఇక్కడే ఆస్తుల కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు.
వృద్ధాప్యంలో తల్లిదండ్రులు స్వతంత్రంగా.. గౌరవప్రదంగా జీవించాలనేది ప్రతి పిల్లల ఆకాంక్ష. ఎన్నారైల ఈ అవసరాన్ని గుర్తించిన రియల్ ఎస్టేట్ రంగాలు 'సీనియర్ లివింగ్' ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నాయి. నిరంతర ఆరోగ్య రక్షణ, వైద్య సహాయం..
అనుకూలమైన నిర్మాణ శైలి.. సమవయస్కులతో సమయం గడిపేందుకు కమ్యూనిటీ కార్యకలాపాలు.. ఇలాంటి సదుపాయాలు ఉన్న ఇళ్లలో తల్లిదండ్రులు ఒంటరితనానికి దూరం కావడమే కాకుండా స్వతంత్రంగా.. సంతోషంగా జీవించగలరని ఎన్నారై కుటుంబాలు నమ్ముతున్నాయి.
తల్లిదండ్రులకు సురక్షితమైన చిరునామాను అందించడంతో పాటు.. భవిష్యత్తులో తాము కూడా స్వదేశానికి తిరిగి వచ్చి స్థిరపడాలనే సంకల్పం ఎన్నారైలలో బలంగా కనిపిస్తోంది. విదేశీ సంపాదనలో కొంత భాగాన్ని సొంతగడ్డపై స్థిరాస్తిగా మలచుకోవడం ద్వారా కుటుంబానికి ఆర్థిక భద్రత కలుగుతుంది. అంతేకాకుండా విదేశాల్లో పెరుగుతున్న తమ పిల్లలకు భారతీయ మూలాలు.. సంస్కృతులతో అనుబంధాన్ని నిలపడానికి.. రేపటి పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవితాన్ని గడపడానికి ఈ ఇల్లు ఒక నిలయంగా మారుతుందని భావిస్తున్నారు.
ఎన్నారైల రియల్ ఎస్టేట్ నిర్ణయాల్లో కనిపిస్తున్న ఈ మార్పు.. కేవలం అంకెల లెక్కలు.. లాభాల కాంక్ష కాదు. అది మన సంస్కృతికి, కుటుంబ విలువల పట్ల ఉన్న అపరిమితమైన గౌరవానికి నిదర్శనం.
విదేశాల్లో కష్టపడి సంపాదించిన డాలర్లతో స్వదేశంలో కన్నవారికి ఒక సురక్షితమైన.. ఆనందకరమైన నీడను కల్పించడం కంటే గొప్ప కానుక మరొకటి ఉండదు. ఎన్నారైల దృష్టిలో ఇప్పుడు ఆ సొంతిల్లు కేవలం కాంక్రీట్ భవనం కాదు.. తల్లిదండ్రులపై ఉన్న ప్రేమకు.. కుటుంబ బాధ్యతకు.. రేపటి భవిష్యత్తుకు భరోసానిచ్చే ఒక అమూల్యమైన ప్రేమ ముద్రగా చెప్పొచ్చు.
