స్వదేశంతో తెగని బంధం.. ఎన్ఆర్ఐల కలల ఆస్తులకు ఇన్నాళ్లకు లభించిన విముక్తి
పుట్టిన గడ్డపై ఉన్న మమకారంతోనో.. భవిష్యత్తు అవసరాల కోసమో ప్రవాస భారతీయులు తమ కష్టార్జితాన్ని స్వదేశంలో స్థిరాస్తులుగా మార్చుకోవడం దశాబ్దాలుగా వస్తున్న ఒక ఆనవాయితీ.
By: A.N.Kumar | 30 Oct 2026 4:00 PM ISTపుట్టిన గడ్డపై ఉన్న మమకారంతోనో.. భవిష్యత్తు అవసరాల కోసమో ప్రవాస భారతీయులు తమ కష్టార్జితాన్ని స్వదేశంలో స్థిరాస్తులుగా మార్చుకోవడం దశాబ్దాలుగా వస్తున్న ఒక ఆనవాయితీ. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ఎన్ఆర్ఐలు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో ఇళ్లు, ప్లాట్లు, వాణిజ్య సముదాయాలను ఎంతో ఇష్టపడి కొనుగోలు చేశారు. ఆయా ఆస్తులు కేవలం వారికొక ఆర్థిక పెట్టుబడి మాత్రమే కాదు.. స్వదేశంతో.. సొంత ఊరితో వారికున్న ఆత్మీయ అనుబంధానికి సజీవ సాక్ష్యాలు.
అయితే కాలం మారిన కొద్దీ కుటుంబ అవసరాల కోసమో.. విదేశాల్లో స్థిరపడటం వల్ల ఇక్కడి ఆస్తులను నిర్వహించలేకో వాటిని విక్రయించాల్సి వస్తే.. ఇన్నాళ్లూ ఆ ఎన్ఆర్ఐలు అనుభవించిన మానసిక వేదన.. ఎదుర్కొన్న ఆర్థిక చిక్కులు వర్ణనాతీతం. ఆస్తికి సరైన కొనుగోలుదారుడిని వెతికి అమ్మడం ఒకెత్తయితే.. విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును నిబంధనలకు అనుగుణంగా విదేశాల్లోని తమ బ్యాంక్ ఖాతాలకు మళ్లించుకోవడం మరో పెద్ద ప్రహసనంగా ఉండేది. ప్రతి చిన్న లావాదేవీకి ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు తెరవడం.. అదనపు పత్రాలు సమర్పించడం.. ధృవీకరణల కోసం బ్యాంకుల చుట్టూ తిరగడంతో నెలల తరబడి సమయం వృథా అయ్యేది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ నిబంధనలను సరళీకరిస్తూ తీసుకున్న తాజా నిర్ణయం ప్రవాస భారతీయులకు కొండంత ఊరటనిస్తోంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఇకపై ప్రతి లావాదేవీకి ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు తెరిచే అవసరం లేకుండా ఇప్పటికే ఉన్న ఎన్ఆర్ఓ ఖాతాల ద్వారానే ఆస్తుల విక్రయ నిధులను సులభంగా నిర్వహించుకోవచ్చు. మూలధన లాభాల పన్ను , టీడీఎస్ వంటి పన్ను బాధ్యతలను సక్రమంగా పూర్తి చేసిన తర్వాత నిబంధనలకు లోబడి ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 1 మిలియన్ అమెరికన్ డాలర్ల వరకు నిధులను నిరాటంకంగా విదేశీ ఖాతాలకు తరలించుకునే వెసులుబాటు కలిగింది.
ఈ కీలక పరిణామం కేవలం డబ్బులు విదేశాలకు తీసుకెళ్లేందుకే పరిమితం కాకుండా తెలుగు రాష్ట్రాల రియల్ ఎస్టేట్ రంగానికి కూడా సరికొత్త ఊపిరి పోస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్ వంటి ఐటీ హబ్‌లతో పాటు నవనగరాల్లో ఆస్తులు ఉన్న ఎన్ఆర్ఐలు తమ పెట్టుబడులను పునర్వ్యవస్థీకరించుకునేందుకు ముందుకు వస్తున్నారు. పాత ఆస్తులను విక్రయించి వచ్చిన మొత్తంతో ఇక్కడే మెరుగైన ఆదాయాన్ని ఇచ్చే ఆధునిక గేటెడ్ కమ్యూనిటీలు.. ప్రీమియం విల్లాలు, కమర్షియల్ ప్రాపర్టీలలో తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ప్రవాస భారతీయుల హృదయాల్లోని తీపి జ్ఞాపకాలకు.. వారి దశాబ్దాల కష్టార్జితానికి తగిన గౌరవం ఇస్తూ.. పారదర్శకమైన లావాదేవీలకు దారి చూపిన ఈ నిబంధనల సరళీకరణ నిజంగానే ఎన్ఆర్ఐలందరికీ లభించిన గొప్ప వెసులుబాటు..
