Begin typing your search above and press return to search.

అమెరికా కల చెదిరిందా? భారతీయ టెక్కీల గుండెల్లో ఐబీఎం పెట్టిన 'డిసెంబర్ 31' పిడుగు

అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు ఐబీఎం షాక్ ఇచ్చింది. హెచ్‌-1బీ వీసా, గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్‌లను నిలిపివేయాలని నిర్ణయించింది. 2026 డిసెంబర్ 31లోగా ఉద్యోగులు మరో కంపెనీకి మారాలి లేదా విదేశాల్లోని ఐబీఎం కార్యాలయాలకు బదిలీ కావాలి. భారత్‌లో 1,125 ఉద్యోగ ఖాళీలు ఉండటంతో పలువురు భారతీయ టెక్కీలు స్వదేశానికి తిరిగివచ్చే పరిస్థితి ఏర్పడింది.

By:  A.N.Kumar   |   25 Nov 2026 6:21 PM IST
అమెరికా కల చెదిరిందా? భారతీయ టెక్కీల గుండెల్లో ఐబీఎం పెట్టిన డిసెంబర్ 31 పిడుగు
X

కన్నవారిని.. పుట్టిన ఊరిని వదిలి.. ఎన్నో ఆశలతో సప్తసముద్రాలు దాటి అమెరికా గడ్డపై అడుగుపెట్టిన వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు ఇప్పుడు కంటిమీద కునుకు కరువైంది. ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకున్న జీవితాన్ని వదులుకుని.. భారమైన గుండెతో స్వదేశానికి తిరిగి రావాలా.. లేక అనిశ్చితి నీడలో అక్కడే మరొక దారి వెతుక్కోవాలా అన్న సందిగ్ధం ఇప్పుడు ఎన్నో భారతీయ కుటుంబాల్లో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అమెరికాలో స్థిరపడాలన్న వారి అమెరికన్ డ్రీమ్ కు ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం గట్టి బ్రేకులు వేసింది. హెచ్‌-1బీ వీసా.. గ్రీన్‌కార్డు స్పాన్సర్‌షిప్‌లను నిలిపివేస్తూ కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయం.. ఇప్పుడు ఎన్నో భారతీయ కుటుంబాల్లో తీరని ఆందోళనను.. అనిశ్చితిని నింపుతోంది.

ఐబీఎం కన్సల్టింగ్ విభాగంలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు సంస్థ ఊహించని షాక్ ఇచ్చింది. ఇకపై వీసా స్పాన్సర్‌షిప్ ఉండదని తేల్చిచెప్పిన యాజమాన్యం.. ఉద్యోగుల ముందు రెండు జీవన్మరణ ఆప్షన్లను ఉంచింది. అమెరికాలోనే ఉండాలనుకుంటే ఐబీఎం ఉద్యోగాన్ని వదులుకుని.. మరొక స్పాన్సర్‌షిప్ ఇచ్చే కంపెనీని వెతుక్కోవాలి. ఐబీఎంలోనే కొనసాగాలనుకుంటే అమెరికాను విడిచి విదేశాల్లోని ఐబీఎం కార్యాలయాలకు బదిలీపై వెళ్లిపోవాలి.

ఈ నిర్ణయం తీసుకోవడానికి 2026 డిసెంబర్ 31 ని తుది గడువుగా విధించడం ఉద్యోగులను మరింత ఒత్తిడిలోకి నెడుతోంది. బదిలీకి అంగీకరించని వారికి కేవలం మూడు నెలల జీతాన్ని పరిహారంగా ఇచ్చి సాగనంపేందుకు సంస్థ సిద్ధమైంది.

అమెరికాలో ఏళ్ల తరబడి కష్టపడి ఇళ్లు కొనుక్కుని.. పిల్లలను అక్కడి స్కూళ్లలో చదివిస్తున్న కుటుంబాలకు ఈ మార్పు ఒక పీడకలలా మారింది. అమెరికా వెలుపల ఐబీఎం చూపిస్తున్న 1,278 ఉద్యోగ ఖాళీల్లో దాదాపు 1,125 ఉద్యోగాలు భారత్‌లోనే ఉన్నాయి. అంటే సంస్థ పరోక్షంగా భారతీయ టెక్కీలను తిరిగి స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇక్కడే అసలైన ఆర్థిక సవాలు ఎదురవుతోంది. అమెరికాలో డాలర్లలో భారీ వేతనాలు అందుకుంటూ అక్కడి జీవనశైలికి అలవాటు పడిన వారు భారత్‌కు తిరిగి వస్తే వారి వేతనంలో ఏకంగా 80 శాతం వరకు కోత పడే ప్రమాదం ఉంది. ఒకవైపు అమెరికాలో పెరిగిన ఈఎంఐలు.. ఖర్చులు.. మరోవైపు భారత్‌కు వస్తే తగ్గిపోయే ఆదాయం.. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక టెక్కీలు సతమతమవుతున్నారు.

అమెరికాలో మారుతున్న వీసా నిబంధనలు.. పెరుగుతున్న ఖర్చులు.. కఠినతరమైన వలస విధానాల ప్రభావం భారతీయుల ఉనికికే ఎసరు పెడుతోంది.. ఐబీఎం హెచ్‌-1బీ పిటిషన్ల ఆమోదాలు 2024లో 3,000 ఉండగా.. 2026 నాటికి అది 1,600కు పడిపోవడమే ఇందుకు నిదర్శనం. అమెరికాలో హెచ్‌-1బీ వీసాలు పొందుతున్న వారిలో దాదాపు 75 శాతం మంది మన భారతీయులే కావడంతో ఈ పెనుభారం మన వారిపైనే పడుతోంది.

దశాబ్దాలుగా గ్రీన్‌కార్డు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఎందరో నిపుణుల జీవితాలు ఇప్పుడు ఒక్క నిర్ణయంతో మళ్లీ మొదటికి వచ్చాయి. ఒకప్పుడు బంగారు భవిష్యత్తుకు చిరునామాగా నిలిచిన అమెరికా ఉద్యోగం.. నేడు అనిశ్చితికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కష్టపడి నిర్మించుకున్న జీవితాన్ని వదులుకోలేక.. కొత్త దారి దొరక్క సతమతమవుతున్న మన టెక్కీలకు ఇది నిజంగానే ఒక కఠిన పరీక్ష..