హెచ్1బీ వీసాదారులపై మరో పిడుగు.. ఐబీఎం షురూ చేసింది..
ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో ఐబీఎం కీలక నిర్ణయం తీసుకుంది. తన కన్సల్టింగ్ విభాగంలోని చాలా మంది ఉద్యోగులకు హెచ్1బీ వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ నిలిపివేయనుంది. ప్రభావిత ఉద్యోగులు అమెరికా వెలుపల పనిచేయవచ్చని, లేదంటే డిసెంబర్లోగా ఉద్యోగం వీడాలని సూచించింది. ఈ నిర్ణయంతో భారతీయ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.
By: A.N.Kumar | 11 Nov 2026 10:26 AM ISTఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసాదారులపై విధించిన ఆంక్షలు ఇప్పుడు హెచ్1బీ ఉద్యోగులను రోడ్డున పడేసే పరిస్థితి దాపురించింది. ట్రంప్ ఎఫెక్ట్ టెక్ కంపెనీలపై మామూలుగా పడలేదు. ట్రంప్ ను మిడ్ టర్మ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించినా.. ఇమ్మిగ్రేషన్, వీసాల విషయంలో ట్రంప్ అమలు చేసిన కఠిన నిబంధనలకు కంపెనీలన్నీ కూడా తమ వ్యాపారకోణంలో హెచ్1బీ వీసాలు సహా ఇతర వీసాదారులను తగ్గించే పనిని మొదలుపెట్టాయి. ఎందుకంటే హెచ్1బీ వీసాలపై ఆంక్షలు, పరిమితులు.. వారు దేశం దాటి వెళ్లి వస్తే నిరాకరణలు సహా ఎన్నో ఆంక్షలు అమలవుతున్నాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అయితే అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా కంపెనీలు హెచ్1బీ పేరిట విదేశీయులకు ఇస్తూ పొట్టకొడుతున్నాయని కంపెనీల లిస్ట్ నే బయటపెట్టి వార్నింగ్ ఇచ్చేశాడు. రేపొద్దున ఏదైనా జరగవచ్చు. అందుకే దిగ్గజ కంపెనీలన్నీ హెచ్1బీల విషయంలో వదిలించుకునే పనిని మొదలుపెట్టాయి. అవి తమ సొంత కంపెనీల్లో ఇన్నాళ్లు అమలు చేసిన తీరును ఇప్పుడు తమ అనుబంధ కన్సల్టింగ్ బిజినెస్ పరిధిలోనూ అమలు చేస్తుండడంతో హెచ్1బీ వీసాదారులైన ఉద్యోగులకు గట్టి దెబ్బ పడుతోంది.
అమెరికాలో ఇప్పుడు విదేశీ ఉద్యోగులకు మెడమీద కత్తిపెట్టి ఎప్పుడు దేశం నుంచి పంపించేస్తారోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో ఇమ్మిగ్రేషన్ పై ట్రంప్ సర్కార్ విధించిన ఆంక్షలతో దిగ్గజ టెక్ కంపెనీలు కూడా తమ వ్యూహాలు మార్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం ఊహించని నిర్ణయం తీసుకొని హెచ్1బీ ఉద్యోగులకు షాకిచ్చింది. తన కన్సల్టింగ్ వ్యాపారంలోని చాలా మంది ఉద్యోగులకు ఇన్నాళ్లు ఐబీఎం పేరిట ఇస్తున్న మెచ్1బీ వీసాలు, గ్రీన్ కార్డుల స్పాన్సర్ షిప్ ను నిలిపివేయాలని నిర్ణయించింది. కంపెనీ యాజమాన్యాలు స్పాన్సర్ చేసే వీసాలు, లీగల్ ఇమ్మిగ్రేషన్ వంటి అంశాలపై అమెరికాలోని ట్రంప్ కార్యవర్గం తీవ్ర స్థాయిలో చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
తాజాగా నిర్ణయం ఐబీఎం కన్సల్టింగ్ కంపెనీల్లోని వర్క్ వీసాలపై ఆధారపడిన వలస ఉద్యోగులపై తీవ్రప్రభావం పడనుంది. దీంతోపాటు వారి శాశ్వత నివాసానికి ఉన్న మార్గాలు కూడా మూసిపోనున్నాయి. ఇది హెచ్1బీ ఉద్యోగులకు చావుదెబ్బలానే చెప్పొచ్చు.
అయితే ఈ నిర్ణయం పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు అమెరికా బయట కంపెనీ కోసం పనిచేసేందుకు అవకాశం ఇచ్చింది. అంటే వారంతా స్వదేశం వెళ్లి ఆ కన్సల్టెన్సీ తో కలిసి ఐబీఎంలో పనిచేయవచ్చు. దీనికి ఇష్టపడని ఉద్యోగులు ఈ ఏడాది చివరిలోపు కంపెనీని వీడాలని ఐబీఎం ప్రకటించడం అమెరికాలోని ఐబీఎం హెచ్1బీ ఉద్యోగుల్లో కలవరానికి దారితీస్తోంది. డిసెంబర్ లో రిజైన్ చేయాలని ఉద్యోగులకు ఐబీఎం సూచించడంతో అమెరికాలో ఆ సంస్థ ఉద్యోగులు హడలి చస్తున్నారు.
ఈ మేరకు ఐబీఎం కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ కొన్నేళ్లుగా స్కిల్డ్ వీసా ప్రోగ్రామ్ లో కంపెనీ వాటా తగ్గిస్తున్నామని.. అమెరికాలో వృత్తి నిపుణుల కొరతను తీర్చేందుకు ఐబీఎం హైస్కిల్డ్ వీసా ప్రోగ్రామ్ లో భాగస్వామి అవుతోంనది.. దీని వల్ల కంపెనీ వాటా తగ్గుతోందని తెలిపారు.
స్థానికంగానే అమెరికాలో నాణ్యమైన ఉద్యోగుల లభ్యత పెరగడం.. క్లయింట్ల అవసరాలు మారుతుండడం.. అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనల కారణంగా కంపెనీలు ఇప్పుడు వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్ షిప్ నుంచి వైదొలుగుతున్నాయి. ఐబీఎం ఇదే చేసింది.మిగతా టెక్ కంపెనీలు అనుసరించడానికి రెడీ అయ్యాయి. దీంతో అమెరికాలో కన్సల్టెన్సీ ల ద్వారా పనిచేస్తున్న హెచ్1బీ వీసాదారులకు గడ్డు పరిస్థితులు ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది.
