Begin typing your search above and press return to search.

మొన్న ఎన్నిక‌లు.. నేడు వృద్ధి.. భార‌త్‌ను చూసి నేర్చుకోవాలంటున్న ట్రంప్‌

భారత్ సాధిస్తున్న 7 శాతం జీడీపీ వృద్ధిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. భారత్‌లో వడ్డీ రేట్లు తక్కువగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ, అమెరికా కూడా అదే విధానాన్ని అనుసరిస్తే 14-15 శాతం వృద్ధి సాధించవచ్చని అన్నారు. గతంలో భారత ఎన్నికల విధానాన్ని కూడా ఆయన కొనియాడారు.

By:  Garuda Media   |   21 Nov 2026 11:11 PM IST
మొన్న ఎన్నిక‌లు.. నేడు వృద్ధి.. భార‌త్‌ను చూసి నేర్చుకోవాలంటున్న ట్రంప్‌
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో భారత ఎన్నికల విధానంతో పాటు, భారత ఆర్థిక వృద్ధి రేటును ఉదాహరణలుగా చూపుతూ అమెరికా విధానాలలో మార్పులు రావాలని చెబుతున్నారు. నేరుగా ప్ర‌ధాని మోడీపై ప్ర‌శంస‌లు కురిపించ‌క‌పోయినా.. ఇటీవ‌ల మ‌నీలాలో జ‌రిగిన ఆసియాన్ స‌ద‌స్సులో మాత్రం .. మోడీని `గ‌ట్టి మ‌నిషి` అని ప్ర‌శంసించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, కొన్నాళ్ల కింద‌ట కేంద్ర ఎన్నిక‌ల సంఘంపైనా ప్ర‌శంస‌లు కురిపించారు. ఇదేస‌మ‌యంలో ఇప్పుడు భార‌త్ సాధిస్తున్న ఆర్థిక వృద్ధిని కూడా ప్ర‌స్తావించారు.

భార‌త్ సాధించిన 7 శాతం జీడీపీ వృద్ధిపై ప్రశంసలు కురిపించిన ట్రంప్‌.. "భారత్ వైపు చూడండి.. అక్కడ తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయి, 7 శాతం వృద్ధి రేటును సాధిస్తోంది" అని పేర్కొన్నారు.ఇదేస‌మ‌యంలో అమెరికా బ్యాంకుల‌పై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ (ఫెడరల్ రిజర్వ్) వడ్డీ రేట్లను ఎక్కువగా ఉంచడాన్ని తప్పుబడుతూ, భారత్ లాగా వడ్డీ రేట్లను తగ్గిస్తే అమెరికా కూడా 14-15 శాతం ఆర్థిక వృద్ధిని సాధించగలదని ట్రంప్ పేర్కొన్నారు.

రెండు వారాల కింద‌ట‌..

రెండు వారాల కింద‌ట‌.. భారత ఓటరు గుర్తింపు విధానంపై ట్రంప్ ప్ర‌శంస‌లు గుప్పించారు. అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు, ట్రంప్ తన సోషల్ మీడియా 'ట్రూత్ సోషల్' వేదికగా భారత ఎన్నికల ప్రక్రియను కొనియాడారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో జరిగిన సంభాషణను ప్రస్తావిస్తూ, భారత్‌లో 64.6 కోట్ల మందికి పైగా ఓటర్లు ఫోటో గుర్తింపు కార్డులతో ఓటు వేశారని, పోస్టల్ బ్యాలెట్ వినియోగం 1 శాతం కంటే తక్కువగా ఉందని ట్రంప్ తెలిపారు. భారత్‌ను ఆదర్శంగా తీసుకొని, అమెరికాలో కూడా ఓటు వేయడానికి పౌరసత్వ రుజువు, ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరి చేసే సేవ్ అమెరికా యాక్ట్ బిల్లును ఆమోదించాలని ఆయన కాంగ్రెస్‌ను కోరారు.

వైఖరిలో మార్పు...

గతంలో వాణిజ్య సుంకాల వివాదాల సమయంలో భారత ఆర్థిక వ్యవస్థపై విమర్శలు చేసిన ట్రంప్, తాజాగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాల చర్చల నేపథ్యంలో భారత వృద్ధిని ఆదర్శంగా చూపుతున్నారు. అయితే.. ట్రంప్ ఎప్పుడు ఎలా ఉంటారో చెప్ప‌లేం కాబ‌ట్టి.. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను లైట్ తీసుకునేవారు కూడా ఉన్నారు.