ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు
తాజాగా జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసి ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)పై తమ ఆధిపత్యాన్ని పునరుద్ధరించుకుంది
By: A.N.Kumar | 4 Nov 2026 9:59 AM ISTఅమెరికా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తాజాగా జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసి ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)పై తమ ఆధిపత్యాన్ని పునరుద్ధరించుకుంది. అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌పై రిపబ్లికన్లకు ఉన్న పూర్తి నిరంకుశ నియంత్రణకు ఈ ఫలితాలు చెక్ పెట్టాయి.
అమెరికా మీడియా అంచనాల ప్రకారం.. సభలో మెజారిటీకి కావలసిన 218 స్థానాల కంటే చాలా ఎక్కువగా డెమోక్రాట్లు దాదాపు 248 సీట్లను కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తున్నారు. ఇది గత రెండు దశాబ్ద కాలంలోనే డెమోక్రాట్లకు దక్కిన అతిపెద్ద మెజారిటీగా నిలవనుంది.
హౌస్‌ను తమ వశం చేసుకోవడానికి డెమోక్రాట్లకు నికరంగా 3 స్థానాలు మాత్రమే అవసరం కాగా వారు ఊహించని రీతిలో రిపబ్లికన్ల బలమైన కోటలను సైతం బద్దలు కొట్టారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన అనేక రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో ఈసారి డెమోక్రాట్లు ఘనవిజయం సాధించారు.
పెన్సిల్వేనియాలో ముగ్గురు సిట్టింగ్ రిపబ్లికన్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. 7వ నియోజకవర్గంలో ర్యాన్ మెకెంజీపై బాబ్ బ్రూక్స్, 8వ నియోజకవర్గంలో రాబ్ బ్రెస్నహాన్పై పైజ్ కొగ్నెట్టి, 10వ నియోజకవర్గంలో స్కాట్ పెర్రీపై జానెల్ స్టెల్సన్ జయకేతనం ఎగరవేశారు.
ఇతర రాష్ట్రాలు చూస్తే.. వర్జీనియాలో డెమోక్రాట్ అభ్యర్థి ఎలైన్ లూరియా తిరిగి తన పాత స్థానాన్ని గెలుచుకోగా కొలరాడోలో మానీ రుటినెల్, నార్త్ కరోలినాలో జేమీ ఏగర్ విజయాలు సాధించి పార్టీ బలాన్ని మరింత పెంచారు.
ఈ విస్మయపరిచే ఫలితాలు ట్రంప్ పాలనా విధానాలపై అమెరికా ప్రజలు వ్యక్తపరిచిన నిరసనగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ తీసుకొచ్చిన తీవ్రమైన వలస విధానాలు.. ఇరాన్‌తో నెలకొన్న సుదీర్ఘ మిలిటరీ ఉద్రిక్తతలు.. యుద్ధ వాతావరణం.. ఉక్రెయిన్ యుద్ధానికి సాయం.. భారత్, చైనా సహా యూరప్ లోని మిత్రదేశాలపై విధించిన భారమైన దిగుమతి సుంకాలు.. దేశంలో నిత్యావసరాలు, పెట్రోల్ ధరలను ఆకాశానికి ఎత్తాయి. ఈ ఆర్థిక భారం ప్రజల్లో పెల్లుబికిన అసంతృప్తికి ప్రధాన కారణమైంది.
ఈ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన కూడా కీలక పాత్ర పోషించింది. టెక్సాస్‌లో రిపబ్లికన్లకు అనుకూలంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చాలని ట్రంప్ గతంలో తన పార్టీ నేతలను కోరారు. ఫ్లోరిడా, నార్త్ కరోలినా, టెన్నెస్సీ, అలబామా, లూసియానా, మిస్సోరీ రాష్ట్రాల్లోనూ రిపబ్లికన్లు తమకు అనుకూలంగా సీట్లు పెంచుకునే ప్రయత్నాలు చేశారు. దీనికి ప్రతిగా కాలిఫోర్నియాలో గవర్నర్ గావిన్ న్యూసమ్, మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ తదితరులు డెమోక్రాట్లకు అనుకూలంగా కొత్త నియోజకవర్గాల మ్యాప్‌కు మద్దతు కూడగట్టారు. ఈ మార్పులు డెమోక్రాట్లకు కొన్ని కీలక స్థానాల్లో ప్రయోజనం చేకూర్చాయి.
అంతేకాకుండా ట్రంప్ ఆమోద రేటింగ్ పడిపోవడం కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిన ప్రధాన అంశంగా భావిస్తున్నారు. సాధారణంగా అమెరికాలో మధ్యంతర ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగలడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా అదే రాజకీయ సంప్రదాయం కొనసాగింది.
వచ్చే జనవరి 3న కొత్త కాంగ్రెస్ కొలువుదీరనుంది. ఈ క్రమంలో డెమోక్రటిక్ నేత హకీమ్ జెఫ్రీస్ ప్రతినిధుల సభ స్పీకర్‌గా బాధ్యతలు చేపడితే అమెరికా చరిత్రలోనే ఈ పదవిని అధిరోహించిన తొలి నల్లజాతి ఆఫ్రికన్-అమెరికన్ నేతగా చరిత్రకెక్కనున్నారు. ప్రస్తుత స్పీకర్ మైక్ జాన్సన్ ఇకపై మైనారిటీ నేతగా మారక తప్పదు.
ఈ కొత్త మెజారిటీతో ప్రతినిధుల సభలోని శక్తివంతమైన ఓవర్‌సైట్ కమిటీలపై డెమోక్రాట్లకు పూర్తి అధికారం రానుంది. ట్రంప్ కుటుంబ వ్యాపారాలు, క్రిప్టో రంగా పెట్టుబడులు, సరిహద్దు దళాల నిర్వహణ, జెఫ్రీ ఎప్స్టీన్ ఫైళ్లు , విదేశీ విధానాలపై విచారణలకు ఆదేశాలు జారీ చేస్తూ సమగ్ర విచారణలకు డెమోక్రాట్లు సిద్ధమవుతున్నారు. మెడికెయిడ్ నిధుల పునరుద్ధరణ, అఫోర్డబుల్ కేర్ యాక్ట్ విస్తరణ, ఇరాన్ యుద్ధానికి తెరదించడం తమ తొలి ప్రాధాన్యతలని డెమోక్రాట్లు స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల ఫలితాలు ట్రంప్ రెండో విడత పాలనలో కీలక మలుపుగా మారనున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్‌లో రిపబ్లికన్లకు ఉన్న ఆధిపత్యం తగ్గిపోనుండటంతో వైట్‌హౌస్ నిర్ణయాలకు ఇకపై ప్రతిపక్షం నుంచి గట్టి సవాళ్లు ఎదురుకానున్నాయి. విచారణలు, రాజకీయ పోరాటాలు, కీలక బిల్లులపై చర్చలతో రానున్న రోజుల్లో అమెరికా రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ రాబోయే రోజుల్లో వైట్‌హౌస్‌కు.. ట్రంప్ పాలనకు తీవ్రమైన రాజకీయ ముళ్లబాటగా మారనున్నాయి.
