Begin typing your search above and press return to search.

కమలా హారిస్ పేరుపై ట్రంప్ ఎగతాళి.. ఓరీనీ నీ దుంపతెగ.. ఇలా తయారయ్యావేంటయ్యా సామీ

ఒక అగ్రరాజ్యం అధ్యక్షుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో అవేవీ లేని మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు బహుషా మన ట్రంప్ యే కావచ్చు.

By:  A.N.Kumar   |   29 Oct 2026 2:39 PM IST
కమలా హారిస్ పేరుపై ట్రంప్ ఎగతాళి.. ఓరీనీ నీ దుంపతెగ.. ఇలా తయారయ్యావేంటయ్యా సామీ
X

ఒక అగ్రరాజ్యం అధ్యక్షుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో అవేవీ లేని మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు బహుషా మన ట్రంప్ యే కావచ్చు. దీనికి ఆయనకు అవార్డ్ ఇవ్వాల్సిందే.. సవాలక్ష అవలక్షణాలు, నోటి దురుసు.. ప్రత్యర్థులు, మీడియాను ఎగతాళి చేసే అధ్యక్షుడు బహుశా అమెరికా చరిత్రలో మళ్లీ రాబోరు.. ఇందుకు అమెరికన్లు అంతా గర్వపడుతూ కాలర్ ఎగరేసుకోండి.. ట్రంప్ దుందుడుకుతనాన్ని అనుభవించండి.. ఓటేసి గెలిపించినందుకు భరించండి.. ఎప్పుడూ ఏదో రాజేయనిది ట్రంప్ ఎందుకు అవుతాడు.. తాజాగా మన భారత సంతతి మూలాలున్న మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరుపై ట్రంప్ ఎగతాళి చేయడం చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల వాతావరణం రోజూ ఓ రంగు మార్చే డ్రామాను తలపిస్తోంది. పాలసీలు, ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల గురించి సీరియస్‌గా మాట్లాడాల్సిన ప్రచార పర్వంలో.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం సరికొత్త ‘భాషా నైపుణ్యాల’తో సందడి చేస్తున్నారు. టెక్సాస్‌లో జరిగిన ఒక భారీ ప్రచార ర్యాలీలో ఆయన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును రకరకాలుగా ప‌లుకుతూ ఆమె భారతీయ మూలాలను ఉద్దేశించి వేసిన వ్యంగ్య బాణాలు భారతీయ అమెరికన్లకు కాస్తంత చిరాకును తెప్పిస్తున్నాయి.

“పేరులో ఏముంది?” అని ట్రంప్‌ని అడిగితే ఎలా?

పదవుల పోటీ పక్కన పెడితే.. శత్రువు పేరును పలకడంలో కూడా ఓ ప్రత్యేకమైన స్ట్రాటజీ వెతుక్కోవడం ఒక్క ట్రంప్‌కే చెల్లింది. "కమలా.. కమాలా.. కామలా.. ఎలా పిలిచినా ఒకటే" అంటూ ఆయన వేసిన జోకులు సభలోని అభిమానులను నవ్వించాయేమో కానీ అంతర్జాతీయంగా మాత్రం “ఏంటి సామీ ఇది.. పేరు పలకడం కూడా ఇంత పెద్ద సమస్యా?” అని ముక్కున వేలేసుకునేలా చేశాయి. అమెరికాను ప్రపంచ సూపర్ పవర్‌గా నడిపిస్తున్న ఒక అగ్రనేత.. ఎదుటివారి సాంస్కృతిక గుర్తింపును.. పేరును పట్టుకుని కామెడీ చేయడాన్ని చూస్తుంటే.. ‘స్కూల్ లంచ్ బ్రేక్‌లో తోటి పిల్లల పేర్లు పెట్టి వెక్కిరించే చిన్నపిల్లల గొడవలు’ గుర్తురాక మానవు. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఒకరి పేరును సరిగ్గా ఉచ్చరించలేకపోవడం అసమర్థతా.. లేక కావాలని చేసే రాజకీయ వ్యూహమా అనే సందేహం ఇప్పుడు ఓటర్లలో ముదిరిపాకాన పడింది.

ఐడెంటిటీ కార్డు వర్సెస్ ఓటు కార్డు

ట్రంప్ ప్లాన్ ప్రకారం.. సరిహద్దు భద్రత, బైడెన్-కమలా మార్క్ ‘వలస విధానాల’ వైఫల్యాలపై దండెత్తడమే ఆయన అసలు లక్యం. కానీ సరిహద్దు గోడల గురించి మాట్లాడాల్సిన నోటితో.. కమల మూలాల గురించి వ్యాఖ్యానించడం ద్వారా ఆయన ‘సొంత వికెట్’ పడేసుకున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి.

అమెరికాలో ఐటీ నుంచి మెడికల్ రంగాల వరకు తమ చాతుర్యంతో జెండా పాతడమే కాకుండా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన భారతీయ అమెరికన్లు ఈ నాటకాన్ని చూసి పెదవి విరుస్తున్నారు. "మా పేర్లు మా సంస్కృతి మీకు కేవలం ప్రచారంలో జోకులు వేసుకోవడానికే పనికొస్తున్నాయా?" అని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం ‘నమస్తే ట్రంప్’లు చెప్పే నాయకులు.. తీరా ఎన్నికల సభలకు వచ్చేసరికి సంస్కృతిని హేళన చేయడం కాస్త విడ్డూరంగానే ఉంది.

నాటకానికి క్లైమాక్స్ ఎప్పుడు?

అమెరికా ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ, భిన్న సంస్కృతుల సమ్మిళితత్వం ఎంత ముఖ్యమో రాజ్యాంగం పదే పదే చెప్తుంటుంది. కానీ, రాజకీయ వేదికలపై మాత్రం ఇవేమీ పట్టవు. ఒకవైపు బైడెన్-హారిస్ మార్క్ పాలనపై విమర్శలు చేస్తూనే.. మరోవైపు ట్రంప్ మాటల దూకుడు సొంత పార్టీకే తిప్పలు తెచ్చిపెడుతోంది.

ప్రత్యర్థుల పాలసీలపై విమర్శలు గుప్పించి ఓట్లు అడిగితే అది రాజకీయ వ్యూహం అవుతుంది. కానీ పేర్లను పట్టుకుని హేళన చేస్తే అది కేవలం 'టైమ్ పాస్' కామేడీగానే మిగిలిపోతుంది. ఈ ‘నేమ్ గేమ్’ వివాదం ఎంత దూరం వెళ్తుందో.. త్వరలో రాబోయే ఎన్నికల ఫలితాల్లో భారతీయ ఓటర్ల దెబ్బ ట్రంప్‌కు ఏ రీతిలో తగులుతుందో చూడాలి. దాని కోసం మనం వేయికళ్లతో ఎదురుచూద్దాం.. ట్రంప్ మొహం వాలిపోయే రోజు కోసం వెయిట్ చేద్దాం..