Begin typing your search above and press return to search.

ఇరాన్ పై యుద్ధం ఆపేశాడు.. వెనక్కి తగ్గేశాడు.. ట్రంప్‌కు ఇప్పటికైనా జ్ఞానోదయం అయిందా?

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై యుద్ధం ముగిసిందని ప్రకటించారు. ఇకపై దాడులు అవసరం లేదంటూనే, నౌకాదళ దిగ్బంధం కొనసాగుతుందని, చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు చేస్తామని హెచ్చరించారు. చమురు ధరలు, నిత్యావసరాల భారంతో ఓటర్లలో పెరిగిన అసంతృప్తే ట్రంప్ వెనక్కి తగ్గడానికి కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

By:  A.N.Kumar   |   10 Nov 2026 12:09 PM IST
ఇరాన్ పై యుద్ధం ఆపేశాడు.. వెనక్కి తగ్గేశాడు.. ట్రంప్‌కు ఇప్పటికైనా జ్ఞానోదయం అయిందా?
X

జనాలు కర్రుకాల్చి వాత పెడితేనే మన ట్రంప్ తాతకు జ్ఞానోదయం కలగలేదు. ఇన్నాళ్లు మోనార్క్ లా ప్రపంచంపైకి ఒంటికాలిపై లేస్తూ యుద్ధానికి దిగుతూ.. టారిఫ్ లు వేస్తూ రెచ్చిపోయిన ట్రంప్ గొంతు ఇప్పుడు మిడ్ టర్మ్ ఎన్నికల్లో దారుణ ఓటమితో మూగబోయింది. ఓటమి తర్వాత ఇప్పుడు తత్వం బోధపడింది. ఇరాన్‌ను మట్టికరిపిస్తాం.. ఆ దేశ సైనిక శక్తిని పూర్తిగా తుడిచిపెట్టేస్తామంటూ గత ఎనిమిది నెలలుగా గర్జించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు ఒక్కసారిగా శాంతి మంత్రం జపిస్తున్నారు. "ఇరాన్‌తో యుద్ధం ముగిసింది" అంటూ ఆయన చేసిన ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శత్రువును చిత్తుగా ఓడించామంటూనే.. మరోవైపు దౌత్య చర్చలంటూ కలరింగ్ ఇస్తున్న ట్రంప్ తీరు చూస్తుంటే.. ప్రపంచానికి పెద్దన్నలా ఫోజు కొట్టే ఆయనకు ఎట్టకేలకు వాస్తవ పరిస్థితులు అర్థమైనట్లున్నాయి. మరి ఇది నిజంగా అమెరికా సాధించిన విజయమా? లేక ఎన్నికల దెబ్బకు తలొగ్గి.. పరాజయాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆడిన డ్రామానా? అన్నదానిపై జోరుగా చర్చ సాగుతోంది.

ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జసిమ్ అల్ థానీతో వైట్‌హౌస్‌లో భేటీ అయిన తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై ఇరాన్‌పై దాడులు చేయాల్సిన అవసరం లేదంటూ అనూహ్య ప్రకటన చేశారు. అయితే ఇక్కడే అసలు మలుపు ఉంది. యుద్ధం గెలిచామని చెబుతూనే అణ్వాయుధాలను అడ్డుకునే పేరుతో గల్ఫ్ దేశాల మద్దతుతో నౌకాదళ దిగ్బంధం, ఆపరేషన్ ఐరన్ గేట్ మాత్రం కొనసాగిస్తామని పేర్కొన్నారు. అంతేకాదు చర్చలు బెడిసికొడితే మళ్లీ తుపాకులు గర్జిస్తాయని హెచ్చరించడానికి కూడా ఆయన వెనుకాడలేదు. అంటే ప్రస్తుతానికి తుపాకులు మూగబోయినా ఆ యుద్ధ మేఘాలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదన్నది సుస్పష్టం.

ఈ యూటర్న్ వెనుక అసలు రహస్యం అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలేనని రాజకీయ విశ్లేషకులు కోడై కూస్తున్నారు. ఇరాన్‌తో యుద్ధం పుణ్యమా అని ఆకాశాన్నంటిన చమురు ధరలు.. నిత్యావసరాల భారం అమెరికా సామాన్యుడి నడ్డి విరిచింది. దీంతో ఓటర్లు రిపబ్లికన్లకు గట్టిగా మొట్టికాయలు వేయడంతో కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల బలం పెరిగింది. యుద్ధం మరింత కాలం సాగితే ఆర్థికంగా దివాలా తీయడంతో పాటు.. రాజకీయంగా తన పీఠమే కదిలిపోతుందనే భయమే ట్రంప్‌ను క్షణంలో శాంతి బాట పట్టేలా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మాటలతో గప్పాలు కొట్టడం సులభమే కావచ్చు.. కానీ వేల కోట్ల డాలర్లు తగలేస్తూ సైనికుల ప్రాణాలను పణంగా పెట్టి సాగించే ఈ ఆటలో అసలు నష్టపోయేది సామాన్య ప్రజలే. ఎన్నికల ఫలితాలు నేర్పిన ఈ ఆర్థిక పాఠంతో ట్రంప్‌కు జ్ఞానోదయం అయిందో లేదో తెలియదు కానీ.. యుద్ధం ఆగితే ప్రపంచానికి అంతకంటే కావాల్సింది ఏముంది? అయితే గెలుపు-ఓటముల లెక్కలు పక్కన పెడితే.. మళ్లీ ఆ యుద్ధ భూతం తలెత్తకుండా శాంతిని నిలబెట్టడమే ట్రంప్ ముందున్న అసలైన పెద్ద పరీక్ష.. ఇప్పటికైనా ఆ పనిచేస్తాడని ఆశిద్దాం..