Begin typing your search above and press return to search.

ప్రపంచానికి బట్టలు కుట్టించి.. తన పరువు మాత్రం బజారున పడేసుకున్న బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌లో వేతనాల పెంపు కోరుతూ రెడీమేడ్ గార్మెంట్ కార్మికులు 18 రోజులుగా సమ్మె చేస్తున్నారు. నెల జీతం 12,500 టాకాల నుంచి 30,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలతో 428 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లగా, 250 మిలియన్ డాలర్ల ఆర్డర్లు భారత్, వియత్నాం, చైనా, కంబోడియాకు తరలినట్లు కథనం పేర్కొంది.

By:  A.N.Kumar   |   24 Nov 2026 6:06 AM IST
ప్రపంచానికి బట్టలు కుట్టించి.. తన పరువు మాత్రం బజారున పడేసుకున్న బంగ్లాదేశ్
X

ప్రపంచ ఫ్యాషన్ బ్రాండ్లన్నింటికీ మా బట్టలు మేడిన్ బంగ్లాదేశ్ అని కాలర్ ఎగరేసి చెప్పుకునే ఆ దేశానికి.. ఇప్పుడు అదే బట్టల పరిశ్రమ మెడకు ఉరితాడులా మారింది. ఒకప్పుడు తక్కువ ఖర్చుతో టన్నుల కొద్దీ బట్టలు అంటూ ప్రపంచ మార్కెట్‌ను తన వైపు తిప్పుకున్న బంగ్లాదేశ్.. ఇప్పుడు సొంత కార్మికుల సమ్మె దెబ్బకు బట్టలూడదీసుకుని నిలబడాల్సిన పరిస్థితికి వచ్చింది..

కథ ఏంటంటే.. బంగ్లాదేశ్‌లో రెడీమేడ్ గార్మెంట్ కార్మికులు గత 18 రోజులుగా కుట్టు మిషన్లకు తాళం వేసి రోడ్డెక్కారు. ఎందుకంటే.. నెలకు ఇచ్చే 12,500 టాకాలు.. మన లెక్కల్లో సుమారు రూ.9,288 ఇస్తుంటే.. పెరిగిన ధరలకు ఉప్పు, పప్పు కూడా రావడం లేదు మహాప్రభో.. కనీసం 30,000 టాకాలకు పెంచండి అని వేడుకుంటున్నారు. పాపం కార్మికుల లెక్కల్లో న్యాయం ఉంది. కడుపు నిండితేనే కదా చేయి కదిలేది.. కానీ ఫ్యాక్టరీ ఓనర్ల బాధ మరోలా ఉంది. ఇంత జీతాలు పెంచితే అంతర్జాతీయ మార్కెట్లో చీప్ అండ్ బెస్ట్ బ్రాండ్ ఇమేజ్ ఏమైపోవాలి? మా లాభాల సంగతేంటి? అని తలలు పట్టుకుంటున్నారు.

ఈ 'నువ్వా-నేనా' పోరాటంలో అసలు సిసలు షాక్ బంగ్లా ఆర్థిక వ్యవస్థకు తగిలింది. కేవలం 18 రోజుల నిరసనలతో సుమారు 428 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందట.. అంతటితో ఆగిందా? అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. సమయానికి సరుకు రాకపోతే మేమేం చేసుకోవాలి? అంటూ విదేశీ బ్రాండ్లు తమ 250 మిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను ప్యాక్ చేసుకుని వేరే దేశాలకు చెక్కేశాయి. వ్యాపారంలో సెంటిమెంట్లు ఉండవు కదా.. ఒకసారి కస్టమర్ పక్క షాపుకి వెళ్తే మళ్ళీ మన గడప తొక్కడం అంత ఈజీ కాదు.

బంగ్లాదేశ్‌లో మిషన్లు ఆగిపోవడంతో ఆ ఆర్డర్లన్నీ ఇప్పుడు భారత్, వియత్నాం, చైనా, కంబోడియా వైపు క్యూ కడుతున్నాయి. ఒకే బుట్టలో అన్ని గుడ్లు పెట్టకూడదు అనే సామెతను విదేశీ బ్రాండ్లు ఇప్పుడు సీరియస్‌గా తీసుకున్నాయి. బంగ్లాదేశ్ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభం కాకపోయినా దొరికిన ఈ గోల్డెన్ ఛాన్స్‌ను క్యాష్ చేసుకోవడానికి మన దేశం.. వియత్నాం రెడీ అవుతున్నాయి.

ఇక్కడ బంగ్లాదేశ్ ముందున్నది ఒక విచిత్రమైన పరీక్ష. కార్మికులకు కడుపునిండా జీతం ఇవ్వకపోతే ఫ్యాక్టరీలు నడవవు. అలాగని సమ్మెలు ఆపకపోతే వీళ్ళు సమయానికి సరుకు ఇవ్వరు బాబోయ్ అని ప్రపంచ దేశాలు శాశ్వతంగా గుడ్ బై చెప్పేస్తాయి. ప్రపంచానికి బట్టలు కుట్టి ఇచ్చే బంగ్లాదేశ్ ఇప్పుడు తన ఆర్థిక వ్యవస్థకు పడిన ఈ పెద్ద చిల్లును ఎలా కుట్టుకుంటుందో వేచి చూడాలి.