Begin typing your search above and press return to search.

ఇరాన్ ను కొట్టలేక.. పాపం అమెరికాకు ఎంత గతి పట్టింది?

ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన కీలక సమాచారం అందిస్తే 20 మిలియన్ డాలర్లు (సుమారు రూ.190 కోట్లు) బహుమతిగా ఇస్తామని అమెరికా ప్రభుత్వ ‘రివార్డ్స్ ఫర్ జస్టిస్’ విభాగం ప్రకటించింది. సమాచారమిచ్చే వ్యక్తితో పాటు వారి కుటుంబానికి మరో దేశంలో పునరావాసం కల్పిస్తామని తెలిపింది. ఈ ప్రకటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

By:  A.N.Kumar   |   7 Nov 2026 5:10 PM IST
ఇరాన్ ను కొట్టలేక.. పాపం అమెరికాకు ఎంత గతి పట్టింది?
X

ప్రపంచంలోనే తామే ‘సూపర్ పవర్’ అని చెప్పుకునే అమెరికాకు ఇప్పుడు ఒక కొత్త దిగులు పట్టుకుంది. ప్రత్యర్థి దేశాలపై సాంకేతికతతో దాడి చేయడం లేదా ఆర్థిక ఆంక్షలతో ఊపిరాడకుండా చేయడం అంతా పాత పద్ధతి. అందుకేనేమో.. ఇరాన్‌ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం సరిపోక.. ఇప్పుడు కొత్త రకం “స్కీమ్”తో మార్కెట్లోకి వచ్చింది. అదేంటో తెలుసా? ‘సమాచారం ఇవ్వండి.. కోట్లు పట్టుకెళ్లండి’ అని వేడుకుంటున్న దైన్యం కనిపిస్తోంది.

ఇరాన్ అణు ర‌హ‌స్యాల‌ను త‌మ‌కి అందిస్తే ఏకంగా 20 మిలియ‌న్ డాల‌ర్లు అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 190 కోట్లకు పైగా బహుమతిగా ఇస్తామంటూ అమెరికా ప్రభుత్వ ‘రివార్డ్స్ ఫర్ జస్టిస్’ విభాగం దండోరా వేస్తోంది. "షాపింగ్ మాల్స్‌లో బై వన్ గెట్ వన్ ఆఫర్లు చూశాం కానీ గూఢచర్యాన్ని ఇలా వీధి చివర ప్రకటనలా మార్చేయడం ఒక్క అమెరికాకే చెల్లింది" అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

సాధారణంగా ఏ సీక్రెట్ ఏజెన్సీ అయినా శత్రుదేశాల గుట్టు రట్టు చేయడానికి కన్నులకి కనపడని సీక్రెట్ ఏజెంట్లను వాడుతుంది. ప్రపంచంలోనే నంబర్ 1 సీక్రెట్ సర్వీస్ లు అయిన సీఐఏ, ఇజ్రాయెలీ ‘మోసాద్‌’ వంటి సంస్థల వద్ద లేని పరిజ్ఞానం లేదని బిల్డప్ ఇచ్చే అమెరికా.. ఇప్పుడు ఇరాన్ అణు కేంద్రాలు ఎక్కడున్నాయి? అక్కడ శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? పరికరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అని సాధారణ ప్రజలను అడగడం చూస్తుంటే జాలి వేయక తప్పడం లేదు.

అంతర్జాతీయ నిఘా వ్యవస్థలు ఉన్నప్పటికీ.. ఇరాన్ పక్కా వ్యూహంతో తన అణు సమాచారాన్ని ఎవరికీ దొరక్కుండా దాచేసింది. దాంతో విసిగిపోయిన అమెరికా "బాబోయ్.. మా ఏజెంట్ల వల్ల కావట్లేదు.. ఇరాన్ వీధుల్లో తిరిగే సామాన్యులైనా మాకు సమాచారం చెప్పండి.. రూ.190 కోట్లతో పాటు మీ కుటుంబాన్ని కూడా వేరే దేశానికి తరలించే బాధ్యత మాదే" అంటూ ప్యాకేజీలు ప్రకటిస్తోంది.

సైనిక బలంతో లేదా దౌత్యంతో లొంగదీసుకోవాల్సిన స్థానంలో ఉన్న అమెరికా ఇలా నగదు బహుమతుల ఆఫర్లతో ముందుకొస్తుంటే అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇరాన్‌ను నేరుగా ఏమీ చేయలేక.. ఇలా పరోక్షంగా అక్కడి ప్రజలకు ఆశ చూపి నిఘా సేకరించాలనుకోవడం అమెరికా ‘బలహీనత’కు సజీవ సాక్ష్యమని అంటున్నారు.

ఇరాన్ అణు కార్యక్రమం అమెరికా నిద్రను ఎంతగా చెడగొడుతోందో ఈ ఒక్క ప్రకటనతో అర్థమవుతోంది. భవిష్యత్తులో ఇరాన్ శాస్త్రవేత్తల టీ షెడ్యూల్స్.. లంచ్ బాక్స్ వివరాలు చెప్పినా కూడా కోట్లు కురిపిస్తారేమో అని విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. ఇరాన్ ముందర అగ్రరాజ్యం తన అసహాయతను ఇలా ఓపెన్ ఆఫర్ రూపంలో ఒప్పుకోవడం ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అగ్రరాజ్యం పరువు అంగడి బజారులో సరుకులా మారింది.