ఎన్నికలు ఉన్నాయనే షర్మిల ట్వీట్.. జగన్‌పై రాజకీయ కుట్ర - పేర్ని నాని సంచలన ఆరోపణలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆయన సోదరి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య నెలకొన్ని యలహంక ప్రాపర్టీ వివాదంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Political Desk | 31 Oct 2026 8:48 PM ISTమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆయన సోదరి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య నెలకొన్ని యలహంక ప్రాపర్టీ వివాదంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. యలహంక ఆస్తి మొత్తం తనకే చెందుతుందని షర్మిల చేసిన ట్వీట్ పై మాజీ మంత్రి నాని ఘాటుగా స్పందించారు. మున్సిపల్ ఎన్నికల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి షర్మిల కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలనే లక్ష్యంతోనే షర్మిల పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకపోవడం, పోలింగ్ ఏజెంట్లను అడ్డుకోవడం ద్వారా టీడీపీ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తోందని నాని విమర్శించారు. పోలింగ్ ఏజెంట్లు పోలీస్ క్లియరెన్స్ తెచ్చుకోవాలని చెప్పడం ఎక్కడైనా విన్నామా? అని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో చూపించుకోడానికి ఏమీ లేకపోవడంతోనే జగర్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తూ రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకి డైవర్షన్ అవసరమైనప్పుడల్లా షర్మిల వివాదాలను తెరపైకి తెస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనే ఆమె యలహంక ప్రాపర్టీపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి హక్కులు కోరడం వెనుక ఉన్న సమయాన్ని ఆయన ప్రశ్నించారు. షర్మిల చేస్తున్న ఆస్తి హక్కుల వాదనను పేర్ని నాని పూర్తిగా తోసిపుచ్చారు. యలహంకలోని ఆ భూమి జగన్ సతీమణి వైఎస్ భారతి తల్లి డాక్టర్ సుగుణమ్మకు చెందినదని స్పష్టం చేశారు. కడప, అనంతపురం జిల్లాల్లో వైఎస్ భారతి తల్లిదండ్రులు డాక్టర్ గంగిరెడ్డి, డాక్టర్ సుగుణమ్మ ప్రముఖ వైద్యులుగా పనిచేశారని, వారు దశాబ్దాల క్రితమే బెంగళూరులో ఈ స్థలాన్ని కొనుగోలు చేశారని వివరించారు.
సుమారు 20 ఏళ్ల క్రితం జగన్‌కు చెందిన ఒక కంపెనీ ఆ స్థలాన్ని లీజుకు తీసుకుని, అందులో రెండు గెస్ట్‌హౌస్‌లు నిర్మించిందని నాని వివరించారు. షర్మిల బెంగళూరు వచ్చినప్పుడు ఆ గెస్ట్‌హౌస్‌లలో ఉండడానికి అనుమతిచ్చారని తెలిపారు. నేటికీ ఆ భవనాలకు సంబంధించి కరెంట్ బిల్లులు, ఇతర పన్నులన్నీ జగన్ కంపెనీయే చెల్లిస్తోందని తెలిపారు. షర్మిల చెప్తున్న ఎంఓయూలో యలహంక ఆస్తి ప్రస్తావనే లేదని స్పష్టం చేశారు. ఎంవోయూ లేనప్పుడు ఈ ఆస్తిపై ఆమెకు హక్కు ఎలా వస్తుందని నాని ప్రశ్నించారు. తాజ్‌మహల్‌ను చూసినంత మాత్రాన మనది అంటే కుదురుతుందా? అంటూ పేర్ని సెటైర్లు వేశారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత కూడా వైఎస్ జగన్ తన సోదరి షర్మిలకు రూ.230 కోట్లు ఆర్థిక సాయం చేశారని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాహమై 25 ఏళ్లు దాటిన తర్వాత కూడా చెల్లెలికి ఇంత పెద్దమొత్తంలో సాయం చేసే అన్నలు ఎంతమంది ఉంటారని ఆయన ప్రశ్నించారు. షర్మిల కుమార్తె అంజిలి రెడ్డి వివాహాన్ని యలహంకలో నిర్వహించడంపై జగన్ అభ్యంతరం చెప్పడం కేవలం భద్రతా కారణాల వల్లేనని సమర్థించారు. తన సొంత కుమార్తెల పెళ్లిళ్ల విషయంలోనూ ఇదే భద్రతా నిబంధనలు వర్తిస్తాయని జగన్ స్పష్టం చేశారని చెప్పారు. భద్రతా పరమైన సమస్యలు ఉన్నాయని ముందుగానే చెప్పినప్పటికీ, వేదికగా యలహంక అని రాసి వెడ్డింగ్ కార్డ్స్ ఎందుకు ప్రింట్ చేశారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ ఇంట్లో పెళ్లి చేసుకోవాలని జగన్ సూచించినా షర్మిల ఎందుకు అంగీకరించలేదని నాని నిలదీశారు.
సీఎం కుటుంబ ఆస్తి లెక్కలేంటి?
ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుటుంబ వివాదంపై సుదీర్ఘంగా మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని నాని ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ ఆస్తులపై ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు తన సోదరుడు, ఇద్దరు సోదరీమణులకు ఎంత ఆస్తి పంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో సుమారు 7 ఎకరాల విలువైన ఆస్తిని నారా లోకేష్‌కు మాత్రమే ఎలా రాసిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత కుటుంబ ఆస్తుల పంపకాలపై నోరు విప్పని చంద్రబాబు, జగన్ కుటుంబ విషయాలపై మాత్రం బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
