మాజీ ఐపీఎస్.. ఓటమి స్ఫూర్తి.. !
ఎన్నికల్లో పోటీ చేసిన వారంతా గెలిచేస్తారని ఎక్కడా లేదు. గెలుపు-ఓటములు.. సర్వసాధారణం.
By: Garuda Media | 4 Nov 2026 6:30 PM ISTఎన్నికల్లో పోటీ చేసిన వారంతా గెలిచేస్తారని ఎక్కడా లేదు. గెలుపు-ఓటములు.. సర్వసాధారణం. అయితే.. గెలిచిన వారి ఆనందం ఎలా ఉన్నా.. ఓటమి పాలైన వారు కుంగిపోవడం కనిపిస్తుంది. కానీ, దీనికి భిన్నంగా.. మాజీ ఐపీఎస్, విజయవాడ పోలీసు కమిషనర్‌గా కూడా పనిచేసిన ఆలూరి బాల వెంకటేశ్వరరావు(ఏబీవీ).. ఓటమిని కూడా స్ఫూర్తిగా తీసుకున్నారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఆయన మేయర్ పీఠంపైనే ఆశలు పెట్టుకుని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.
నిజానికి రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులు పోటీ చేయడం కొత్తకాదు. గతంలో అసెంబ్లీ, పార్లమెంటుకు పోటీ చేసిన ఐపీఎస్‌లు కూడా ఉన్నారు. అయితే.. ఇప్పటి వరకు ఒక్క ఐఏఎస్ రామాంజనేయులు(ప్రత్తిపాడు) మాత్రమే గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత.. ఇప్పటి వరకు ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు విజయం దక్కించుకున్న పరిస్థితి లేదు. అయినప్పటికీ.. ఏబీవీ ఒకింత సాహసమే చేశారని చెప్పాలి. నేరుగా ఆయన విజయవాడ మేయర్ కోసం బరిలో నిలిచారు.
ఆది నుంచి అంటే.. నామినేషన్ వేసిన రోజు నుంచి కూడా ఏబీవీ అలుపెరగకుండా పనిచేశారు. ప్రచారం చేశారు. అంతేకాదు.. మధ్యలో తనకు ఎదురు వచ్చిన ప్రత్యర్థి పార్టీ జనసేన అభ్యర్థి వంగవీటి రాధాను ఆప్యాయంగా పలక రించారు. చేతులు కలిపి.. విషెస్ చెప్పారు. ఇలా.. ఒక ఆదర్శవంతమైన రాజకీయాలకు తెరదీశారు. తాజాగా ఎన్నికల్లో ఆయనకు కేవలం 12671 ఓట్లు మాత్రమే దక్కగా.. రాధా లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో విజయం కైవసం చేసుకున్నారు. అయినప్పటికీ..ఏబీవీ కుంగిపోలేదు. గతంలో కొందరు ఐపీఎస్‌ల మాదిరిగా కాడి పడేయడమో.. లేక ఎవరినో నిందించడమో చేయలేదు.
ఓటమి నుంచి స్ఫూర్తిని ప్రదర్శించారు. ``నాకు ఓటు వేసిన 12,671 మందికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.`` అంటూ ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అంతేకాదు.. డబ్బు, కులం, మతం తో సంబంధం లేకుండా నగరం లోని అన్ని ప్రాంతాల వారు ఓటేసి ఆదరించారని.. మీ ప్రతినిధిగా విజయవాడ ప్రజల సమస్యలను లేవనెత్తుతూ పరిష్కారాలకోసం ప్రయత్నిస్తూనే ఉంటానని ఆయన పేర్కొన్నారు.
ఇది ఇటీవల రాజకీయ పరిణామాల్లో అరుదైన ఘటన అనే చెప్పాలి. ప్రస్తుతం 60 ఏళ్ల వయసులో ఉన్న ఏబీవీ.. త్వరలోనే సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. అలానే అసెంబ్లీకి కూడా రెడీ అవుతున్నారు. ఏదేమైనా.. ఓటమి నుంచి కూడా స్ఫూర్తి పొందొచ్చని.. నేటి తరం నాయకులకు ఆయన ఉదాహరణగా నిలుస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు.
