యూరప్‌లో 33°Cకే ముచ్చెమటలు ఎందుకు? భారతీయ యువతి వీడియో వైరల్.. అసలు కారణాలు ఇవే!
మన దేశంలో ఎండలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మార్చి దాటిందంటే చాలు సూర్యభగవానుడు 45 డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెల్సియస్‌తో ‘లైవ్ ఫైర్ గేమ్’ ఆడేస్తుంటాడు.
By: A.N.Kumar | 29 Jun 2026 3:02 PM ISTమన దేశంలో ఎండలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మార్చి దాటిందంటే చాలు సూర్యభగవానుడు 45 డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెల్సియస్‌తో ‘లైవ్ ఫైర్ గేమ్’ ఆడేస్తుంటాడు. అంతటి అగ్నిగుండంలోనూ మనం ప్రశాంతంగా బైక్ వేసుకుని తిరిగేస్తుంటాం.. పైగా రోడ్డు పక్కన వేడి వేడి చాయ్ తాగుతూ "ఈరోజు ఎండ కొంచెం తక్కువగా ఉందేంటి?" అని జోకులు కూడా వేసుకుంటాం. అలాంటిది యూరప్‌లో కేవలం 33°C ఉష్ణోగ్రత నమోదు కాగానే అక్కడి జనాలు అల్లాడిపోతున్నారు.
తాజాగా జర్మనీలో ఉంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక భారతీయ యువతి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. "ఇండియాలో 50 డిగ్రీల ఎండను చూసినదాన్ని.. ఇక్కడ 33 డిగ్రీలకే ముచ్చెమటలు పడుతున్నాయి బాబోయ్.. జనాలు ఇళ్లలోంచి బయటకు రావడానికే భయపడుతున్నారు" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో మన నెటిజన్లు "మరీ ఇంత సుకుమారమా సామీ" అంటూ యూరప్ వాసులపై సెటైర్లు వేస్తున్నారు. కానీ ఆగండి.. వారు అంతలా ఇబ్బంది పడటానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి.
ఇళ్లా? లేక ‘హీట్ ట్రాప్’లా?
యూరప్ దేశాల్లో సాధారణంగా చలికాలం ఎక్కువ. అందుకే అక్కడి ఇళ్లను లోపల ఉన్న వేడి బయటకు పోకుండా 'ఇన్సులేటెడ్' పద్ధతిలో ప్రత్యేకంగా నిర్మిస్తారు. చలికాలంలో ఇవి బాగానే కాపాడుతాయి కానీ ఎండలు వచ్చినప్పుడే అసలు కథ మొదలవుతుంది. వేసవిలో పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల ఆ ఇళ్లు వేడిని లోపలే బంధించేసి, నిలువునా 'ఓవెన్' లాగా మారిపోతాయి. పాపం, వారు ఇళ్లల్లో కూడా ప్రశాంతంగా ఉండలేరు.
చెమట పట్టదు.. ఆవిరి కాదు..
మన దేశంలో ఎండ తీవ్రంగా ఉన్నా గాలిలో తేమ తక్కువగా ఉంటే కాస్త మేలు. కానీ యూరప్‌లో కథ వేరు. అక్కడ గాలిలో తేమ శాతం చాలా ఎక్కువ. దీనివల్ల ఒంటికి పట్టిన చెమట త్వరగా ఆవిరి కాదు. ఫలితంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రత కాస్తా.. ఒంటికి 42 డిగ్రీలలా అనిపిస్తుంది. ఊపిరాడనట్లు ఉక్కపోత పెట్టేస్తుంది.
ఏసీలు లేని 'రిచ్' దేశాలు
మన దగ్గర మిడిల్ క్లాస్ ఇళ్లలో కూడా ఏసీలు దర్శనమిస్తుంటాయి. కానీ వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, యూరప్‌లోని అత్యధిక ఇళ్లలో, ఆఫీసుల్లో అసలు ఎయిర్ కండీషనర్లే ఉండవు. ఇప్పటివరకు వారికి అంతటి అవసరం రాలేదు మరి.. ఇప్పుడు హఠాత్తుగా ఎండలు పెరిగేసరికి ఫ్యాన్లు కూడా లేక, ఏసీలు కొందామన్నా దొరకక అల్లాడిపోతున్నారు.
ముగింపు లేని పగటి సమయం
మన దేశంలో సాయంత్రం 6 లేదా 7 గంటలకల్లా సూర్యుడు సెలవు తీసుకుంటాడు. కానీ యూరప్‌లో వేసవిలో పగటి సమయం ఏకంగా 16 నుంచి 17 గంటలు ఉంటుంది. రాత్రి 9 లేదా 10 గంటల వరకు సూర్యుడు ఆకాశంలోనే ఉంటాడు. దీనివల్ల భూమి, బిల్డింగులు చల్లబడటానికి అసలు సమయమే దొరకదు.
గ్లోబల్ వార్మింగ్ పుణ్యమా అని జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ వంటి దేశాలు ఇప్పుడు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికైనా మనవాళ్లు యూరప్ వాసుల సుకుమారాన్ని చూసి నవ్వడం ఆపి.. వాతావరణ మార్పుల తీవ్రతను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
