Begin typing your search above and press return to search.

అమెరికాలో భారతీయుల ఎదుగుదల.. మరోవైపు పెరుగుతున్న వ్యతిరేకత!

ప్రపంచ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఒక స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది.

By:  A.N.Kumar   |   3 Jun 2026 2:32 PM IST
అమెరికాలో భారతీయుల ఎదుగుదల.. మరోవైపు పెరుగుతున్న వ్యతిరేకత!
X

ప్రపంచ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఒక స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది. సిలికాన్ వ్యాలీ నుంచి వాల్ స్ట్రీట్ వరకు... ఐటీ, ఫార్మా, సైబర్ సెక్యూరిటీ వంటి అత్యంత కీలకమైన రంగాలలో భారతీయ మూలాలున్న నాయకులు అగ్రస్థానంలో దూసుకుపోతున్నారు. మైక్రోసాఫ్ట్‌లో సత్య నాదెళ్ల, గూగుల్-ఆల్ఫాబెట్‌లో సుందర్ పిచాయ్, అడోబ్‌లో శంతను నారాయణ్, ఐబీఎంలో అరవింద్ కృష్ణ, యూట్యూబ్‌లో నీల్ మోహన్, పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌లో నికేష్ అరోరా, నోవార్టిస్‌లో వసంత్ నరసింహన్... ఇలా ఒకరా ఇద్దరా, ఎందరో దిగ్గజాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న బహుళజాతి సంస్థలకు దిక్సూచిగా నిలుస్తున్నారు. అమెరికాలో భారతీయుల ఈ అప్రతిహత ఎదుగుదల గ్లోబల్ వేదికపై వారి ప్రతిభకు నిదర్శనం.

నాణేనికి మరోవైపు.. అమెరికాలో భారతీయులపై పెరుగుతున్న అసంతృప్తి

అయితే ఈ అద్భుత విజయగాథ వెనుక ఒక ఆందోళనకరమైన కోణం కూడా నెమ్మదిగా తెరపైకి వస్తోంది. అమెరికా సమాజంలో భారతీయుల జనాభా, వారి ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రభావం వేగంగా పెరుగుతుండటంతో... అక్కడ స్థానికంగా ఉండే కొన్ని వర్గాల్లో అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల టెక్సాస్‌లోని ఫ్రిస్కో నగరంలో జరిగిన ఒక నిరసన ప్రదర్శన ఈ చర్చను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. కొందరు నిరసనకారులు బహిరంగంగా భారతీయ జెండాను చించివేస్తూ భారతీయ వలసలకు వ్యతిరేకంగా తీవ్రమైన నినాదాలు చేశారు. " హిందువుల దండయాత్రను ఆపండి , "వైట్ లైవ్స్ మ్యాటర్" వంటి వ్యాఖ్యలతో వారు తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా ఉత్తర డల్లాస్ వంటి సబర్బన్ ప్రాంతాలలో భారతీయ వలసదారుల సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల స్థానిక జనాభా సమతుల్యత దెబ్బతింటోందనేది వారి ప్రధాన ఆందోళన.

వ్యతిరేకతకు గల కారణాలు ఏమిటి?

భారతీయులపై ఈ తరహా ప్రతికూలత పెరగడం వెనుక సామాజిక, ఆర్థిక నిపుణులు కొన్ని ముఖ్యమైన కారణాలను విశ్లేషిస్తున్నారు. టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ రంగాల్లోని అత్యున్నత, అధిక వేతనాల ఉద్యోగాలను భారతీయులు కైవసం చేసుకోవడం వల్ల స్థానికుల్లో ఒక రకమైన అభద్రతాభావం పెరుగుతోంది.

ఆర్థిక అసూయ..

అమెరికాలో స్థిరపడిన వలస సమాజాలలో భారతీయులు అత్యధిక సగటు ఆదాయం కలిగి ఉండటం, విలాసవంతమైన జీవనశైలిని లీడ్ చేయడం కొందరిలో అసూయకు కారణమవుతోంది. కొన్ని నగరాల్లో ప్రత్యేకించి ఐటీ హబ్‌ల పరిసరాల్లో భారతీయ సంస్కృతి, పండుగలు, జనాభా ప్రాతినిధ్యం పెరగడం వల్ల తమ సాంస్కృతిక అస్తిత్వం ఎక్కడ కోల్పోతామో అనే భయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఇటువంటి విద్వేషపూరిత సంఘటనలను మొత్తం అమెరికా సమాజం యొక్క అభిప్రాయంగా భావించలేము. అమెరికా చరిత్రే వలసదారుల చరిత్ర. ప్రపంచంలోని విభిన్న దేశాల నుండి వచ్చిన ఉత్తమ ప్రతిభావంతులే ఈ దేశాన్ని సూపర్ పవర్‌గా మార్చారు.

ప్రతిభకు సరిహద్దులు లేవు

మరోవైపు భారతీయుల మద్దతుదారులు గ్లోబల్ విశ్లేషకులు ఈ వ్యతిరేకతను పూర్తిగా తప్పుబడుతున్నారు. భారతీయులు అక్రమంగానో, దొడ్డిదారినో ఈ స్థానాలకు చేరుకోలేదని వారి కఠిన శ్రమ, ఉన్నత విద్యా ప్రమాణాలు, సాంకేతిక నైపుణ్యాలు నాయకత్వ లక్షణాల వల్లే వారు గ్లోబల్ సీఈఓలుగా ఎదిగారని స్పష్టం చేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు పన్నుల రూపంలో ఉద్యోగాల సృష్టి రూపంలో భారతీయులు అందిస్తున్న సహకారం అమోఘం.

ప్రపంచీకరణ యుగంలో ప్రతిభకు జాతి, మతం, దేశం అనే హద్దులు ఉండవు. కార్పొరేట్ ప్రపంచంలో భారతీయుల ఎదుగుదల ఒక తిరుగులేని వాస్తవం. అదే సమయంలో అమెరికాలో మారుతున్న సామాజిక సమీకరణలు, స్థానిక రాజకీయాల నేపథ్యంలో వచ్చే వ్యతిరేక స్వరాలు కూడా ఒక సవాలుగా మారుతున్నాయి. ఈ రెండు పరిణామాలను సమతుల్య కోణంలో అర్థం చేసుకుంటూ సాంస్కృతిక సమన్వయంతో ముందుకు సాగడమే ఈ సమస్యకు ఏకైక పరిష్కారం.