Begin typing your search above and press return to search.

అమెరికాలో గర్ల్‌ఫ్రెండ్ హత్య కేసు.. జర్మనీలో భారతీయ విద్యార్థి అరెస్ట్

అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో చోటుచేసుకున్న 19 ఏళ్ల యువతి దారుణ హత్య కేసు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపుతోంది.

By:  A.N.Kumar   |   10 Aug 2026 11:14 AM IST
అమెరికాలో గర్ల్‌ఫ్రెండ్ హత్య కేసు.. జర్మనీలో భారతీయ విద్యార్థి అరెస్ట్
X

అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో చోటుచేసుకున్న 19 ఏళ్ల యువతి దారుణ హత్య కేసు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రియురాలిని హత్య చేసి దేశం దాటి పారిపోయేందుకు యత్నించిన 20 ఏళ్ల భారతీయ విద్యార్థి వరుణ్ బచ్చిగారిని జర్మనీ పోలీసులు బెర్లిన్‌లో అరెస్ట్ చేశారు. టక్సన్ నగరంలోని అరిజోనా యూనివర్సిటీ సమీపంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో ఆగస్టు 6న జులిస్సా రూబి సలాజర్ మృతదేహం లభ్యమైంది. కూతురి నుండి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు అపార్ట్‌మెంట్ తలుపులు తెరిచి చూడటంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. సలాజర్ మృతదేహంపై తీవ్ర గాయాల గుర్తులు ఉన్నాయని.. ఆమెను గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ దారుణానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడు వరుణ్ బచ్చిగారి అత్యంత తెలివిగా ప్రణాళిక రచించి అమెరికా నుంచి పరారయ్యాడు. టక్సన్ నుంచి ముందుగా హ్యూస్టన్‌కు చేరుకున్న అతడు, అక్కడ నుంచి విమానంలో జర్మనీ రాజధాని బెర్లిన్‌కు వెళ్లాడు. బెర్లిన్ మీదుగా భారత్‌కు పారిపోవాలనేది అతడి ప్లాన్ అని భావించిన అమెరికా ఫెడరల్ అధికారులు, అతడి ప్రయాణ వివరాలను అంతర్జాతీయ విమాన శోధన వ్యవస్థల ద్వారా వెంటనే ట్రాక్ చేశారు. వెంటనే జర్మన్ అధికారులను అప్రమత్తం చేయడంతో వారు బెర్లిన్ విమానాశ్రయంలోనే వరుణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని అమెరికాకు డిపాజిట్ చేసే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. అమెరికాకు తీసుకువచ్చిన తర్వాత అతడిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ అభియోగాలు నమోదు చేసి తీవ్రంగా విచారించనున్నారు.

పోలీసుల దర్యాప్తులో వరుణ్ గత వ్యవహారాలకు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు అరిజోనా యూనివర్సిటీలో బిజినెస్ అనలిటిక్స్ చదువుతున్నప్పటికీ.. గతంలో ఒక గొడవలో భాగం కావడంతో కాలేజీ యాజమాన్యం అతడిని యూనివర్సిటీ నుంచి బహిష్కరించినట్లు తెలిసింది. అంతేకాకుండా అరిజోనాలో అతడిపై ఇప్పటికే ఒక దాడి కేసు కూడా కొనసాగుతోంది. అతడికి గతంలోనూ గృహ హింసకు పాల్పడిన చరిత్ర ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

మరొకవైపు సలాజర్ తన బాయ్‌ఫ్రెండ్ వరుణ్ వేధింపులు తాళలేక అతడితో బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. హత్యకు కొన్ని రోజుల ముందు వారి మధ్య తీవ్రమైన గొడవలు జరిగాయని.. అపార్ట్‌మెంట్ నుంచి పెద్దగా అరుపులు కూడా వినిపించాయని సలాజర్ రూమ్‌మేట్స్ పోలీసులకు తెలిపారు. బంధం ముగిసిపోతుందనే ఆగ్రహంతోనే వరుణ్ ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. విదేశాల్లో చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్తుందనుకున్న కూతురు దారుణంగా హత్యకు గురికావడంతో సలాజర్ కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది.

ప్రస్తుతం అమెరికా, జర్మనీ అధికారులు పరస్పర సమన్వయంతో సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. చట్టపరంగా నేరం కోర్టులో రుజువయ్యే వరకు నిందితుడు నిర్దోషిగానే పరిగణించబడతాడని.. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.