నకిలీ వివాహాలు చెక్ : కుటుంబ ఆధారిత వీసాలపై అమెరికా కొత్త నిబంధనలు
నకిలీ వివాహాలు అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయని USCIS స్పష్టం చేసింది.
By: A.N.Kumar | 4 Aug 2025 8:00 PM ISTఅమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్‌కార్డ్) పొందేందుకు అక్రమ మార్గాలను అడ్డుకోవడానికి, కుటుంబ ఆధారిత వీసా దరఖాస్తులపై అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనలు, ప్రధానంగా నకిలీ వివాహాల ద్వారా గ్రీన్‌కార్డు పొందాలని చూసేవారిపై దృష్టి సారించాయి.
ఈ మార్గదర్శకాలు USCIS పాలసీ మాన్యువల్‌లోని “ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేంట్స్ ” అనే శీర్షిక కింద ప్రచురించబడ్డాయి. ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు, అలాగే భవిష్యత్తులో సమర్పించే కొత్త దరఖాస్తులకు కూడా ఇవి వర్తిస్తాయి.
-నకిలీ వివాహాలపై ఉక్కుపాదం
నకిలీ వివాహాలు అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయని USCIS స్పష్టం చేసింది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి, ఇప్పుడు ప్రతి దరఖాస్తును మరింత లోతుగా పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా, వ్యక్తిగత ఇంటర్వ్యూలు, పాత వీసా దరఖాస్తుల సమీక్షలతో పాటు, ఇతరత్రా అన్ని రకాల ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
కొత్త నిబంధనలలోని ప్రధాన మార్పులు
వివాహం నిజమైనదని నిరూపించడానికి బలమైన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. కేవలం కొన్ని పత్రాలు కాకుండా, వైవాహిక బంధానికి సంబంధించిన అన్ని వివరాలను అందించాలి. దరఖాస్తు చేసుకున్న జంటల మధ్య నిజమైన బంధం ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రత్యక్ష ఇంటర్వ్యూలు తప్పనిసరి. ఇందులో వైవాహిక జీవితం గురించి లోతైన ప్రశ్నలు అడుగుతారు. ఒకే వ్యక్తి గతంలో చాలాసార్లు వివాహ ఆధారిత వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే, ఆ దరఖాస్తును అనుమానాస్పదంగా పరిగణిస్తారు. ప్రస్తుతం H-1B వంటి ఇతర వీసాలపై అమెరికాలో ఉన్నవారి గత ఇమ్మిగ్రేషన్ చరిత్రను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు.ఒకవేళ దరఖాస్తు ఆమోదం పొందినా, దరఖాస్తుదారుడికి ఇతరత్రా అర్హత లేదని తేలితే, అతడిపై అరెస్టు చర్యలు చేపట్టడానికి కూడా USCIS సిద్ధంగా ఉంటుంది.
సాక్ష్యాల ప్రాముఖ్యత పెరిగింది
ఉదాహరణకు, అమెరికా పౌరుడైన వ్యక్తి తన భారతీయ జీవిత భాగస్వామికి గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేస్తే, వారి బంధాన్ని నిరూపించడానికి కచ్చితంగా అనేక ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. కలిసి ఉన్న ఫోటోలు, జాయింట్ బ్యాంక్ ఖాతాలు, ఒకే చోట ఉంటున్నట్లు రుజువు చేసే లీజ్ అగ్రిమెంట్లు, స్నేహితులు, బంధువుల నుంచి అఫిడవిట్లు, వివాహ ఆహ్వాన పత్రికలు సమర్పించాల్సి ఉంటుంది.
- ఆకాశ్ ప్రకాష్ మక్వానా కేసుతో ప్రేరణ
ఈ కొత్త మార్గదర్శకాలకు ప్రధాన కారణం భారతీయ విద్యార్థి ఆకాశ్ ప్రకాష్ మక్వానా కేసు అని USCIS పేర్కొంది. J-1 వీసా గడువు ముగిసిన తర్వాత, మక్వానా ఒక నకిలీ వివాహం చేసుకుని గ్రీన్‌కార్డ్ కోసం తప్పుడు ఆధారాలు సమర్పించాడు. అంతేకాకుండా విడాకుల సమయంలో తనపై మానసిక వేధింపులు జరిగాయని తప్పుడు ఆరోపణలు చేస్తూ శరణార్థిగా రక్షణ పొందడానికి ప్రయత్నించాడు. చివరకు మే నెలలో అతను తన నేరాన్ని ఒప్పుకున్నాడు.
-నిజమైన బంధాలకే గుర్తింపు
ఈ మార్పుల ద్వారా USCIS, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని పెంచాలని, నిజమైన, చట్టబద్ధమైన బంధాలకు మాత్రమే గ్రీన్‌కార్డులు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇకపై అమెరికాలో కుటుంబ ఆధారిత వీసా దరఖాస్తుదారులు, పూర్తి నిజాయితీతో, బలమైన ఆధారాలతో తమ సంబంధాన్ని నిరూపించుకోవాలి. నకిలీ వివాహాల ద్వారా పర్మనెంట్ రెసిడెన్సీ పొందాలనే ఆలోచనలకు అడ్డుకట్ట వేయడానికి USCIS కఠినమైన చర్యలు చేపట్టింది. ఈ నిబంధనలు నిజమైన బంధాలను గౌరవిస్తాయని USCIS స్పష్టం చేసింది.
