Begin typing your search above and press return to search.

అమెరికాలో భారతీయ విద్యార్థులకు 'వీసా షాక్'

అమెరికాలో విద్యాభ్యాసం చేసి, అక్కడే ఉద్యోగం చేయాలనుకునే భారతీయ విద్యార్థులకు తాజాగా రెండు పెద్ద ఎదురుదెబ్బలు తగిలాయి.

By:  A.N.Kumar   |   26 Sept 2025 5:10 PM IST
అమెరికాలో భారతీయ విద్యార్థులకు వీసా షాక్
X

అమెరికాలో విద్యాభ్యాసం చేసి, అక్కడే ఉద్యోగం చేయాలనుకునే భారతీయ విద్యార్థులకు తాజాగా రెండు పెద్ద ఎదురుదెబ్బలు తగిలాయి. హెచ్-1బీ (H-1B) వీసా ఫీజు పెంపు ప్రకటన తర్వాత ఇప్పుడు అంతర్జాతీయ విద్యార్థులకు చదువు పూర్తయ్యాక పని చేసేందుకు అనుమతి ఇచ్చే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) కార్యక్రమాన్ని నిలిపివేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

ఈ తాజా ప్రతిపాదనను రిపబ్లికన్ సెనేటర్ చక్ గ్రాస్లీ అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (DHS) ముందుంచారు. విద్యార్థి వీసా హోల్డర్లకు వర్క్ ఆథరైజేషన్లు ఇవ్వడం చట్టవిరుద్ధమని, ఇది అమెరికన్ల ఉద్యోగాలకు పోటీగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇది "టెక్నాలజీ, కార్పొరేట్ గూఢచర్యానికి" అమెరికాను బలహీనంగా మారుస్తుందని ఆయన ఎక్స్ (X) వేదికగా వ్యాఖ్యానించారు. OPT రద్దుతో భారతీయ విద్యార్థుల కెరీర్‌కు అడ్డంకిగా మారనుంది. సెనేటర్ గ్రాస్లీ ప్రతిపాదన గనుక అమలు అయితే అమెరికాలో చదువుతున్న లక్షలాది అంతర్జాతీయ విద్యార్థుల కెరీర్‌కు అది గొడ్డలిపెట్టు కానుంది.

OPT అంటే ఏమిటి?

OPT కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ విద్యార్థులు తమ చదువు పూర్తయ్యాక 12 నుంచి 36 నెలల పాటు అమెరికాలో పనిచేసేందుకు అనుమతి లభిస్తుంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) విద్యార్థులకు ఇది చాలా కీలకమైనది. ఈ ప్రోగ్రామ్ నిలిచిపోతే భారతీయ విద్యార్థులు తమ చదువులు పూర్తికాగానే ఉద్యోగ అన్వేషణకు అవకాశం లేకుండా స్వదేశానికి తిరిగి రావలసి వస్తుంది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి పెట్టే అధిక మొత్తంలో పెట్టుబడికి ప్రతిఫలం లభించని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రముఖ థింక్ ట్యాంక్ అయిన కాటో ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డేవిడ్ బియర్ ఈ ప్రతిపాదనను తీవ్రంగా విమర్శిస్తూ "విద్యార్థుల వర్క్ ఆథరైజేషన్ నిలిపివేయడం హెచ్-1బీ రద్దు కంటే ప్రమాదకరం" అని అభిప్రాయపడ్డారు.

హెచ్-1బీ ఫీజు పెంపు షాక్

OPT ప్రతిపాదన చర్చలోకి రాకముందే ట్రంప్ ప్రభుత్వం కొత్త హెచ్-1బీ అప్లికేషన్‌లపై ఒకేసారి $100,000 (సుమారు రూ. 83 లక్షలు) భారీ ఫీజు విధించనున్నట్లు ప్రకటించింది. ఈ ఫీజు పెంపు ఇప్పటికే ఉన్న లేదా రిన్యువల్ వీసాలపై ప్రభావం చూపదని వైట్‌హౌస్ స్పష్టం చేసినప్పటికీ అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే కొత్త ప్రొఫెషనల్స్‌కు ఇది ఒక పెద్ద ఆటంకం. అమెరికా అధికారిక గణాంకాల ప్రకారం.. 2024లో మంజూరైన హెచ్-1బీ వీసాల్లో 71% భారత్‌కు దక్కాయి. కాబట్టి ఈ రెండు మార్పులు ప్రధానంగా భారతీయ విద్యార్థులు, ఐటీ ప్రొఫెషనల్స్‌పైనే అత్యంత తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

భారతీయ విద్యార్థుల వృద్ధికి తాజా వీసా విధానాల అడ్డంకి

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించే వారిలో భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. 2024లో అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 3.31 లక్షలు దాటింది. వీరిలో 2 లక్షల మంది గ్రాడ్యుయేట్ విద్యార్థులే. గత ఏడాదితో పోలిస్తే ఇది 19% వృద్ధి అయినప్పటికీ, తాజా వీసా విధానాల కారణంగా రానున్న రోజుల్లో కొత్త అడ్మిషన్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

NAFSA ప్రాథమిక డేటా ప్రకారం.. అమెరికాలో రాజకీయ అనిశ్చితి, వీసా సమస్యలు పెరగడంతో 2025 ఫాల్ సెమిస్టర్ అడ్మిషన్లు ఇప్పటికే తగ్గుముఖం పట్టాయి. ఈ పరిణామాలు భారతీయ విద్యార్థులను నిరుత్సాహపరుస్తున్నాయి. వీసా ఆంక్షలు, అనిశ్చితి కారణంగా భారతీయ విద్యార్థులు ఇప్పుడు అమెరికాకు బదులుగా జర్మనీ, కెనడా వంటి దేశాలను ఎంచుకోవడం ప్రారంభించారు. ఈ దేశాలు ముఖ్యంగా STEM కోర్సుల్లో మెరుగైన వర్క్, రెసిడెన్సీ అవకాశాలను అందిస్తున్నాయి.

భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకునే విషయంలో పునరాలోచించాల్సిన సమయం ఆసన్నమైందని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.