Begin typing your search above and press return to search.

అమెరికా షాకింగ్ నిర్ణయం.. ఈ 21 నుంచి 75 దేశాలకు వీసా జారీకి నో

అగ్రరాజ్యం అమెరికా షాకింగ్ నిర్ణయాన్ని వెలువరించింది. ఈ నెల (జనవరి) 21 నుంచి 75 దేశాలకు చెందిన పౌరులకు వీసా జారీని నిలిపి వేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది.

By:  Garuda Media   |   15 Jan 2026 10:12 AM IST
అమెరికా షాకింగ్ నిర్ణయం.. ఈ 21 నుంచి 75 దేశాలకు వీసా జారీకి నో
X

అగ్రరాజ్యం అమెరికా షాకింగ్ నిర్ణయాన్ని వెలువరించింది. ఈ నెల (జనవరి) 21 నుంచి 75 దేశాలకు చెందిన పౌరులకు వీసా జారీని నిలిపి వేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ అంశాన్ని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ఫాక్స్ న్యూస్ రిపోర్టును ఉటంకిస్తూ వెల్లడించిన ఈ సమాచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన నాటి నుంచి రోజుకో సంచలన నిర్ణయాన్ని తీసుకుంటూ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ట్రంప్ సర్కారు తాజా నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం 75 దేశాలకు చెందిన పౌరుల పర్యాటక వీసాల ప్రాసెసింగ్ ను నిలిపివేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని కాన్సులేట్ అధికారులకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వీసా జారీ నిలిపివేసిన దేశాల్లో రష్యా.. బ్రెజిల్.. థాయ్ లాండ్.. యెమెన్.. అఫ్ఘానిస్తాన్ తో పాటు.. ఇరాన్ కూడా ఉన్నట్లు సమాచారం. ఓవైపు ఇరాన్ మీద దాడులకు అగ్రరాజ్యం సిద్ధమవుతున్నట్లుగా సంకేతాలు బలంగా అందుతున్న వేళలో.. 75 దేశాల పౌరులకు వీసా జారీకి నో చెప్పాలన్న నిర్ణయం వెలువడటం గమనార్హం. 75 దేశాల జాబితాలో బంగ్లాదేశ్ కూడా ఉండటం ఆసక్తికరంగా మారింది.

అమెరికా విదేశాంగ శాఖ తాజాగా జారీ చేసిన మెమో ప్రకారం.. 75 దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు.. కాన్సులేట్ జనరల్స్ ఆఫీసుల్లో అన్నిరకాల వలస వీసాలను రద్దు చేస్తారు. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బిగోట్ మాట్లాడుతూ.. కొందరు వలసదారులు అమెరికా ప్రజలను దోపిడీ చేస్తున్నట్లుగా తాము గుర్తించామని.. అందుకే తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పేర్కొన్నారు.

అయితే.. ఈ దేశాలకు వీసాల నిలిపివేత తాత్కాలికమేనని.. దీనిపై పున:పరిశీలన జరుగుతుందన్నారు. ఈ నిర్ణయంతో అమెరికాకు ఇబ్బందులు తప్పవని కొందరు వ్యాఖ్యానిస్తుండగా.. అందుకు భిన్నంగా అమెరికా మాత్రం తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. 75 దేశాలకు వీసా నిలిపివేత వార్తల నేపథ్యంలో.. ఆయా దేశాల జాబితా మీద అధికారికంగా ఎలాంటి పత్రాలు విడుదల కాలేదు. కాకుంటే.. కొన్ని మీడియా రిపోర్టుల ఆధారంగా పలు దేశాల పేర్లు బయటకు వచ్చాయి.

అందులో డొమినికా.. ఆంటిగ్వా.. బార్బుడా దేశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఇరాన్ పై యుద్ధ సన్నాహాల్లో ఉన్న అమెరికా.. ముందస్తుగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటుందన్న అంచనాల్ని అరబిక్ మీడియా వ్యక్తం చేస్తోంది. నిజానికి మూడో ప్రపంచ దేశాల నుంచి వలసల్ని శాశ్వితంగా నిలిపివేస్తామని ఆ మధ్యన ట్రంప్ వ్యాఖ్యానించటం తెలిసిందే. గత నవంబరులో వైట్ హౌస్ కు సమీపంలో ఒక అప్ఘన్ జాతీయుడి కాల్పుల్లో నేషనల్ గార్డ్ మరణించిన వేళ.. ట్రంప్ ఈ తరహా వ్యాఖ్య చేశారు. అందులో భాగంగానే తాజా నిర్ణయం వెలువడి ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది.