Begin typing your search above and press return to search.

ఎఫ్-1 వీసా స్కామ్.. అపాయింట్‌మెంట్ పేరుతో రూ.20 వేల డిమాండ్

అమెరికా కళాశాలల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కనే భారతీయ విద్యార్థుల బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు వీసా ఏజెంట్లు అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారు.

By:  A.N.Kumar   |   6 Oct 2026 9:49 PM IST
ఎఫ్-1 వీసా స్కామ్.. అపాయింట్‌మెంట్ పేరుతో రూ.20 వేల డిమాండ్
X

అమెరికా కళాశాలల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కనే భారతీయ విద్యార్థుల బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు వీసా ఏజెంట్లు అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారు. ఎర్లీ ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తామంటూ వేలల్లో డిమాండ్ చేయడమే కాకుండా అడిగినంత ఇవ్వకపోతే బెదిరింపులకు, దరఖాస్తుల రద్దుకు ఒడిగడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా రెడిట్ వేదికగా ఓ బాధితుడు పంచుకున్న కథనం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

అడిగినంత ఇవ్వలేదని అపాయింట్‌మెంట్ రద్దు

బాధితుడి కథనం ప్రకారం.. అమెరికాలోని ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ఈ ఏడాది 2026 ఆగస్టు సెషన్‌లో చేరాల్సి ఉండగా వీసా ఇంటర్వ్యూ స్లాట్లు లభించలేదు. దీంతో ఆ విద్యార్థి తన అడ్మిషన్‌ను 2027 జనవరి కి వాయిదా వేసుకున్నాడు. ఈ క్రమంలో వీసా స్లాట్ కోసం ఒక ఏజెంట్‌ను సంప్రదించగా అక్టోబర్‌లో ఒక ఎర్లీ స్లాట్ బుక్ చేశానని చెబుతూ.. దానికి అదనంగా రూ. 20,000 చెల్లించాలని సదరు ఏజెంట్ డిమాండ్ చేశాడు.

అదనపు మొత్తం ఇచ్చేందుకు విద్యార్థి నిరాకరించడంతో ఏజెంట్ తన అసలు స్వరూపం బయటపెట్టాడు. సదరు వీసా అపాయింట్‌మెంట్‌ను రద్దు చేశాడు. కొద్దిసేపటికే దరఖాస్తుదారుడికి అపాయింట్‌మెంట్ రద్దయినట్లు అధికారిక ఈమెయిల్ రావడంతో ఆ విద్యార్థి దిగ్భ్రాంతికి గురయ్యాడు.

డేటా హ్యాండోవర్.. సాంకేతిక ముప్పు

ఈ తరహా మోసాలపై విదేశీ విద్య, వీసా నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది విద్యార్థులు తమ వ్యక్తిగత లాగిన్ వివరాలు, పాస్‌పోర్ట్ సమాచారాన్ని ఏజెంట్లకు ఇవ్వడం వల్ల ఇలాంటి ముప్పులు ఎదురవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. త్వరగా స్లాట్లు బుక్ చేయడానికి కొందరు ఏజెంట్లు ఆటోమేటెడ్ స్క్రిప్ట్‌లు ఉపయోగిస్తున్నారు. దీనివల్ల అమెరికన్ ఎంబసీ పోర్టల్‌లో విద్యార్థుల ఖాతాలు శాశ్వతంగా బ్లాక్ లేదా సస్పెండ్ అయ్యే ప్రమాదం ఉంది. అడ్మిషన్ జనవరి 2027కి వాయిదా పడినప్పటికీ విద్యార్థి వద్ద ఇంకా ఆగస్టు 2026 నాటి పాత ఐ-20 ఉంటే వీసా ప్రక్రియలో ఇబ్బందులు వస్తాయి.

నిపుణుల సూచనలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

జనవరి 2027 ఇన్ టేక్ కోసం వీసా ఇంటర్వ్యూకి హాజరయ్యే ముందే సంబంధిత విశ్వవిద్యాలయ డీఎస్ఓ ని సంప్రదించి నవీకరించిన ఐ-20ని పొందాలి. డీఎస్-160 ఫారమ్ పూర్తి చేయడం.. వీసా ఫీజు చెల్లించడం.. స్లాట్ బుక్ చేసుకోవడం వంటి ప్రక్రియలు చాలా సులభం. ఏజెంట్లపై ఆధారపడకుండా విద్యార్థులే స్వయంగా చేసుకోవడం ఉత్తమం. ఎంబసీ పోర్టల్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్, సీక్రెట్ ప్రశ్నల వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.

అదనపు డబ్బులు ఇస్తే గ్యారంటీగా స్లాట్ ఇప్పిస్తామనే ప్రకటనలను నమ్మవద్దు. అధికారిక యు.ఎస్. ఎంబసీ వెబ్‌సైట్‌లో క్రమం తప్పకుండా స్లాట్లను పరిశీలిస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.