Begin typing your search above and press return to search.

ఐదేళ్ల రూల్.. ఇండియన్స్‌కు ఎంత కష్టం? అమెరికా టూరిస్టులకు కొత్త తలనొప్పా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశీయులకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఐదేళ్ల రూల్ ఇప్పుడు భారతీయులకు చుక్కలు కనిపించేలా చేస్తోంది.

By:  A.N.Kumar   |   11 Dec 2025 10:55 AM IST
ఐదేళ్ల రూల్.. ఇండియన్స్‌కు ఎంత కష్టం? అమెరికా టూరిస్టులకు కొత్త తలనొప్పా?
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశీయులకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఐదేళ్ల రూల్ ఇప్పుడు భారతీయులకు చుక్కలు కనిపించేలా చేస్తోంది. విదేశీయుల వీసా స్క్రీనింగ్ ను వేగంగా కఠినంగా అమలు చేస్తోంది. ఇప్పటికే విద్యార్థులు (ఎఫ్1), ఉద్యోగ వీసాలు (హెచ్1బీ) పొందాలనుకునే వారిపై ఎన్నడూ లేని విధంగా పరిశీలనలు అమలుచేస్తూ.. వలసలను అదుపు చేస్తోన్న ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు తన దృష్టిని పర్యాటకులపై కేంద్రీకరిస్తోంది.

5 సంవత్సరాల సోషల్ మీడియా హిస్టరీ తప్పనిసరి

తాజా నివేదికల ప్రకారం.. బ్రిటన్ ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్ వంటి 40 దేశాల నుంచి అమెరికాకు వెళ్లే పర్యాటకులు గత ఐదేళ్ల సోషల్ మీడియా చరిత్రను తప్పనిసరిగా సమర్పించాల్సి రావచ్చు. ఈ విషయంపై యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఒక నోటీస్ జారీ చేసింది. ఈ నోటీస్ కు 60 రోజుల గడువు పెట్టి, పబ్లిక్ కామెంట్స్ కోరారు. అంటే ఇది ఇంకా తుది నిర్ణయం కాదు. కానీ చాలా త్వరలోనే ఈ నిబంధన తప్పనిసరిగా మారే అవకాశం ఉన్నట్టే కనిపిస్తోంది.

5 సంవత్సరాల సోషల్ మీడియా హిస్టరీకి కారణమదే

కొద్ది రోజుల క్రితం ఆప్ఘన్ మూలాలున్న వ్యక్తి వైట్ హౌస్ సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులపై కాల్పులు జరపడం అమెరికా పెద్ద కలకలం రేపింది. ఈ సంఘటన తర్వాత ట్రంప్ ప్రభుత్వం మూడో ప్రపంచ దేశాల నుంచి వచ్చే వలసలను తక్షణమే నిలిపివేసింది. ఇప్పుడు టూరిస్టుల విషయంలో కూడా సోషల్ మీడియా ద్వారా లోతైన పరిశీలన చేయాలని నిర్ణయించింది.

భారతీయులపై ప్రభావం.?

అమెరికా వీసా వెయివర్ ప్రోగ్రామ్ లో భారత్ లేనందున ఈ కొత్త ఐదేళ్ల సోషల్ మీడియా రూల్ మా దేశ టూరిస్టులకు వర్తించదు. అంటే అమెరికా టూరిస్ట్ వీసా (బీ1, బీ2) కొరకు భారతీయులు కొత్తగా అదనపు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు.

ఇండియన్ స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ మాత్రం కష్టాల్లోనే..

ఇప్పటికే 11 నెలలుగా ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇమిగ్రేషన్ పాలసీల వల్ల భారతీయ విద్యార్థులు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలనుకునే యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హెచ్1బీ వీసాల ఆమోదం గణనీయంగా తగ్గించారు. ఎఫ్1 స్టూడెంట్స్ కు అదనపు స్క్రీనింగ్ పెట్టారు. సోషల్ మీడియా డేటాను పరిశీలిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ మరింత కఠినతరం చేశారు. దీంతో ఇవి ఇప్పటికే భారత్ నుంచి అమెరికా వెళ్లే వారికి పెద్ద సవాళ్లుగా మారాయి.

ఐదేళ్ల రూల్ ప్రస్తుతం భారత్ పర్యాటకులకు వర్తించకపోయినా.. అమెరికా వీసా విధానాలు ఏ దిశలో సాగుతున్నాయో స్పష్టంగా తెలుస్తోంది. ఇంకా ఎక్కువ పరిశీలన , ఇంకా ఎక్కువ భద్రతా తనిఖీలు శరాఘాతంగా మారాయి. విద్యార్థులు, ఉద్యోగాల కోసం వెల్లే వారిపై ఇప్పటికే ఈ ప్రభావం స్పష్టంగా ఉంది. అందువల్ల భవిష్యత్తులో ఏ వర్గానికైనా ఇలాంటి నియమాలు విస్తరించే అవకాశమే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.