Begin typing your search above and press return to search.

అమెరికా నుంచి 25 లక్షల మంది నిష్క్రమణ

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక పెట్టిన కఠిన వలస విధానాలతో అమెరికాను విడిచి పెట్టే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

By:  A.N.Kumar   |   24 Dec 2025 11:00 AM IST
అమెరికా నుంచి 25 లక్షల మంది నిష్క్రమణ
X

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక పెట్టిన కఠిన వలస విధానాలతో అమెరికాను విడిచి పెట్టే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఎంతలా అంటే..2025లో అమెరికా ఇమ్మిగ్రేషన్ చరిత్రలో కనీవినీ ఎరుగని మార్పులు చోటుచేసుకున్నాయి. అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం.. దేశం విడిచి వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇదంతా ట్రంప్ పెట్టిన కఠిన వలసవిధానాల కారణంగానే జరుగుతోంది.

అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో వస్తున్న పెను మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకూ సుమారు 25 లక్షల మంది అమెరికాను విడిచి వెళ్లారని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) నివేదిక వెల్లడించింది. ఇందులో అత్యధిక శాతం మంది స్వచ్ఛందంగానే వెళ్లిపోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

19 లక్షల మంది స్వచ్ఛందంగా నిష్క్రమణ

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025 ఏడాది పొడవునా సుమారు 19 నుంచి 20 లక్షల మంది తమంతట తాముగా దేశాన్ని విడిచిపెట్టారు. దీనిని సాంకేతిక పరిభాషలో ‘సెల్ఫ్ డిపోర్టేషన్’ లేదా ‘వాలంటరీ డిపార్చర్’గా పిలుస్తున్నారు. అక్టోబర్ 2025 నాటికి ఈ సంఖ్య 16 లక్షలుగా ఉండగా.. డిసెంబర్ నాటికి అది 19 లక్షలకు చేరింది. ఇదే సమయంలో ప్రభుత్వం నేరుగా బలవంతంగా బహిష్కరించిన వారి సంఖ్య 6.05 లక్షలుగా ఉంది.

వెళ్లే వారికి ప్రభుత్వ ‘బంపర్ ఆఫర్’

స్వచ్ఛందంగా వెళ్లే వారిని ప్రోత్సహించేందుకు అమెరికా ప్రభుత్వం కొన్ని ప్రత్యేక రాయితీలను ప్రకటించడం గమనార్హం. వెళ్లాలనుకునే వారికి ఉచితంగా విమాన టికెట్లు సమకూర్చడం.. 3వేల డాలర్లు (రూ.2.5 లక్షలు) ఇస్తామనడంతో అమెరికా వీడే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రయాణ వివరాలను నమోదు చేసుకునేందుకు ‘సీబీపీ’ హోమ్ అనే యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

స్వచ్ఛందమా? లేక నిర్భంధమా?

ఈ భారీ గణాంకాలపై వలస హక్కుల కార్యకర్తలు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. ‘ప్రభుత్వం అమలు చేస్తున్న కఠినమైన విధానాలు, తనిఖీల భయంతోనే చాలా మంది వెనక్కి వెళ్తున్నారు తప్ప.. అది పూర్తిగా స్వచ్ఛంద నిర్ణయం కాదు’ అని వారు ఆరోపిస్తున్నారు. విధానపరమైన మార్పుల వల్ల లీగల్ స్టేటస్ కోల్పోయిన వారు కూడా ఈ 19 లక్షల జాబితాలో ఉన్నారా? అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది.

డిపోర్టేషన్.. స్వచ్ఛంద నిష్క్రమణ

చట్టపరంగా చూస్తే.. ప్రభుత్వం బహిష్కరించిన వారికి.. స్వచ్ఛందంగా వెళ్లే వారికి మధ్య పెద్ద తేడా ఉంది. ప్రభుత్వం బలవంతంగా పంపిస్తే ఆ వ్యక్తి కనీసం 10 ఏళ్ల వరకూ తిరిగి అమెరికాలో అడుగుపెట్టే అవకాశం ఉండదు. స్వచ్ఛందంగా వెళ్లేవారు భవిష్యత్తులో చట్టబద్ధమైన మార్గాల ద్వారా వీసాల ద్వారా తిరిగి అమెరికా వచ్చే అవకాశం ఉంటుంది.

మొత్తానికి 2025లో నమోదైన ఈ గణాంకాలు అమెరికా ఇమ్మిగ్రేషన్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం దీనిని ఒక విజయంగా చెప్పుకుంటున్నప్పటికీ ఈ గణాంకాల వెనుక ఉన్న వాస్తవ పరిస్థితులపై పూర్తి స్తాయి నివేదిక రావాల్సి ఉంది.