అందుకే అమెరికాను వీడలేకున్నాం.. భారత సంతతి వీడియో వైరల్..
సౌకర్యవంతమైన జీవనశైలికి అలవాటు పడిన తర్వాత, మళ్లీ మన దగ్గరున్న ట్రాఫిక్, కాలుష్యం, రద్దీలోకి రావడం మానసిక సవాలుగా మారుతుంది.
By: Tupaki Political Desk | 28 April 2026 10:00 PM ISTస్వర్ణ లంకను చూసి లక్ష్మణుడు అన్నా ఇలాంటి చోట ఉంటే ఎంత బాగుంటుంది అన్నాడు.. కానీ రాముడు ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ లక్ష్మణ’ అని చెప్పాడు. అంటే పుట్టిన ఊరు స్వర్గం కన్నా గొప్పవి అని రాముడు లక్ష్మణుడికి బతుకు జీవనం సాగించేందుకు ఎక్కడికి వెళ్లినా చివరికి కట్టె కాలే వరకైనా స్వదేశానికి రావాల్సిందే. కానీ ఒక యువతి భారత్ నుంచి అమెరికా వెళ్లి అక్కడి నుంచి ఇండియా వచ్చేందుకు ఇష్టం లేదని చెప్పడం వైరల్ గా మారినా.. చాలా మంది ఆమె వ్యాఖ్యలపై భిన్నంగా స్పందిస్తున్నారు. భారత్ లోని చాలా వరకు మధ్య తరగతి కుటుంబాలకు అమెరికా అంటే ఒక డ్రీమ్ డెస్టినేషన్. అయితే, అక్కడ స్థిరపడిన వారు కొన్నేళ్ల తర్వాత ఇండియాకు తిరిగి వచ్చేస్తారని అందరూ అనుకుంటారు. కానీ, వాస్తవం దానికి భిన్నంగా ఉంది. కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకొని జీవితాన్ని నిర్ణయించుకోరు. అక్కడ లభించే స్వచ్ఛమైన గాలి, క్రమశిక్షణతో కూడిన సమాజం, సౌకర్యవంతమైన జీవనశైలికి అలవాటు పడిన తర్వాత, మళ్లీ మన దగ్గరున్న ట్రాఫిక్, కాలుష్యం, రద్దీలోకి రావడం మానసిక సవాలుగా మారుతుంది.
అమెరికాలో గాలి, నీరు, ఆహారం లాంటి విషయాల్లో ఉన్న కఠినమైన నిబంధనలు అక్కడి ప్రజల ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. మన మెట్రో నగరాల్లో ఉండే కాలుష్య స్థాయిల కంటే అక్కడ గాలి నాణ్యత మెరుగ్గా ఉంటుంది. ఇది దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఊపిరిపోస్తుంది. టాప్ వాటర్ (Tap Water) నేరుగా తాగగలిగే సౌకర్యం, కల్తీ లేని ఆహార పదార్థాలు అనేది అక్కడి ప్రజలకు పెద్ద ప్లస్ పాయింట్.
సామాజిక మర్యాద
రోడ్డుపై వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించడం, క్యూ పద్ధతిని అనుసరించడం, ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవించడం వంటివి అక్కడ ఒక సంస్కృతిలా మారిపోయాయి. ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు లేదంటే రోడ్డుపై ప్రయాణాలు.. అన్నీ ఒక పద్ధతి ప్రకారం సాగుతాయి. ఇండియాలో ఏదైనా చిన్న పని కావాలన్నా ఎదుర్కోవాల్సిన ఒత్తిడి అమెరికాలో ఉండదు.
వృత్తిపరమైన గౌరవం
అమెరికాలో పనికి ఇచ్చే గౌరవం వేరు. భారత్ లో ఏ పని చేసినా దానికి ఒక విలువ ఉంటుంది. అలాగే, పనివేళల తర్వాత వ్యక్తిగత జీవితానికి ఇచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువ. మన దేశంలో కార్పొరేట్ ఉద్యోగాల్లో ఉండే తీవ్రమైన ఒత్తిడి, అనిశ్చితితో పోలిస్తే, అక్కడ లైఫ్ ‘కామ్’గా అనిపిస్తుంది.
భవిష్యత్తు తరం..
ఒకసారి పిల్లలు అక్కడ పుట్టి పెరిగి, అక్కడి స్కూలింగ్ సిస్టమ్‌కు అలవాటు పడితే, వారిని మళ్లీ ఇండియా తీసుకువచ్చి ఇక్కడి పోటీతత్వంతో కూడిన విద్యావ్యవస్థలో ఇమడడం కష్టమని తల్లిదండ్రులు భావిస్తారు. పిల్లల భవిష్యత్తు కోసమే చాలా మంది తమ మాతృభూమికి వచ్చే ఆలోచనను విరమించుకుంటారు.
₹5-6 కోట్లు సంపాదించడం అనేది బయట నుంచి చూసే వారికి పెద్ద మొత్తంగా అనిపించవచ్చు, కానీ అమెరికాలోని ఖర్చులు, పన్నులు చూస్తే అది ఒక మధ్యతరగతి జీవితానికి సరిపోయే మొత్తమే. డబ్బు కంటే కూడా, మనిషి తన రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ‘చిన్న చిన్న అసౌకర్యాలు’ లేకపోవడమే అమెరికాలో స్థిరపడటానికి ప్రధాన కారణం. స్వదేశంపై మమకారం ఉన్నప్పటికీ, సౌకర్యవంతమైన జీవితాన్ని వదులుకోవడం అంత సులభం కాదు.
