Begin typing your search above and press return to search.

అమెరికాలో డెలివరీ ఖాతాల దందా : డాలర్ల ఆశ చూపితే హెచ్1బీ వీసాకు గుడ్ బై చెప్పాల్సిందే

అమెరికా అంటేనే కలల దేశం.. అక్కడ డాలర్లు చెట్లకు కాస్తాయో లేదో కానీ.. అదనపు సంపాదన ఆశ చూపే స్కామ్‌లు మాత్రం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.

By:  A.N.Kumar   |   21 Oct 2026 4:00 PM IST
అమెరికాలో డెలివరీ ఖాతాల దందా : డాలర్ల ఆశ చూపితే హెచ్1బీ వీసాకు గుడ్ బై చెప్పాల్సిందే
X

అమెరికా అంటేనే కలల దేశం.. అక్కడ డాలర్లు చెట్లకు కాస్తాయో లేదో కానీ.. అదనపు సంపాదన ఆశ చూపే స్కామ్‌లు మాత్రం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తాజాగా అమెరికాలో ఉంటున్న మన వలసదారులను, ముఖ్యంగా హెచ్-1బి , హెచ్-4 వీసాదారులను టార్గెట్ చేస్తూ ఓ సరికొత్త మోసం తెరపైకి వచ్చింది. అదేనండీ బాబు.. డోర్‌డాష్, ఉబర్ వంటి డెలివరీ అండ్ రైడ్‌షేరింగ్ ఖాతాలను అద్దెకు తీసుకోవడం లేదా కొనుగోలు చేయడం.. వీసాలు తెచ్చుకుని అమెరికా గడ్డపై అడుగుపెట్టిన కొందరు మహానుభావులు.. ఇప్పుడు అదనపు ఆదాయం కోసం ఇలాంటి అడ్డదారుల బాట పట్టడం హాట్‌టాపిక్‌గా మారింది.

సందర్భం ఏదైనా సరే.. అడ్డదారులు తొక్కడంలో మనవాళ్ల టాలెంటే వేరు. అమెరికాలో ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. ఏకంగా 80కి పైగా ఫేస్‌బుక్ గ్రూపుల్లో 8 లక్షలకు పైగా మెంబర్లు ఉంటూ ఈ అక్రమ వ్యాపారాన్ని గుట్టుగా నడిపిస్తున్నట్లు 'టెక్ ట్రాన్స్‌పరెన్సీ ప్రాజెక్ట్' పరిశోధనలో బయటపడింది. అసలు రూల్స్ ప్రకారం డోర్‌డాష్‌లో పనిచేయాలంటే కఠినమైన బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్, ఐడీ ప్రూఫ్స్ ఉండాలి. కానీ ఆ తనిఖీల నుంచి తప్పించుకోవడానికి కొందరు కేవలం వంద డాలర్లు చెల్లించి ఇతరుల ఖాతాలను అద్దెకు తీసుకుంటున్నారు. కొన్ని ఖాతాలను అయితే ఏకంగా 500 డాలర్లకు అమ్మేసుకుంటున్నారట..

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ , రిస్క్ ఉంది. అమెరికా చట్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? హెచ్-1బి వీసాపై ఉన్నవారు కేవలం తమకు అనుమతి ఉన్న యజమాని వద్దే పనిచేయాలి. ఇక హెచ్-4 వీసాదారుల్లో అందరికీ ఉద్యోగం చేసే పర్మిషన్ ఉండదు. అలాంటిది ఎవరో గుర్తుతెలియని వ్యక్తుల ఖాతాలతో అమెరికా రోడ్లపై బర్గర్లు, పిజ్జాలు డెలివరీ చేస్తూ అడ్డంగా దొరికిపోతే.. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోవడమే దండగ. ఇమ్మిగ్రేషన్ అధికారుల కంట పడితే అనధికారిక ఉపాధి కింద లెక్కగట్టి అమెరికా నుంచి సాగనంపడం ఖాయం. నకిలీ గుర్తింపు పత్రాలు లేదా మోసపూరిత పద్ధతులు వాడితే జీవితాంతం అమెరికా కల కలగానే మిగిలిపోతుంది.

కొద్దిపాటి అదనపు డాలర్ల కోసం.. ఎంతో కష్టపడి సంపాదించుకున్న వీసాను, భవిష్యత్తును గాలికి వదలడం తెలివైన పనేనా? సోషల్ మీడియాలో కనిపించే ఇలాంటి డొల్ల ప్రకటనలను నమ్మి మోసపోతే జేబు ఖాళీ అవ్వడమే కాకుండా.. ఇమ్మిగ్రేషన్ కష్టాలు చుట్టుముడతాయి. అందుకే చట్టబద్ధమైన మార్గాల్లోనే నడుచుకోవడం మంచిది. తాత్కాలిక లాభాల కోసం మీ అమెరికా డ్రీమ్‌ను రిస్క్‌లో పడేయకండి..