Begin typing your search above and press return to search.

హెచ్-1బీ లక్కు ముగిసింది.. ఇకపై అమెరికా వెళ్లాలంటే 'అదృష్టం' కాదు.. 'అకౌంట్ బ్యాలెన్స్' ముఖ్యం

అమెరికా.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల స్వర్గధామం. ఒకప్పుడు మన కుర్రాళ్లకు పెళ్లి సంబంధాలు కుదరాలన్నా.. సమాజంలో 'స్టేటస్' పెరగాలన్నా పాస్‌పోర్ట్ మీద అమెరికా వీసా స్టాంప్ పడాల్సిందే.

By:  A.N.Kumar   |   19 July 2026 5:11 PM IST
హెచ్-1బీ లక్కు ముగిసింది.. ఇకపై అమెరికా వెళ్లాలంటే అదృష్టం కాదు.. అకౌంట్ బ్యాలెన్స్ ముఖ్యం
X

అమెరికా.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల స్వర్గధామం. ఒకప్పుడు మన కుర్రాళ్లకు పెళ్లి సంబంధాలు కుదరాలన్నా.. సమాజంలో 'స్టేటస్' పెరగాలన్నా పాస్‌పోర్ట్ మీద అమెరికా వీసా స్టాంప్ పడాల్సిందే. అందుకోసం ప్రతి ఏటా మార్చి నెల వచ్చిందంటే చాలు.. టెంపుల్స్ చుట్టూ ప్రదక్షిణలు, కొబ్బరికాయల మొక్కులు, "దేవుడా ఆ లాటరీలో నా పేరు వచ్చేలా చూడు" అనే ప్రార్థనలతో ఐటీ కారిడార్లు మారుమోగిపోయేవి. మొదటి విడతలో పేరు రాకపోతే "పర్లేదులే బాసూ.. సెకండ్ లక్, థర్డ్ లక్ రెండో, మూడో లాటరీ ఉంటుందిగా" అని సరిపెట్టుకునేవారు.

కానీ ఇకపై ఆ కొబ్బరికాయల ఖర్చు, గుళ్ల చుట్టూ తిరిగే ఓపిక దండగ అని తేల్చేసింది అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్.సీఐఎస్). 2027 ఆర్థిక సంవత్సరానికి ఎలాంటి 'రెండో విడత హెచ్-1బీ లాటరీ' ఉండే ప్రసక్తే లేదని బోర్డు తిప్పేసింది. అంటే "ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్ ఇంప్రెషన్.. ఫస్ట్ లాటరీనే లాస్ట్ లాటరీ" అన్నమాట..

బాబోయ్ ట్రంప్ తాత మార్పులు.. 'లక్కీ డిప్' క్లోజ్

ఈ ఘనత అంతా ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త 'రూల్స్' దే. ఇప్పటిదాకా నడిచిన 'రాండమ్ లాటరీ' అదృష్టం బాగుంటే ఎవరికైనా వీసా రావడం అనే లక్కీ డ్రా విధానానికి చెక్ పెట్టేసి, 'వేతన ఆధారిత ఎంపిక' అనే కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అంటే "మీకు అదృష్టం ఎంత ఉందో మాకు అనవసరం.. మీ కంపెనీ మీకు ఎంత ఎక్కువ జీతం ఇస్తుందో చెప్పండి.. దాన్ని బట్టి వీసా ఇస్తాం" అని తేల్చేశారు.

దీనికి తోడు ఒకప్పుడు చీప్ అండ్ బెస్ట్ గా దరఖాస్తు చేసుకునే హెచ్-1బీ ఫీజులను కంపెనీలకు చుక్కలు కనిపించేలా భారీగా పెంచేశారు. దాంతో కంపెనీలు కూడా "ఎవడో ఒకడికి అప్లై చేద్దాంలే" అనుకోకుండా నిజంగానే ఎక్కువ జీతం ఇచ్చే అత్యంత కీలకమైన, నైపుణ్యం ఉన్న తోపులకే దరఖాస్తులు సమర్పించాయి.

తగ్గని కోటా.. షాక్‌లో ఐటీ జనాలు

గతంలో 3.43 లక్షలుగా ఉన్న రిజిస్ట్రేషన్లు, ఫీజుల వాత తట్టుకోలేక ఈసారి 2.11 లక్షలకే పడిపోయాయి. అప్లికేషన్లు తగ్గాయి కాబట్టి ఎంపికైన కంపెనీలు వెనక్కి తగ్గుతాయని కచ్చితంగా 'సెకండ్ ఛాన్స్' వస్తుందని చాలామంది ఆశగా ఎదురుచూశారు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది.

ట్విస్ట్ ఏంటంటే ఈసారి 65,000 జనరల్ కేటగిరీ వీసాలు, 20,000 మాస్టర్స్ కోటా వీసాలు మొదటి దెబ్బకే వందకు వంద శాతం ఫుల్ అయిపోయాయి. అప్లై చేసిన కంపెనీలన్నీ ఒక్క పెటిషన్ కూడా వదలకుండా ఫీజులు కట్టేసి వీసాలు ఎగరేసుకుపోయాయి. దాంతో రెండో లాటరీ అనే ముచ్చటే లేకుండా పోయింది.

ఇకపై లెక్క మారాలి.. స్కిల్ పెరగాలి

ఈ తాజా దెబ్బతో తేలిపోయింది ఏంటంటే.. ఇకపై అమెరికా ఉద్యోగం అంటే "లక్కు కాదు.. లెక్క.. తక్కువ జీతంతో ఎక్కువ మందిని అమెరికా ఫ్లైట్ ఎక్కించే ఐటీ కన్సల్టెన్సీల పాత పప్పులు ఇక ఉడకవు. అమెరికా కంపెనీలకు కూడా "క్వాంటిటీ కంటే క్వాలిటీ" ముఖ్యం అయిపోయింది.

కాబట్టి అమెరికా వెళ్లాలనుకునే ఐటీ నిపుణులు ఇకపై జాతకాలు నమ్ముకుంటే లాభం లేదు. ఎక్కువ జీతం వచ్చే రేంజ్ లో కోడింగ్ నైపుణ్యాలు, స్పెషలైజేషన్ పెంచుకోవాల్సిందే. లేదంటే "అమెరికా కలని" అటకెక్కిచ్చి హ్యాపీగా బెంగళూరు, హైదరాబాద్ ఐటీ హబ్‌లలోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు లక్కు నడవట్లేదు బాసూ.. కేవలం 'హై-సాలరీ స్కిల్' మాత్రమే నడుస్తోంది.