Begin typing your search above and press return to search.

డాలర్ కల వెనుక కన్నీటి గాథ: అమెరికాలో భారతీయ టెకీల గడ్డు కాలం

అమెరికాలో ఉద్యోగం.. డాలర్లలో సంపాదన.. సుఖమయమైన జీవనం.. ఇవి సగటు భారతీయ మధ్యతరగతి యువత కలలు.

By:  A.N.Kumar   |   8 May 2026 3:51 PM IST
డాలర్ కల వెనుక కన్నీటి గాథ: అమెరికాలో భారతీయ టెకీల గడ్డు కాలం
X

అమెరికాలో ఉద్యోగం.. డాలర్లలో సంపాదన.. సుఖమయమైన జీవనం.. ఇవి సగటు భారతీయ మధ్యతరగతి యువత కలలు. కానీ నేడు ఆ కలలు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. ఎంతో కష్టపడి అమెరికాలో స్థిరపడిన వేలాది మంది భారతీయ టెకీలు ఇప్పుడు ఒక్కసారిగా రోడ్డున పడుతున్నారు. హెచ్-1బి వీసా నిబంధనలు, అమెరికన్ కంపెనీల లేఆఫ్స్ వెరసి వారి జీవితాలను అగమ్యగోచరంగా మార్చేశాయి.

ప్రపంచ సాఫ్ట్‌వేర్ రంగానికి కేంద్రబిందువైన అమెరికాలో ప్రస్తుతం భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కేవలం 60 రోజుల 'గ్రేస్ పీరియడ్' వారి భవిష్యత్తును శాసిస్తోంది. ఉద్యోగం పోయిన 60 రోజుల్లోపు మరో కంపెనీ నుంచి వీసా స్పాన్సర్‌షిప్ సాధించకపోతే దశాబ్దాల కష్టం బుగ్గిపాలు కావాల్సిందే.

ఒక్క లేఆఫ్‌తో తలకిందులైన జీవితం

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. 2018లో ఎంతో ఉత్సాహంతో అమెరికా వెళ్లిన ఒక 30 ఏళ్ల టెకీ ఉదంతం కళ్లకు కడుతోంది. కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసి, ఎంతో కష్టపడి 2021లో హెచ్-1బి వీసా సాధించి డల్లాస్‌లో ఒక ఇంటిని కూడా కొనుగోలు చేశారు. గ్రీన్ కార్డ్ ప్రక్రియ కూడా మొదలైంది. అయితే క్లయింట్ ప్రాజెక్ట్ రద్దు కావడంతో ఆయన ఉద్యోగం పోయింది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. చేతిలో ఉన్న గ్రీన్ కార్డ్ పెర్మ్ అప్లికేషన్ రద్దయింది. జూన్ 8వ తేదీలోపు కొత్త ఉద్యోగం రాకపోతే ఆయన దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. "ఇప్పుడు నేను నెలల గురించి కాదు.. మిగిలి ఉన్న ఒక్కో రోజు గురించి లెక్కపెడుతున్నాను" అని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

స్పాన్సర్‌షిప్ అంటేనే వెనుకాడుతున్న కంపెనీలు

మరోవైపు చదువు పూర్తి చేసుకుని కెరీర్ ప్రారంభించాల్సిన విద్యార్థుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. స్టెమ్ ఓపీటీ పై ఉన్న బయోమెడికల్ ఇంజినీర్ ఒకరు మాట్లాడుతూ.. తమ వద్ద ప్రతిభ ఉన్నా భవిష్యత్తులో హెచ్-1బి స్పాన్సర్ చేయాల్సి వస్తుందనే భయంతో కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడం లేదని వాపోయారు. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు.. వ్యవస్థాగతమైన సంక్షోభంగా మారుతోంది.

గణాంకాలు చెబుతున్న భయానక నిజాలు

వీసా అనిశ్చితి, ఉద్యోగ భద్రత లేకపోవడం, ఆర్థిక భారం భారతీయ యువతపై తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగిస్తోంది. నివేదికల ప్రకారం 2017 నుంచి 2025 మధ్య కాలంలో అమెరికాలో సుమారు 227 మంది భారతీయ టెకీలు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. వీసా గడువు ముగుస్తుందన్న భయం, ఇల్లు-కారు ఈఎంఐల భారం యువతలో గుండెపోటులు పెరగడానికి కారణమవుతున్నాయి. గడువు పొడిగించుకోవడానికి చాలామంది బీ-2 విజిటర్ వీసాకు మారుతున్నా యూఎస్.సీఐఎస్ నిబంధనలు కఠినతరం కావడంతో అది కూడా కష్టతరంగా మారుతోంది.

ఒకప్పుడు అమెరికా అంటే అవకాశాల గని. కానీ నేడు హెచ్-1బి వీసా నిబంధనలు భారతీయ ప్రతిభను ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నాయి. ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇల్లు, పిల్లల చదువులు, స్థిరపడ్డ జీవితం అన్నీ ఒకే ఒక్క 'పింక్ స్లిప్' తో గాలిలో కలిసిపోతున్నాయి. గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాల నిరీక్షణ, గ్రేస్ పీరియడ్ భయం మధ్య భారతీయ టెకీలు రాత్రింబవళ్లు భయం గుప్పిట్లోనే గడుపుతున్నారు.