Begin typing your search above and press return to search.

H-1B వీసా ఫీజు పెంపు : భారతీయుల పెళ్లిళ్లు క్యాన్సిల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకున్న H-1B వీసా అప్లికేషన్ ఫీజు పెంపు నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

By:  A.N.Kumar   |   22 Sept 2025 11:05 AM IST
H-1B వీసా ఫీజు పెంపు : భారతీయుల పెళ్లిళ్లు క్యాన్సిల్
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకున్న H-1B వీసా అప్లికేషన్ ఫీజు పెంపు నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా భారతీయులు ఈ నిర్ణయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వీసా దరఖాస్తు ఫీజు సుమారు రూ.83 లక్షలకు పెరగడంతో అమెరికాలో ఉన్న వీసా హోల్డర్ల కుటుంబ జీవితాలు, వ్యక్తిగత కార్యక్రమాలు గందరగోళానికి గురవుతున్నాయి.

*పెళ్లిళ్లు క్యాన్సిల్ – కన్నీరు మున్నీరైన కుటుంబాలు

ఇండియాకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని ప్లాన్‌ చేసిన పలువురు యువతీ–యువకులు ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. “తిరిగి అమెరికాకు రాకుండా పోతే ఉద్యోగం పోతుందనే భయంతో నా పెళ్లిని వాయిదా వేసుకున్నా” అని ఒక యువకుడు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. మరో యువతి రెడ్డిట్‌లో పోస్ట్ చేస్తూ “నేను రాలేనని తెలిసి మా అమ్మ ఏడ్చేసింది. ఏళ్లుగా ఇంటివారిని చూడలేకపోతున్నాను. ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల వారిని కలిసే అవకాశం కూడా పోయింది” అని కన్నీటి పర్యంతమైంది.

కంపెనీల ఆదేశాలతో పరిస్థితి మరింత క్లిష్టం

అమెరికాలోని టెక్ దిగ్గజాలు.. అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు తమ ఉద్యోగులకు తక్షణమే తిరిగి అమెరికాకు రావాలని ఆదేశాలు జారీ చేశాయి. సెప్టెంబర్ 21 రాత్రి లోపు ఆఫీసులో హాజరు కావాలని స్పష్టమైన మెయిల్స్ పంపించడంతో ఇప్పటికే భారత్‌కి వచ్చిన ఉద్యోగులు పెళ్లిళ్లు, కుటుంబ వేడుకలు, పూజలు అన్నీ వదిలేసి అమెరికాకు వెళ్ళే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

ఫీజు పెంపుపై క్లారిటీ ఇచ్చిన వైట్‌హౌస్

ఈ నేపథ్యంలో వీసా హోల్డర్లలో ఆందోళన పెరగడంతో వైట్‌హౌస్ సెక్రటరీ కరోలిన్ స్పందించారు. “ఇప్పటికే H-1B వీసా కలిగిన వాళ్లకు ఈ పెంపు ప్రభావం ఉండదు. దేశం వెలుపల ఉన్నా, తిరిగి అమెరికాలోకి ప్రవేశించేందుకు ఎలాంటి అదనపు రుసుము అవసరం లేదు. కొత్త వీసా అప్లికెంట్లకే ఈ ఫీజు వర్తిస్తుంది. ఇది వార్షిక రుసుము కాదు, ఒక్కసారిగా చెల్లించాల్సి ఉంటుంది” అని స్పష్టం చేశారు.

* భారతీయ ఐటీ రంగంపై ప్రభావం

అమెరికాలో H-1B వీసాపై ఆధారపడి ఉన్న లక్షలాది మంది భారతీయులపై ఈ నిర్ణయం నేరుగా ప్రభావం చూపనుంది. వీసా ఫీజు భారీగా పెరగడంతో కొత్త అవకాశాల కోసం దరఖాస్తు చేయాలనుకునే వారిని వెనక్కు నెడుతుందనే అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఇప్పటికే వీసా కలిగిన వారిలో కూడా భయం, గందరగోళం నెలకొన్నది.

ఒక వైపు వీసా రూల్స్, మరో వైపు టెక్ కంపెనీల ఒత్తిడి.. ఈ రెండు మధ్యలో చిక్కుకుపోయింది భారతీయుల జీవితం. వ్యక్తిగత సంతోషాలు, కుటుంబ వేడుకలు అన్నీ త్యాగం చేస్తూ ఉద్యోగాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఆవేదనకరంగా మారింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో H-1B వీసా వ్యవస్థను, అలాగే భారతీయ ఐటీ రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.