అమెరికా డ్రీమ్ వెనుక ఉన్న ఈ '179 ఏళ్ల ప్రాసెస్' .. గ్రీన్ కార్డ్ సాధించడం ఇక కల్ల..
అమెరికా పోవాలి.. డాలర్లు సంపాదించాలి.. గ్రీన్ కార్డు కొట్టి అక్కడ సెటిల్ అయిపోవాలి.
By: A.N.Kumar | 30 Aug 2026 11:10 AM ISTఅమెరికా పోవాలి.. డాలర్లు సంపాదించాలి.. గ్రీన్ కార్డు కొట్టి అక్కడ సెటిల్ అయిపోవాలి. దశాబ్దాలుగా మనోళ్లు కంటున్న కల ఇది. అయితే ఈ కల నెరవేరాలంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మీరో ఐదారు పునర్జన్మలు ఎత్తాల్సి రావచ్చు. లేదంటే టైమ్ మెషిన్ ఎక్కి నేరుగా 22వ శతాబ్దానికి వెళ్లిపోవాలి. అవును నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ఎఫ్ఏపీ) తాజాగా తేల్చిన సంచలన నిజం ఏంటంటే భారతీయులకు గ్రీన్ కార్డ్ రావడానికి సగటున 179 ఏళ్లు పడుతుందట..
10 లక్షల మంది.. ఒకే ఒక్క క్యూ లైన్!
ప్రస్తుతం అమెరికా ఇమ్మిగ్రేషన్ క్యూ లైన్లో దాదాపు 12.6 లక్షల మంది నిలబడి ఉంటే అందులో 79 శాతం మంది అంటే దాదాపు 10 లక్షల మంది మన భారతీయులే. మిగతా ప్రపంచమంతా ఒకెత్తయితే మనోళ్ల డిమాండ్ మరొక ఎత్తు. ప్రతిభకు, కష్టపడే తత్వానికి ఏమాత్రం తక్కువ లేని మన హెచ్1బీ వీసా వీరులు దరఖాస్తులు చేసుకుంటూ పోయారు. తీరా చూస్తే ఆ బ్యాక్‌లాగ్ కొండలా పేరుకుపోయింది.
ఈబీ-2 కేటగిరీ: శాశ్వత నిరీక్షణాయ నమః
ఇక అడ్వాన్స్‌డ్ డిగ్రీలు, అసాధారణ ప్రతిభ ఉన్న నిపుణుల కోసం కేటాయించిన ఈబీ-2 కేటగిరీ కథ వర్ణనాతీతం. ఇందులో ఏకంగా 7.3 లక్షల మంది భారతీయులు వేచి చూస్తున్నారు. ఈ కేటగిరీలో 2026 తర్వాత అప్లై చేసిన వారికి గ్రీన్ కార్డ్ రావడానికి సరిగ్గా 179 ఏళ్లు పడుతుందని లెక్కలేశారు. అంటే ఈ రోజు అప్లై చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన మనవడి మనవడు గ్రీన్ కార్డ్ అందుకుంటుంటే.. పైన స్వర్గం నుంచి చూసి “అమ్మయ్య ఇప్పటికైనా వచ్చింది” అని ఆనందబాష్పాలు రాల్చాల్సిందే..
దేశానికో కోటా.. బాబుకు మూడేళ్ల నిండితే డేంజర్
అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం ప్రతి దేశానికి ఏటా లభించే గ్రీన్ కార్డుల్లో 7 శాతం పరిమితి ఉంటుంది. జనాభా చిన్నదైనా భారత్ లాంటి వందల కోట్ల జనాభా ఉన్న దేశమైనా అందరికీ ఆ ఏడు శాతమే.. దాంతో ఈ క్యూ కదలడం లేదు. ఈ లోపు ఇక్కడున్న పిల్లాడికి 21 ఏళ్లు దాటితే వాడు "ఏజ్ అవుట్" అయిపోయి సొంతంగా మళ్లీ వీసా తిప్పలు పడాలి. ఇటు ఉద్యోగం మారలేక.. కంపెనీ ఓనర్ ఏం చెప్పినా తలాడించక తప్పని పరిస్థితి.
పరిష్కారం ఎప్పుడు?
అమెరికా కాంగ్రెస్‌లో ఇమ్మిగ్రేషన్ సంస్కరణల బిల్లులు పాస్ అయితే తప్ప ఈ శతాబ్దాల నిరీక్షణకు తెరపడదు. ఆలోపు మనోళ్లు హెచ్-1బీ రీలూప్‌లు వేస్తూ ప్రతి మూడేళ్లకోసారి వీసా స్టాంపింగ్ డేట్ల కోసం దేవుళ్లకు మొక్కుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. అమెరికా డ్రీమ్ వెనుక ఉన్న ఈ '179 ఏళ్ల ప్రాసెస్' చూస్తుంటే.. గ్రీన్ కార్డ్ సాధించడం కంటే పునర్జన్మలు ఎత్తడం చాలా తేలికనిపిస్తోంది.
