అమెరికాలో భారతీయులకు 'రెడ్ అలర్ట్': చట్టాలు అతిక్రమిస్తే వీసా రద్దు.. దేశ బహిష్కరణ తప్పదు!
అమెరికా కలలు కంటున్న వారికి ఇది గట్టి షాక్. ఇప్పటికే అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు అగ్రరాజ్యం గట్టి హెచ్చరిక జారీ చేసింది.
By: A.N.Kumar | 8 Jan 2026 9:00 PM ISTఅమెరికా కలలు కంటున్న వారికి ఇది గట్టి షాక్. ఇప్పటికే అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు అగ్రరాజ్యం గట్టి హెచ్చరిక జారీ చేసింది. అమెరికా గడ్డపై అడుగుపెట్టిన తర్వాత అక్కడి చట్టాలను గౌరవించకపోతే మీ భవిష్యత్తు అంధకారంలో పడుతుందని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ విద్యార్థులు పాటించాల్సిన కఠిన నిబంధనలను వివరించింది.
వీసా అనేది హక్కు కాదు.. ఒక అవకాశం మాత్రమే!
అమెరికా వీసా పొందడం అంటే అది ఒక హక్కు కాదని.. అది కేవలం ఒక ప్రత్యేకమైన వెసులుబాటు మాత్రమేనని రాయబార కార్యాలయం గుర్తుచేసింది. అమెరికాలో ప్రవేశం పొందాలన్నా..అక్కడ నివాసం కొనసాగించాలన్నా స్థానిక చట్టాలకు లోబడి ఉండటం తప్పనిసరి. ఏదైనా కారణంతో చట్టాలను ఉల్లంఘిస్తే ఆ వెసులుబాటును తక్షణమే రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని హెచ్చరించింది.
నిబంధనలు మీరితే ఎదురయ్యే పరిణామాలు
ఒకవేళ విద్యార్థులు ఏదైనా చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడితే లేదా ట్రాఫిక్ నిబంధనల నుండి తీవ్రమైన నేరాల వరకు దేనిలోనైనా అరెస్ట్ చేస్తామని రాయబార కార్యాలయం పేర్కొంది. తక్షణమే విద్యార్థి వీసా రద్దవుతుంది. తక్షణమే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మళ్లీ అమెరికాకు రాకుండా శాశ్వతంగా లేదా దీర్ఘకాలం పాటు వీసా నిరాకరించబడుతుంది. మీరు అరెస్టు అయినా లేదా ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించినా వీసా రద్దు కావచ్చు. మీ భవిష్యత్తును ప్రమాదంలో పడేయకండి అని రాయబార కార్యాలయం తన పోస్ట్‌లో పేర్కొంది.
సరిహద్దుల్లో బయోమెట్రిక్ నిఘా షురూ!
అమెరికాలో వలస నిబంధనల అమలును జో బైడెన్ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. ముఖ్యంగా డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం నాన్-యూఎస్ పౌరులందరికీ గ్రీన్ కార్డ్ హోల్డర్లతో సహా తప్పనిసరి బయోమెట్రిక్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. విమానాశ్రయాలు, ఓడరేవులు, భూసరిహద్దుల వద్ద అమెరికన్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారులు ప్రతి ఒక్కరి ఫోటోలు తీసుకుంటారు. 14 ఏళ్ల పిల్లల నుంచి 79 ఏళ్ల వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ ఈ తనిఖీలు వర్తిస్తాయి. గతంలో కేవలం దేశంలోకి వచ్చేటప్పుడు మాత్రమే తనిఖీలు ఉండేవి. ఇప్పుడు దేశం విడిచి వెళ్లేటప్పుడు కూడా బయోమెట్రిక్ వివరాలను సేకరిస్తున్నారు. దీనివల్ల వీసా గడువు ముగిసినా అక్కడే ఉండిపోయే వారిని సులభంగా గుర్తించవచ్చు.
విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులు ఈ పరిణామాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. యూనివర్సిటీ నిబంధనలను.. హాజరును కచ్చితంగా పాటించాలి. అనుమతి లేని చోట లేదా అనుమతించిన సమయం కంటే ఎక్కువ సేపు పని చేయకూడదు. చిన్నపాటి గొడవలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు లేదా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఈ కొత్త నిబంధనలు, నిఘా వ్యవస్థతో అమెరికాలో అక్రమ నివాసానికి చెక్ పెట్టాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) భావిస్తోంది. కాబట్టి భారతీయ విద్యార్థులు తమ కలల బాటలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే చట్టాన్ని గౌరవించడం ఒక్కటే మార్గం.
