అమెరికాలో 54 మంది భారతీయులు వెనక్కి.. ఏమిటీ 'డంకీ రూట్'!
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్.. వలసలపై కఠినచర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 27 Oct 2025 10:00 PM ISTఅమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్.. వలసలపై కఠినచర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక అక్రమమార్గంలో తమ దేశంలోకి ప్రవేశించేవారికి సంకెళ్లు వేసి మరీ వారి వారి దేశాలకు పంపించేస్తున్న పరిస్థితి. అయినప్పటికీ అమెరికాకు అక్రమ మార్గంలో వెళ్లేవారి సంఖ్య ఆగడం లేదు. ఈ నేపథ్యంలో 54 మంది భారతీయులు దొరికేశారు.
అవును... వలసలపై ట్రంప్ సర్కార్ కఠినచర్యలు తీసుకుంటున్న సమయంలో కూడా అమెరికాకు అక్రమ మార్గంలో వెళ్లేవారి సంఖ్య ఆగడం లేదు. ఈ క్రమంలో తాజాగా డంకీ మార్గంలో తమ దేశంలోకి ప్రవేశించారనే ఆరోపణలతో 54 మంది భారతీయులను అమెరికా తక్షణం వెనక్కి పంపించింది. దీంతో వారంతా ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం వీరిలో ఎక్కువమంది హర్యానా నుంచే ఉన్నారు. ఇందులో భాగంగా... 16 మంది కర్నాల్, 15 మంది కైతాల్, 5 మంది అంబాలా, నలుగురు యమునా నగర్, మరో నలుగురు కురుక్షేత్ర, ముగ్గురు జింద్, ఇద్దరు సోనిపట్.. పంచకుల, పానిపట్, రోహ్తక్, ఫతేహాబాద్ నుండి ఒక్కొక్కరు ఉన్నారని తెలుస్తోంది.
అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. అగ్రరాజ్యం నుంచి బహిష్కరించబడిన వారిలో ఎక్కువ మంది 25 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని.. వారిని వారి వారి కుటుంబాలకు అప్పగించామని పోలీసులు తెలిపారు. వీరంతా అక్రమ డంకీ మార్గం ద్వారా అమెరికాలోకి ప్రవేశించారని కర్నాల్ డీఎస్పీ సందీప్ కుమార్ తెలిపారు.
కాగా ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా అధికారులు వందలాది మంది భారతీయులను బహిష్కరించిన సంగతి తెలిసిందే. వలస చట్టాలను ఉల్లంఘించారనో.. లేదా దేశంలో ఉండటానికి సరైన ఆధారం లేవనో కారణంతో అమెరికా ప్రభుత్వం క్రమం తప్పకుండా వందలాదిమందిని బహిష్కరిస్తుంది. ఈ ఏడాది జనవరిలో ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్రమ వలసదారులపై కఠిన చర్యలు ప్రారంభించారు.
ఏమిటీ డంకీ రూట్?
విదేశాలకు అక్రమంగా వెళ్లేందుకు అనుసరించే మార్గాన్నే 'డంకీ రూట్'గా వ్యవహరిస్తుంటారు. అంటే.. ఎటువంటి ప్రణాళిక లేకుండా ఒకచోట నుంచి మరోచోటుకు వెళ్లడం అన్నమాట. ఇది పంజాబీ వాడుక భాష నుంచి వచ్చింది. ఈ పద్దతి ప్రకారం.. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. షిప్ కంటైనర్లు, వాహనాల్లో రహస్య కంపార్టుమెంట్లలో దేశ సరిహద్దులు దాటిస్తారు.
యూరోపియన్ యూనియన్ ఇచ్చే షెంజెన్ టూరిస్టు వీసాతో ఈ పద్ధతి మొదలవుతుంది. దీనివల్ల 26 దేశాల్లో తిరిగేందుకు వీలుంటుంది. ఫేక్ డాక్యుమెంట్లతో లేదా వాహనాల్లో రహస్యంగా యూకే లేదా అమెరికా దేశాలకు వెళ్లేందుకు అక్కడ కన్సల్టెంట్ల సాయం తీసుకుంటారు. ఏ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాలన్నా ఈ తరహా పద్ధతిని ఉపయోగిస్తారు.
