జాతివివక్ష ముసుగులో మరో దారుణం: యూకేలో భారత యువతిపై అత్యా*చారం
వెస్ట్ మిడ్ల్యాండ్స్‌లోని వాల్సాల్ పట్టణంలో భారత సంతతి యువతిపై ఓ తెల్లజాతి వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకుంది.
By: A.N.Kumar | 27 Oct 2025 12:19 PM ISTయునైటెడ్ కింగ్‌డమ్‌లో మరోసారి జాతివివక్ష మనుష్యత్వాన్ని అపహాస్యం చేసింది. ఇటీవల వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన దేశంలో నివసిస్తున్న భారతీయ కమ్యూనిటీని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇరవై ఏళ్ల భారత సంతతి యువతిపై జరిగిన ఈ అత్యాచారం వెనుక జాతివివక్ష ప్రధాన కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
వెస్ట్ మిడ్ల్యాండ్స్‌లోని వాల్సాల్ పట్టణంలో భారత సంతతి యువతిపై ఓ తెల్లజాతి వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు దీన్ని జాతి వివక్షతో కూడిన దాడిగా నమోదు చేశారు.
శనివారం సాయంత్రం వాల్సాల్‌లోని పార్క్ హాల్ ప్రాంతంలో వీధిలో తీవ్ర ఆందోళనలో ఉన్న ఓ యువతి (20 సంవత్సరాల వయసు)ను స్థానికులు గమనించగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు విచారణ చేపట్టగా, ఆమెపై అత్యాచారం జరిగినట్టు తేలింది.
* సీసీటీవీ ఫుటేజ్ విడుదల.. నిందితుడి కోసం గాలింపు
ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణించిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తాజాగా విడుదల చేసిన సీసీటీవీ వీడియోలో నిందితుడి కదలికలు స్పష్టంగా కనిపిస్తుండగా.. అతనిని గుర్తించేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. దాడిచేసిన వ్యక్తి తెల్లజాతికి చెందినవాడు, సుమారు 30 ఏళ్ల వయసు, చిన్న జుట్టుతో, ఆ సమయంలో నల్ల దుస్తులు ధరించినట్టు వివరించారు. బాధితురాలికి వైద్య చికిత్సతో పాటు, మానసిక ధైర్యాన్ని అందించేందుకు ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
* పెరుగుతున్న జాతివివక్ష దాడులు, ఆందోళనలో ప్రవాస భారతీయులు
ఇటీవలి కాలంలో యూకేతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా వంటి అగ్ర దేశాల్లో భారతీయులపై జాతివివక్ష దాడులు, వేధింపులు విపరీతంగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా యువతులు, విద్యార్థులు ఇలాంటి ఘటనల బారిన పడటం పట్ల ప్రవాస భారతీయులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సిక్కు యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన మరువకముందే ఇలాంటి మరో దారుణం చోటుచేసుకోవడం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది.
కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
మానవ హక్కుల సంస్థలు.. భారత ప్రవాస సంఘాలు ఈ ఘటనను ఏకగ్రీవంగా ఖండించాయి. భారత ప్రభుత్వాన్ని, యూకే అధికారులను ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని, దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. జాతివివక్ష అనే మహమ్మారి ఇంకా ప్రపంచవ్యాప్తంగా మనుగడ సాగిస్తుండటం, అమాయక ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తుండటం దురదృష్టకరం. ఈ దాడుల కట్టడికి ప్రపంచ దేశాలు ఉమ్మడిగా కృషి చేయాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.
