Begin typing your search above and press return to search.

కోవిడ్ సంక్షోభాన్ని ‘క్యాష్’ చేసుకున్న భారతీయ సంతతి దంపతులు

మానవాళి అంతా కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కాపాడుకునేందుకు పోరాడుతున్న వేళ కొందరు మాత్రం ఆ విషాదాన్ని వ్యాపార అవకాశంగా మలుచుకుని కోట్లు అక్రమంగా గడించేందుకు తెగించారు.

By:  A.N.Kumar   |   24 July 2026 3:25 PM IST
కోవిడ్ సంక్షోభాన్ని ‘క్యాష్’ చేసుకున్న భారతీయ సంతతి దంపతులు
X

మానవాళి అంతా కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కాపాడుకునేందుకు పోరాడుతున్న వేళ కొందరు మాత్రం ఆ విషాదాన్ని వ్యాపార అవకాశంగా మలుచుకుని కోట్లు అక్రమంగా గడించేందుకు తెగించారు. కోవిడ్-19 సమయంలో వైద్య అత్యవసర సామగ్రి పేరుతో భారీ మోసానికి పాల్పడిన భారతీయ సంతతికి చెందిన దంపతులు జోగేశ్ భండారి, మీనాక్షి భండారిలని యునైటెడ్ కింగ్‌డమ్ కోర్టు తాజాగా దోషులుగా తేల్చింది. ఈ ఘటన స్థానికంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

నకిలీ పత్రాలతో కోట్ల రూపాయల దోపిడీ

జోగేశ్ భండారి, మీనాక్షి భండారి దంపతులు యూకేలో ఒక వ్యాపార సంస్థను నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో వైద్యులకు, ఆసుపత్రులకు అత్యంత అవసరమైన మెడికల్ గ్లౌజులు ( తమ వద్ద కోట్ల సంఖ్యలో స్టాక్ ఉన్నాయని వారు ప్రచారం చేసుకున్నారు. వివిధ ఆసుపత్రులు, వ్యాపార సంస్థల ప్రతినిధులను నమ్మించి, గ్లౌజుల సరఫరా కోసం ముందస్తుగా కోట్ల రూపాయల అడ్వాన్సులు వసూలు చేశారు.ఈ ప్రక్రియలో కొనుగోలుదారుల నమ్మకాన్ని గెలుచుకోవడానికి నకిలీ బ్యాంకు రికార్డులను సృష్టించారు. ఫోర్జరీ చేసిన నాణ్యతా ప్రమాణాల పత్రాలను చూపించారు. అమెరికాలోని పలు ప్రముఖ ఆసుపత్రులకు సైతం గ్లౌజులు సరఫరా చేస్తామంటూ భారీ ఆర్డర్లు కుదుర్చుకున్నారు. తీరా అడ్వాన్స్ నిధులు చేతికి అందినాక ఒక్క గ్లౌవ్ కూడా సరఫరా చేయకుండా నిందితులు ముఖం చాటేసినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది.

మోసం చేసిన డబ్బుతో విలాసవంతమైన జీవితం

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వసూలు చేసిన అక్రమ సంపాదనతో ఈ దంపతులు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపినట్లు అధికారులు స్పష్టం చేశారు. బాధితుల నుంచి కాజేసిన నిధులతో వారు అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు, రోలెక్స్ బ్రాండెడ్ వాచీలు, విలువైన వజ్రాభరణాలు కొనుగోలు చేసినట్లు ఆధారాలతో సహా నిరూపితమైంది. ఈ మోసపూరిత వ్యవహారంలో భండారి దంపతులతో పాటు వారి వ్యాపార భాగస్వామి క్రెయిగ్ మోరిస్ కూడా కీలక పాత్ర పోషించాడు.

కోర్టు తీర్పు – శిక్ష ఖరారు ఎప్పుడు?

సుదీర్ఘ కాలం పాటు సాగిన విచారణ అనంతరం, ముగ్గురిపై నమోదైన మోసం, మనీలాండరింగ్ అభియోగాలు నిజమేనని యూకే కోర్టు నిర్ధారించి.. వారిని దోషులుగా తేల్చింది. ఈ కేసులో జోగేశ్ భండారి, మీనాక్షి భండారితో పాటు వారి వ్యాపార భాగస్వామి క్రెయిగ్ మోరిస్ కూడా నిందితుడిగా ఉన్నాడు. ముగ్గురిపై మోసం , మనీలాండరింగ్ తదితర అభియోగాలు నమోదయ్యాయి. సుదీర్ఘ విచారణ అనంతరం యూకే కోర్టు ముగ్గురినీ దోషులుగా తేల్చింది.

ఈ కేసులో శిక్ష ఖరారు ప్రక్రియ ఆగస్టు 21న జరగనుంది. అప్పటివరకు నిందితులపై తుది శిక్ష ఏమిటనే అంశంపై ఆసక్తి నెలకొంది. కరోనా వంటి అత్యవసర పరిస్థితిని సైతం అక్రమ సంపాదన కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నించిన ఈ ఘటన యూకేలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరోనా సమయంలో వైద్య సామగ్రి కొరతను ఆసరాగా చేసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వారిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తోందనే మరో ఉదాహరణగా ఈ తీర్పును విశ్లేషకులు పేర్కొంటున్నారు.