యూకేలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఒక దురదృష్టకర సంఘటన తెలుగు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
By: A.N.Kumar | 2 Sept 2025 10:35 AM ISTయునైటెడ్ కింగ్‌డమ్‌లో ఒక దురదృష్టకర సంఘటన తెలుగు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎస్సెక్స్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
మృతుల్లో ఒకరిని హైదరాబాద్, బోడుప్పల్‌కు చెందిన రాపోలు ఋషితేజ (21)గా గుర్తించారు. ఆయన యుకేలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఈ విషాద వార్తతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఎస్సెక్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదం రేలీ స్పర్ రౌండబౌట్ సమీపంలోని A130 డ్యూయల్ క్యారేజ్‌వేలో జరిగింది. బీబీసీ సహా స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఇల్ఫోర్డ్-బార్కింగ్ ప్రాంతంలో నివసిస్తున్న తొమ్మిది మంది విద్యార్థులు ఒకే కారులో సౌతెండ్-ఆన్-సీ వైపు ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వెంటనే హెలికాప్టర్ ద్వారా రాయల్ లండన్ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ చికిత్స పొందుతూ వారు తుదిశ్వాస విడిచారు. ఈ విషాదం తెలుగు సమాజంలో ఆందోళన కలిగించింది.
- దర్యాప్తు కొనసాగింపు
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి, రెండు వాహనాల డ్రైవర్లు (23, 24 సంవత్సరాల వయస్సు)ని "డేంజరస్ డ్రైవింగ్ ద్వారా మరణానికి కారణం కావడం" అనే నేరం కింద పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు పోలీసుల కస్టడీలో ఉన్నారు.
ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి శకలాలను తొలగించేందుకు, సౌత్ బెన్‌ఫ్లీట్‌లోని సాడ్లర్స్ ఫార్మ్ రౌండబౌట్ (A13) నుంచి బ్యాటిల్స్‌బ్రిడ్జ్‌లోని రెట్టెండన్ టర్న్‌పైక్ (A1245) వరకు రహదారిని మూసివేసినట్లు ఎస్సెక్స్ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ వెల్లడించింది.
విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్ళిన విద్యార్థులు ఇలాంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ఈ సంఘటన తెలుగు కుటుంబాల్లో భద్రత, జాగ్రత్తలపై ఆందోళనను పెంచింది.
