Begin typing your search above and press return to search.

అగ్రరాజ్యంలో భారతీయ టెకీకి కలవరపెడుతున్న రేపటి భయం

ఒకప్పుడు అమెరికాలో ఉద్యోగం సాధిస్తే జీవితం స్థిరపడినట్లే అని భావించేవారు.

By:  A.N.Kumar   |   21 Oct 2026 5:00 PM IST
అగ్రరాజ్యంలో భారతీయ టెకీకి కలవరపెడుతున్న రేపటి భయం
X

ఏళ్ల తరబడి రాత్రింబవళ్లు పడ్డ కష్టం... కళ్లలో నింపుకున్న వేల ఆశలు... కన్నవారి ఆశీస్సులతో సరిహద్దులు దాటి అగ్రరాజ్యం అమెరికాలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిదీ ఒకే ఒక కల "తమ ప్రతిభతో ఉజ్జ్వల భవిష్యత్తును నిర్మించుకోవడమే!" అయితే నేడు ఆ కలల తీరంలో తీవ్ర ఆందోళనల మబ్బులు కమ్ముకున్నాయి. డోనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి.. నిన్నటివరకు దాదాపు 3 లక్షలకు పైగా వీసాలు రద్దయ్యాయన్న ఒక్క వార్త వేల మైళ్ల దూరంలో ఉన్న భారతీయ కుటుంబాల్లో.. టెక్ రంగాన్నే నమ్ముకున్న యువత గుండెల్లో గుబులు రేపుతోంది.

ఉద్యోగం ఉంటే చాలా? ఆశల సౌధానికి గ్యారెంటీ ఏదీ?

ఒకప్పుడు అమెరికాలో ఉద్యోగం సాధిస్తే జీవితం స్థిరపడినట్లే అని భావించేవారు. కానీ నేడు సీన్ మారింది. చేతిలో మంచి ఉద్యోగం ఉన్నా.. ఆఫీసులో ప్రశంసలు అందుతున్నా... "రేపు పొద్దున నా వీసా పరిస్థితి ఏమిటి?" అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. వీసా చెల్లుబాటు, చట్టబద్ధమైన నివాస అనుమతులు, కంపెనీ ఇమ్మిగ్రేషన్ పత్రాల్లో ఏ చిన్న సాంకేతిక లోపం ఉన్నా... ఎన్నో ఏళ్ల కష్టం ఒక్క నిమిషంలో ఆవిరైపోయేలా చట్టాలు కఠినతరమవుతున్నాయి.

కన్నవారి కళ్లల్లో భయం... చదువుకునే విద్యార్థుల్లో అనిశ్చితి..

కేవలం ఉద్యోగులే కాదు.. కష్టపడి అప్పులు చేసి ఎన్నో త్యాగాలతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థుల ఎఫ్-1 వీసా పరిస్థితీ భిన్నంగా ఏమీ లేదు. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగం సాధించి నిలదొక్కుకుందామనుకునే అభ్యర్థులకు ఓపీటీ ప్రక్రియలో వచ్చే చిన్న జాప్యం కూడా నిద్రలేని రాత్రులను మిగులుస్తోంది. తమ పిల్లలు ఎక్కడ ఏ ఇబ్బందిలో పడతారోనని ఇక్కడ భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు క్షణక్షణం నరకం అనుభవిస్తున్నారు.

భయం కాదు... బాధ్యతాయుతమైన అప్రమత్తతే రక్షణ

ప్రభుత్వాలు మారినప్పుడు.. చట్టాలు కఠినమైనప్పుడు కలవరం కలగడం సహజమే. అయితే ఈ 3 లక్షల వీసాల రద్దులో ప్రతి ఒక్కరిదీ ఒకే కథ కాదు. అందరి వీసాలూ ప్రమాదంలో ఉన్నాయని భావించి ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. మన ఉద్యోగం, నివాస అనుమతులకు సంబంధించిన ప్రతి కాగితాన్ని ఎప్పటికప్పుడు సక్రమంగా పర్యవేక్షించుకోవడం... ఉద్యోగం మారేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు ప్రతి చట్టపరమైన నిబంధనను క్షుణ్ణంగా అనుసరించడం... సోషల్ మీడియాలో వచ్చే అనవసర భయాందోళనలను పక్కనపెట్టి.. అధికారిక యూఎస్.సీఐఎస్ లేదా ఇమ్మిగ్రేషన్ నిపుణుల సలహాలు మాత్రమే తీసుకోవడం ఉత్తమం..

కష్టపడే తత్వానికి, భారతీయుల మేధస్సుకు అమెరికాలో ఎప్పుడూ గౌరవం ఉంటుంది. ఈ కఠిన సమయాన్ని అధిగమించాల్సింది భయంతో కాదు... అత్యంత జాగ్రత్తగా..చట్టబద్ధంగా అడుగులు వేస్తూ మన కలలను కాపాడుకోవడమే మన ముందున్న ప్రధాన లక్ష్యం.