రెండు నెలల్లో ఎంఎస్ పూర్తి.. అమెరికాలో నిద్రలోనే విగతజీవిగా తెలుగు విద్యార్థి!
అమెరికాలో మరో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తెలంగాణలోని నల్గొండ జిల్లా మేళ్ల దుప్పలపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి పవన్ కోమటిరెడ్డి (24) నిద్రలోనే మృతిచెందడం కలకలం రేపింది.
By: A.N.Kumar | 22 Dec 2025 5:32 PM ISTఅమెరికాలో ఎంఎస్ పూర్తి చేయాలి. గొప్ప జాబ్ చేయాలి.. తెలంగాణలోని అమ్మానాన్నలను గొప్పగా చూసుకొని ఎన్నో కలలతో అగ్రరాజ్యంలో చదువుతున్న విద్యార్థి కలలు నిద్రలోనే కల్లలయ్యాయి. వాటిని సాకారం చేసేందుకు అమెరికాలో కష్టపడుతున్న విద్యార్థి జీవితం విషాదంతం అయ్యింది. మరో రెండు నెలల్లో ఎంఎస్ పూర్తి చేయనుండగా ఊహించని విధంగా మరణం అతడిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది.
అమెరికాలో మరో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తెలంగాణలోని నల్గొండ జిల్లా మేళ్ల దుప్పలపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి పవన్ కోమటిరెడ్డి (24) నిద్రలోనే మృతిచెందడం కలకలం రేపింది. రెండేల్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికాకు పవన్ వెళ్లాడు. ఓ కంపెనీలో ఇప్పటికే ుద్యోగం సంపాధించిన పవన్ మరో రెండు నెలల్లో ఎంఎస్ పూర్తి చేసుకోబోతున్నాడు. అయితే ఇంతలోనే అతడికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. శుక్రవారం స్నేహితులతో గడిపిన పవన్ రెడ్డికి శనివారం నిద్రలో ఉండగానే.. తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కన్నుమూశాడు.
ఈ విషయం తెలిసిన వెంటనే అమెరికాలోని అధికారులు పవన్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఒక్కగానొక్క కుమారుడి ఆకాల మరణంతో వారు తీవ్రంగా కలత చెందుతున్నారు. పవన్ మరణానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. పూర్తివివరాలు వెల్లడించే పోస్టుమార్టం నివేదిక సోమవారం నాటికి అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
పవన్ చదువుల కోసం విద్యారుణం తీసుకున్నాడు. అయితే అతడి తల్లిదండ్రులు ఆర్థికంగా బలహీన స్థితిలో ఉండడంతో ఆ రుణాన్ని తిరిగి చెల్లించే పరిస్థితిలో లేరు. ఈ నేపథ్యంలో పవన్ స్నేహితులు, పరిచయస్తులు, అలాగే పొరుగువారు కలిసి అతడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు నిధుల సేకరణ ప్రారంభించారు.
ఇదే సమయంలో పవన్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థుల భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది. వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
పవన్ ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆయన కుటుంబానికి ఈ కఠిన సమయంలో ధైర్యం లభించాలని పలువురు కోరుకుంటున్నారు.
