Begin typing your search above and press return to search.

రష్యాలో భారత విద్యార్థి... పాలు కొనడానికి వెళ్లి డ్యామ్ లో శవమై..!

అవును... భారతదేశానికి చెందిన ఓ వైద్య విద్యార్థి రష్యాలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

By:  Raja Ch   |   7 Nov 2025 11:52 AM IST
రష్యాలో భారత విద్యార్థి... పాలు కొనడానికి వెళ్లి డ్యామ్  లో శవమై..!
X

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి పలు రకాల ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాదిలోనే ఇలాంటి ఘటనలు పలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పాలు కొనడానికని బయటకు వెళ్లిన ఓ వైద్య విద్యార్థిని డ్యామ్ లో శవమై కనిపించిన ఘటన రష్యాలో చోటు చేసుకుంది

అవును... భారతదేశానికి చెందిన ఓ వైద్య విద్యార్థి రష్యాలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. రష్యాలోని ఉఫా నగరంలో సుమారు 19 రోజుల క్రితం అదృశ్యమైన భారతీయ వైద్య విద్యార్థి మృతదేహాన్ని గురువారం ఆనకట్ట నుంచి వెలికితీశారు. అతడిని రాజస్థాన్ లోని కఫన్ వాడ గ్రామానికి చెందిన 22 ఏళ్ల అజిత్ సింగ్ చౌదరిగా గుర్తించారు.

2023లో ఎంబీబీఎస్ కోర్సు కోసం బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చేరిన అజిత్ సింగ్ చౌదరి.. ఈ ఏడాది అక్టోబర్ 19న అతను ఉఫాలో కనిపించకుండా పోయాడు. ఆ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో పాలు కొనుక్కువడానికి వెళ్తున్నానని చెప్పి తన హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడని, కానీ తిరిగి రాలేదని చెబుతున్నారు.

ఈ క్రమంలో సుమారు 19 రోజుల తర్వాత తాజాగా వైట్ నదికి ఆనుకుని ఉన్న ఆనకట్టలో చౌదరి మృతదేహం లభ్యమైనట్లు అల్వార్ సరస్ డెయిరీ చైర్మన్ నితిన్ సంగ్వాన్ తెలిపారు. దీంతో... చౌదరి మరణం గురించి అతని కుటుంబ సభ్యులకు రష్యాలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ సందర్భంగా స్పందించిన కేంద్ర మాజీ మంత్రి జితేంద్ర సింగ్ అల్వార్... కఫన్ వాడ గ్రామానికి చెందిన అజిత్ ను అతని కుటుంబం ఎంతో ఆశతో, కష్టపడి సంపాదించిన డబ్బును కలిపి వైద్య విద్యను అభ్యసించడానికి రష్యాకు పంపించిందని.. నదిలో అజిత్ మృతదేహం లభ్యమైనట్లు ఈరోజు వచ్చిన వార్త పూర్తిగా దిగ్భ్రాంతికరంగా ఉందని తెలిపారు.

ఇది అల్వార్ కుటుంబానికి చాలా బాధాకరమైన క్షణమని.. అనుమానాస్పద పరిస్థితుల్లో మనం ఒక ఆశాజనకమైన యువకుడిని కోల్పోయామని ఆయన ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. ఇదే సమయంలో.. విద్యార్థి మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ ను జితేంద్ర సింగ్ కోరారు.