Begin typing your search above and press return to search.

కెనడాలో మరో భారతీయ యువతి హత్య..విస్తుగొలిపే నిజాలు.. దేశవ్యాప్తంగా కలకలం

మెరుగైన భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల భద్రతపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి.

By:  A.N.Kumar   |   24 Dec 2025 3:00 PM IST
కెనడాలో మరో భారతీయ యువతి హత్య..విస్తుగొలిపే నిజాలు..  దేశవ్యాప్తంగా కలకలం
X

మెరుగైన భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల భద్రతపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. కెనడాలోని టొరంటోలో నివసిస్తున్న భారతీయ యువతి హిమాంశి ఖురానా దారుణ హత్యకు గురవ్వడం ఇప్పుడు కెనడాలోనూ.. అటు భారతదేశంలోనూ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

అసలేం జరిింది?

టొరంటో పోలీసుల కథనం ప్రకారం.. డిసెంబర్ 19వ తేదీ రాత్రి 10.41 గంటల సమయంలో హిమాంశి కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదు అందింది. ఆమె చివరిసారిగా స్ట్రాచన్ అవెన్యూ.. వెల్లింగ్టన్ స్ట్రీట్ వెస్ట్ ప్రాంతంలో కనిపించారు. పోలీసుల గాలింపు చర్యలు చేపట్టగా.. మరుసటిరోజు డిసెంబర్ 20 ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఒక నివాసంలో ఆమె మృతదేహం లభ్యమైంది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్యేనని పోలీసులు నిర్ధారించారు.

నిందితుడి గుర్తింపు..

ఈ కేసులో పోలీసులు అబ్దుల్ ఘఫూరీ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు హిమాంశి, నిందితుడు అబ్దుల్ ఒకరికొకరు ముందు నుంచే పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడికోసం రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

భారత కాన్సులేట్ స్పందన

ఈ విషాద ఘటనపై టొరంటోలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. ‘హిమాంశి ఖురానా మరణం మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. ఆమె కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.. స్తానిక అధికారులతో మేము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం.. బాధితురాలి భౌతికకాయాన్ని స్వదేశానికి తరలించేందుకు , ఆమె కుటుంబానికి అవసరమైన అన్నిరకాల చట్టపరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం ’ అని కాన్సులేట్ ప్రకటించింది.

పెరుగుతున్న ఆందోళనలు..

గత కొన్నేళ్లుగా కెనడాలో భారతీయ సంతతికి చెందిన వారిపై ముఖ్యంగా విద్యార్థులపై దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విదేశాల్లో ఒంటరిగా నివసించే మహిళలు, విద్యార్థుల భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది. హిమాంశికి న్యాయం జరగాలని నిందితుడిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ఉన్నత చదువుల కోసం వెళ్లిన బిడ్డ విగతజీవిగా మారడంతో హిమాంశి కుటుంబం కన్నీరుమున్నీరువుతోంది. ఈ కేసులో తదుపరి పరిణామాల కోసం యావత్ భారత్ ఎదురుచూస్తోంది.