టెక్సాస్‌లో దారుణం: కన్నవారిని, అమ్మమ్మను కాల్చిచంపిన భారతీయ యువకుడు..
అమెరికాలో నివసిస్తున్న భారతీయ కుటుంబంలో ఊహించని ఘోర కలి వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నవారినే ఓ కుమారుడు అత్యంత కిరాతకంగా కాల్చిచంపాడు.
By: A.N.Kumar | 20 Jun 2026 8:41 PM ISTఅమెరికాలో నివసిస్తున్న భారతీయ కుటుంబంలో ఊహించని ఘోర కలి వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నవారినే ఓ కుమారుడు అత్యంత కిరాతకంగా కాల్చిచంపాడు. టెక్సాస్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ దారుణ సంఘటన స్థానిక ప్రవాస భారతీయ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురిచేసింది. 19 ఏళ్ల భారతీయ యువకుడు గౌరవ్ చోప్రా తన సొంత తండ్రి, తల్లి, అమ్మమ్మను తుపాకీతో కాల్చి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. టెక్సాస్‌లోని ఆల్టన్ ప్రాంతంలో జరిగిన ఈ విషాదకర సంఘటన కలిచివేసింది.
ఒకే ఇంట్లో మూడు శవాలు.. అసలేం జరిగింది?
పోలీసులు వెల్లడించిన ప్రాథమిక దర్యాప్తు వివరాల ప్రకారం.. నిందితుడు గౌరవ్ చోప్రా తన నివాసంలోనే కుటుంబ సభ్యులతో తీవ్ర ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా విచక్షణారహితంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘోర కాల్పుల్లో అతని తండ్రి, తల్లి, అలాగే వృద్ధురాలైన అమ్మమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిమిషాల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించడంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది. ఘటన అనంతరం నిందితుడు గౌరవ్ అక్కడి నుంచి పరారయ్యాడు.
అన్న చాకచక్యం.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
ఈ భీకర దాడి సమయంలో ఇంట్లోనే ఉన్న గౌరవ్ 21 ఏళ్ల అన్న తృటిలో ప్రాణాలతో బయటపడటం గమనార్హం. టెక్సాస్‌లోని హిడాల్గో కౌంటీ షెరీఫ్ ఎడ్డి గెర్రా తెలిపిన వివరాల ప్రకారం.. తమ్ముడు గౌరవ్ కన్నవారిపై కాల్పులు జరపడం చూసిన అన్న భయాందోళనకు గురయ్యాడు. గౌరవ్ అతనిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించగా అతను చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. వెంటనే సురక్షిత ప్రాంతానికి చేరుకుని 911 అత్యవసర నంబరుకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. తన తమ్ముడు కుటుంబ సభ్యులందరినీ కాల్చిచంపాడని.. తనను కూడా చంపేందుకు ప్రయత్నించాడని ఆర్తనాదాలు చేస్తూ పోలీసులకు వివరించాడు.
రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు అరెస్ట్
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భారీ బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇల్లంతా పరిశీలించి మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరారీలో ఉన్న నిందితుడు గౌరవ్ చోప్రా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
హత్యకు గల కారణాలపై వీడని మిస్టరీ
అయితే ఇంతటి ఘోరానికి ఒడిగట్టడానికి గల అసలు కారణం ఏమిటన్నది ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే మారింది. దర్యాప్తు అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం ఆ కుటుంబానికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. ఇంట్లో గృహహింస జరిగినట్లుగానీ ఎలాంటి గొడవలు ఉన్నట్లుగానీ పోలీసు రికార్డుల్లో లేదు. గతంలో ఎలాంటి పోలీసు ఫిర్యాదులు కూడా నమోదు కాలేదు. సమాజంలో ఎంతో మర్యాదగా ఉండే కుటుంబంలో ఇలాంటి ఘోరం జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హత్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. "ఈ ఘటన వెనుక తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలున్నాయా? లేదా ఎవరికీ తెలియని అంతర్గత కుటుంబ విభేదాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నాం. పూర్తి దర్యాప్తు ముగిసే వరకు ఒక స్పష్టతకు రాలేము" అని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.
ప్రవాస భారతీయ సమాజంలో ఆందోళన
ఇటీవలి కాలంలో అమెరికాలో భారతీయులకు సంబంధించిన విషాదకర సంఘటనలు, ఘర్షణలు, అనుమానాస్పద మరణాలు వరుసగా వెలుగుచూస్తుండటం ఎన్నారైలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా యువత ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఉన్న కారణాలపై చర్చలు మొదలయ్యాయి. కన్నవారిని, వృద్ధులను కూడా చూడకుండా ఒక యువకుడు ఇంతటి క్రూరత్వానికి పాల్పడ్డాడనే వార్త అమెరికాలోని భారతీయ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
