Begin typing your search above and press return to search.

టెక్సాస్ లో తెలుగు కంపెనీస్ మీద ఇన్వెస్టిగేషన్ : అటార్నీ జనరల్

అమెరికాలో ఐటీ కొలువుల కోటగా పేరుగాంచిన టెక్సాస్ రాష్ట్రంలో హెచ్-1బి వీసాల దుర్వినియోగం ఉదంతం కలకలం రేపుతోంది.

By:  A.N.Kumar   |   29 Jan 2026 5:00 PM IST
టెక్సాస్ లో తెలుగు కంపెనీస్ మీద ఇన్వెస్టిగేషన్ : అటార్నీ జనరల్
X

అమెరికాలో ఐటీ కొలువుల కోటగా పేరుగాంచిన టెక్సాస్ రాష్ట్రంలో హెచ్-1బి వీసాల దుర్వినియోగం ఉదంతం కలకలం రేపుతోంది. ముఖ్యంగా భారతీయులు.. అందునా తెలుగు వారు నడుపుతున్నట్లుగా భావిస్తున్న కొన్ని కన్సల్టెన్సీలపై టెక్సాస్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్ విచారణకు ఆదేశించడం ప్రవాస వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

'గోస్ట్ ఆఫీసులు'.. నకిలీ వెబ్‌సైట్లు!

ఈ దర్యాప్తులో వెలుగుచూసిన అంశాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. మూడు నార్త్ టెక్సాస్ కంపెనీలు అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో వాటికి సివిల్ ఇన్వెస్టిగేటివ్ డిమాండ్స్ (సీఐడీస్) జారీ చేశారు. ఒక కంపెనీ తన వ్యాపార చిరునామాగా ఒక సాధారణ ఇళ్లను చూపగా, మరో కంపెనీ కనీసం నిర్మాణం కూడా పూర్తికాని భవనాన్ని వర్క్‌సైట్‌గా పేర్కొంది. వెబ్‌సైట్లలో లేని ఉత్పత్తులను, సేవలను ఉన్నట్లుగా చూపిస్తూ ఈ సంస్థలు కేవలం వీసాల స్పాన్సర్‌షిప్ కోసమే 'కాగితపు కంపెనీలను' సృష్టించాయని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.టెక్సాస్ ప్రజల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తూ మోసపూరిత పద్ధతులతో హెచ్-1బి ప్రోగ్రామ్‌ను అపహాస్యం చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని కెన్ పాక్స్టన్ స్పష్టం చేశారు.

గవర్నర్ అబాట్ సంచలన నిర్ణయం

అటార్నీ జనరల్ విచారణకు ముందే టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఒక కీలక ఆదేశం జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, పబ్లిక్ యూనివర్సిటీల్లో కొత్త హెచ్-1బి వీసా పిటిషన్లపై తక్షణ ఫ్రీజ్ నిలిపివేత విధించారు. అమెరికన్ల పన్ను డబ్బుతో నడిచే ఉద్యోగాలు ముందుగా స్థానికులకే దక్కాలన్నది ఆయన వాదన.

ట్రంప్ సంస్కరణల సెగ

ఇప్పటికే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కఠిన నిబంధనలు ఐటీ రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దరఖాస్తు రుసుమును ఏకంగా 1 లక్ష డాలర్లకు పెంచడం.. కేవలం లాటరీ ద్వారా కాకుండా అత్యధిక జీతాలు ఇచ్చే కంపెనీలకే వీసాలు దక్కేలా నిబంధనలు మార్చడం వీసాదారులకు పెను భారమవుతోంది.

నిపుణుల ఆందోళన

ఒకవైపు మోసపూరిత కంపెనీల ఏరివేత మంచిదే అయినప్పటికీ, కఠినతరమైన నిబంధనలు.. ఫీజుల పెంపు వల్ల నిజమైన ప్రతిభావంతులు అమెరికాకు దూరం అయ్యే ప్రమాదం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. టెక్సాస్‌లో మొదలైన ఈ విచారణ మున్ముందు ఇతర రాష్ట్రాలకు కూడా పాకే అవకాశం ఉంది. అమెరికాలో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారు లేదా ఇప్పటికే వీసాపై ఉన్న వారు తమ కంపెనీల చట్టబద్ధతను సరిచూసుకోవడం ఇప్పుడు అనివార్యంగా మారింది.