Begin typing your search above and press return to search.

న్యాయం జరిగింది : ఆరుగురు భారతీయుల ప్రాణాలు తీసిన యువకుడికి 65 ఏళ్ల జైలు

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో రెండు సంవత్సరాల క్రితం ఆరుగురు భారతీయ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో చివరకు న్యాయం జరిగింది.

By:  A.N.Kumar   |   12 Nov 2025 10:54 AM IST
న్యాయం జరిగింది : ఆరుగురు భారతీయుల ప్రాణాలు తీసిన యువకుడికి 65 ఏళ్ల జైలు
X

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో రెండు సంవత్సరాల క్రితం ఆరుగురు భారతీయ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో చివరకు న్యాయం జరిగింది. ఈ దారుణానికి బాధ్యత వహించిన యువకుడు, 19 ఏళ్ల ల్యూక్ గారెట్ రిసెకర్ కు న్యాయస్థానం 65 ఏళ్ల కఠిన జైలు శిక్షను విధించింది.

డ్రగ్స్, మద్యం మత్తులో డ్రైవింగ్: ఆరుగురి బలి

ఈ విషాదకర సంఘటన 2023 డిసెంబర్ 26న టెక్సాస్‌లోని క్లీబర్న్ సమీపంలోని యూఎస్ హైవే 67 వద్ద చోటుచేసుకుంది. అప్పట్లో కేవలం 17 ఏళ్ల వయసున్న రిసెకర్, మద్యం , మాదకద్రవ్యాల (డ్రగ్స్) ప్రభావంలో తన ట్రక్‌ను అత్యంత వేగంగా నడుపుతున్నాడు. ముఖ్యంగా మారిజువానాలోని ప్రధాన రసాయనం అయిన టెట్రాహైడ్రోకాన్నబినోల్ ప్రభావంలో ఉన్న అతని ట్రక్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఒక వాన్‌ను ఢీకొట్టింది. ఈ భయంకరమైన ఢీ కారణంగా ఆ వాన్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు భారతీయులు అక్కడికక్కడే మరణించారు.

విషాదంలో మునిగిన ఒకే కుటుంబం

మరణించిన వారంతా జార్జియా రాష్ట్రానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు. వారు గ్రాన్‌రోస్‌లోని ప్రసిద్ధ ఫాసిల్ రిమ్ వైల్డ్‌లైఫ్ సెంటర్‌ను సందర్శించి, తమ ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

మృతుల్లో రుషిల్ బర్రీ (28), నవీనా పొటబతుల (36), నాగేశ్వరరావు పొన్నాడ (64), సీతామహాలక్ష్మి పొన్నాడ (60), కృతిక్ పొటబతుల (10), నిషిధ పొటబతుల (9) ఉన్నారు. ఇందులో ఈ ప్రమాదంలో లోకేష్ పొటబతుల మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఆయన తీవ్ర గాయాల కారణంగా నడుం కింద భాగం పనిచేయని పరిస్థితిలోకి వెళ్లారు. క్షణంలో తన భార్య, ఇద్దరు చిన్నారులు, కజిన్‌, అత్తమామలను కోల్పోయిన లోకేష్ కుటుంబానికి ఈ తీర్పు కొంత ఉపశమనం కలిగించినా, తీరని లోటు మాత్రం మిగిలిపోయింది.

డ్రగ్స్ స్వాధీనం: కోర్టులో నిరూపణ

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు రిసెకర్ ట్రక్‌లో THC వెక్స్, వేప్ పెన్, మారిజువానా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ల్యాబ్ పరీక్షల్లో అతని రక్తంలో యాక్టివ్ THC ఉన్నట్టు స్పష్టంగా నిర్ధారణ అయింది.

రిసెకర్‌పై మత్తులో హత్యాయత్నం , డ్రగ్స్ కలిగి ఉండటం కేసులను నమోదు చేశారు. విచారణలో 'ఈ ప్రమాదం పూర్తిగా నివారించదగ్గది, కానీ మత్తులో డ్రైవ్ చేయాలనే వ్యక్తిగత నిర్ణయం ఆరుగురు అమాయక ప్రాణాలను బలి తీసుకుంది' అని విచారణాధికారులు కోర్టుకు తెలిపారు.

65 ఏళ్ల శిక్ష: మత్తు డ్రైవింగ్‌పై చర్చ

విచారణానంతరం న్యాయస్థానం రిసెకర్‌ను దోషిగా తేల్చి 65 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. ఈ కఠిన తీర్పు అమెరికాలో మత్తులో డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలపై ముఖ్యంగా యువతలో మాదకద్రవ్యాల వాడకంపై మరోసారి తీవ్ర చర్చకు తెరలేపింది.

భారతీయ కమ్యూనిటీతో పాటు అనేకమంది ఈ తీర్పును స్వాగతించారు. అయినప్పటికీ ఏ శిక్ష కూడా కోల్పోయిన ప్రాణాలకు చెల్లింపు కాదని, ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.