Begin typing your search above and press return to search.

టెక్సాస్‌లో షాకింగ్ వీడియోలు: భారతీయుల ప్రవర్తనపై విమర్శలు..

సోషల్ మీడియా 'రీల్స్' పిచ్చి మనుషులను ఏ స్థాయికి తీసుకువెళ్తుందో చెప్పడానికి డల్లాస్‌లోని పయనీర్ ప్లాజా వద్ద చోటుచేసుకున్న తాజా పరిణామాలు ఒక ఉదాహరణ.

By:  A.N.Kumar   |   22 Feb 2026 6:20 PM IST
టెక్సాస్‌లో షాకింగ్ వీడియోలు: భారతీయుల ప్రవర్తనపై విమర్శలు..
X

సోషల్ మీడియా 'రీల్స్' పిచ్చి మనుషులను ఏ స్థాయికి తీసుకువెళ్తుందో చెప్పడానికి డల్లాస్‌లోని పయనీర్ ప్లాజా వద్ద చోటుచేసుకున్న తాజా పరిణామాలు ఒక ఉదాహరణ. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాల్లో అది కూడా స్థానిక సమాజాల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న చోట మన తెలుగు యువత చేసిన నృత్యాలు, వీడియోలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. ఇది కేవలం ఒక చిన్న సమూహం చేసిన పనిగా కొట్టిపారేయలేం.. ఇది విదేశాల్లో భారతీయుల, ముఖ్యంగా తెలుగు వారి ప్రతిష్టపై పడుతున్న మచ్చగా భావించాల్సి ఉంటుంది.

చరిత్రను గుర్తించాలి.. భావోద్వేగాలను గౌరవించాలి

టెక్సాస్‌లోని పయనీర్ ప్లాజాలో ఉన్న భారీ ఎద్దుల విగ్రహాలు కేవలం పర్యాటక ఆకర్షణలు మాత్రమే కాదు. అవి అమెరికా చరిత్రలోని 'క్యాటిల్ డ్రైవ్' కాలానికి సాక్ష్యాలు. ఒక వర్గానికి ఇది ఆర్థిక ప్రగతికి చిహ్నమైతే, అక్కడి మూలవాసులైన నేటివ్ అమెరికన్లకు అది వారి భూములు, ప్రాణాలు కోల్పోయిన విషాదకర గతం. అటువంటి సున్నితమైన ప్రదేశాన్ని ఒక డ్యాన్స్ ఫ్లోర్‌లా మార్చేయడం స్థానికులను ఆగ్రహానికి గురిచేయడంలో ఆశ్చర్యం లేదు. ఒక దేశ సంస్కృతి ఆ దేశ ప్రజల హృదయాల్లో, ఆత్మల్లో ఉంటుంది అని మహాత్మా గాంధీ అన్నారు. ఆయన వారసులుగా మనం దాన్ని పాటించాలి.. కానీ మనం వెళ్ళింది పర్యాటకులుగా అయినా, వలసదారులుగా అయినా.. ఆ నేల చరిత్రను గౌరవించడం మన ప్రాథమిక బాధ్యతగా ఉండాలి. కొందరు భారతీయ యువత దీన్ని మరిచిపోతున్నారు.

గ్లోబల్ సిటిజన్‌గా ఎదగాలి

తెలుగు రాష్ట్రాల నుంచి ఐటీ ఉద్యోగాల కోసం ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. డల్లాస్ లాంటి నగరాల్లో మన వారి ప్రాబల్యం పెరగడం గర్వకారణమే. అయితే సంఖ్యతో పాటు సామాజిక అవగాహన కూడా పెరగాలి. చారిత్రక కట్టడాల వద్ద రీల్స్ చేయడం వల్ల వచ్చే కొన్ని 'లైక్స్' కోసం దేశం గౌరవాన్ని పణంగా పెట్టడం విజ్ఞత అనిపించుకోదు. విదేశాల్లో ఉన్నప్పుడు మనం కేవలం వ్యక్తులుగా మాత్రమే కాదు.. మన దేశ ప్రతినిధులుగా కనిపిస్తాం. అక్కడ మనం చేసే ప్రతి పని భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా మారుతుంది.

వినోదం మితిమీరకూడదు

సోషల్ మీడియా యుగంలో కంటెంట్ క్రియేషన్ అనేది తప్పు కాదు. కానీ అది ఎక్కడ చేస్తున్నాం? ఎవరి మనోభావాలను దెబ్బతీస్తున్నాం? అనే విజ్ఞత ముఖ్యం. 'రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగే ప్రవర్తించు' అనే సామెత కేవలం ఆహారపు అలవాట్లకే కాదు.. అక్కడి సంస్కృతిని, చరిత్రను గౌరవించడానికీ వర్తిస్తుంది.

అమెరికా వంటి దేశాల్లో స్థానిక చట్టాలు, ఆచారాల పట్ల అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత మన కమ్యూనిటీ సంఘాలపై కూడా ఉంది. ఇకనైనా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భాధ్యతాయుతమైన 'గ్లోబల్ తెలుగు' పౌరులుగా మనం ఎదగాలి.