Begin typing your search above and press return to search.

తెలుగు కుటుంబాలను వెంటాడుతున్న విదేశీ విషాదాలు.. మూడు దేశాల్లో మూడు దారుణ ఘటనలు

అమెరికా, స్పెయిన్, దక్షిణాఫ్రికా దేశాల్లో జరిగిన మూడు వేర్వేరు ఘటనలు తెలుగు కుటుంబాలను శోకసంద్రంలో ముంచేశాయి.

By:  A.N.Kumar   |   29 Jun 2026 11:29 AM IST
తెలుగు కుటుంబాలను వెంటాడుతున్న విదేశీ విషాదాలు.. మూడు దేశాల్లో మూడు దారుణ ఘటనలు
X

ఇటీవలి కాలంలో విదేశాల్లో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగులు వరుస విషాదాలకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా, స్పెయిన్, దక్షిణాఫ్రికా దేశాల్లో జరిగిన మూడు వేర్వేరు ఘటనలు తెలుగు కుటుంబాలను శోకసంద్రంలో ముంచేశాయి. ఒక యువకుడు అమెరికాలో వరదల్లో గల్లంతవగా.. మరో ఇద్దరు స్పెయిన్, దక్షిణాఫ్రికాల్లో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.

అమెరికాలో వరదల్లో గల్లంతైన ఆంధ్రప్రదేశ్ యువకుడు

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన దొప్పలపూడి వెంకటేష్ అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలోని ఒమాహాలో నివసిస్తున్నాడు. ఇటీవల కాన్సాస్ రాష్ట్రంలోని వెల్లింగ్టన్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో అతడు గల్లంతయ్యాడు. ఘటనాస్థలంలో వెంకటేష్ కారు, ట్రావెల్ బ్యాగ్ లభ్యమైనప్పటికీ అతడు, అతని మొబైల్ ఫోన్ మాత్రం ఇంకా కనిపించలేదు. ప్రస్తుతం అమెరికా అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనపై స్పందించిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌లకు లేఖ రాశారు. భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి గాలింపు చర్యలను వేగవంతం చేయాలని, వెంకటేష్ కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందించాలని కోరారు.

స్పెయిన్‌లో భవనం పైనుంచి పడి తెలంగాణ విద్యార్థి మృతి

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన 30 ఏళ్ల గిట్ల సాయి అఖిల్ రెడ్డి స్పెయిన్‌లోని వాలెన్సియా నగరంలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు అభ్యసిస్తున్నాడు. ఆరు నెలల క్రితమే ఉన్నత విద్య కోసం అక్కడికి వెళ్లిన అతడు ఆదివారం భవనం పైనుంచి కిందపడటంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏకైక కుమారుడైన అఖిల్ మృతితో తల్లిదండ్రులు సుభాషిణి రెడ్డి, గుణాకర్ రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ వార్త కూనారం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

దక్షిణాఫ్రికాలో విమాన ప్రమాదంలో ట్రైనీ పైలట్ మృతి

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామానికి చెందిన 22 ఏళ్ల అదేపు సుమంత్ దక్షిణాఫ్రికాలో ట్రైనీ పైలట్‌గా శిక్షణ పొందుతున్న సమయంలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వాణిజ్య పైలట్ కావాలన్న లక్ష్యంతో మొదట ముంబైలో శిక్షణ పూర్తి చేసిన సుమంత్, అనంతరం జోహన్నెస్‌బర్గ్‌లో అడ్వాన్స్‌డ్ ఫ్లైట్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. శిక్షణలో భాగంగా జెట్ విమానాన్ని ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో అతడు, అతనితో ఉన్న మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సుమంత్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి కుటుంబ సభ్యులు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ను ఆశ్రయించారు.

పెరుగుతున్న ఆందోళన

ఇటీవలి నెలల్లో విదేశాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత వరుసగా ప్రమాదాలు, అనారోగ్యాలు, ఇతర దుర్ఘటనల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. దాదాపు ప్రతి వారం ఒక విషాద వార్త వెలుగులోకి వస్తుండటం కుటుంబ సభ్యులతో పాటు తెలుగు సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం అమెరికాలో గల్లంతైన వెంకటేష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండగా.. అతడు క్షేమంగా లభించాలని కుటుంబ సభ్యులు, స్వగ్రామ ప్రజలు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.