ఆయువు తీసిన అనారోగ్యం.. అమెరికా తెలుగు విద్యార్థిని విషాదాంతం
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి.. ఉపాధి అవకాశాల కోసం తరలి.. అగ్రరాజ్యంలో అసువులు బాయాల్సిన విషాదాలు వెంటాడుతున్నాయి.
By: A.N.Kumar | 8 Nov 2025 10:26 PM ISTఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి.. ఉపాధి అవకాశాల కోసం తరలి.. అగ్రరాజ్యంలో అసువులు బాయాల్సిన విషాదాలు వెంటాడుతున్నాయి. అగ్రరాజ్యంలో మంచి భవిష్యత్తు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని తరలిన ఎంతో మంది తెలుగు వాళ్లు అక్కడి పరిస్థితులు, ప్రమాదాలకు బలి అవుతూనే ఉన్నాయి. కొందరు కాల్పుల్లో.. మరి కొందరు అనారోగ్యాలతో, ఇంకొందరు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. కారణం ఏదైనా ఈ చావుల పరంపర కొనసాగుతూనే ఉంది.
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి జీవితంగా విషాదంగా ముగిసింది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి, తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఆశయంతో అడుగుపెట్టిన ఓ తెలుగు విద్యార్థిని కలలు కల్లలయ్యాయి. చదువు పూర్తి చేసి, ఉద్యోగంలో స్థిరపడతారని ఆశగా ఎదురుచూస్తున్న ఆ కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. అనారోగ్యం రూపంలో ఆ యువతిని విధి బలిగొంది.
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన రామకృష్ణ - నాగమణి దంపతుల కుమార్తె యార్లగడ్డ రాజ్యలక్ష్మి (23) అనారోగ్యంతో అమెరికాలో చనిపోయారు. విజయవాడలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆమె ఉన్నత చదువుల కోసం 2023లో అమెరికాకు పయనమైంది. అక్కడ ఒక యూనివర్సిటీలో ఎం.ఎస్. కంప్యూటర్స్ విభాగంలో చేరింది.ఇటీవల ఆమె విద్యాభ్యాసం కూడా ముగిసింది. అక్కడే తన స్నేహితులతో కలిసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. కొద్ది రోజుల్లోనే మంచి కొలువులో చేరతారని ఆ కుటుంబం ఎంతో ఆశగా ఎదురుచూసింది. కానీ, విధి మరోలా తలచింది.
గురువారం రాత్రి రాజ్యలక్ష్మి తన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడింది. కొద్దిగా జలుబు, ఆయాసంగా ఉందని, చికిత్స కోసం ఈ నెల 9వ తేదీకి వైద్యుల అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నానని తెలిపింది. అదే రోజు రాత్రి ఆమె స్నేహితులతో కలిసి నిద్రపోయింది.కానీ, మరుసటి రోజు ఉదయం స్నేహితులు ఎంత నిద్రలేపినా రాజ్యలక్ష్మి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ హఠాత్తు మరణవార్త విన్న కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. తల్లిదండ్రులు రామకృష్ణ - నాగమణి అచేతన స్థితిలో ఉండిపోయారని, వారి రోదనలు మిన్నంటాయని మృతురాలి సోదరుడు రాజా తెలిపారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి తమ కలలన్నీ నెరవేరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిన రాజ్యలక్ష్మి మరణంతో కారంచేడు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
కాగా రాజ్యలక్ష్మి మృతదేహాన్ని అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీ ఎమ్మెల్యే సాంబశివరావు కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించి హామీనిచ్చారు. ఆమె మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాగా అమెరికాలో తెలుగు విద్యార్థిని మరణంతో చాలా మంది ఎన్నారైలు ముందుకొచ్చి ఆమె మృతదేహాన్ని భారత్ కు పంపేందుకు.. ఆ కుటుంబానికి సాయం చేసేందుకు ఫండ్ రైజ్ చేశారు. ఇప్పటివరకూ రాజ్యలక్ష్మి కుటుంబానికి సాయంగా లక్షకు పైగా డాలర్ల సాయం విరాళంగా అందింది.
