Begin typing your search above and press return to search.

నిశ్శబ్ద విషాదం: కంటి నిండా నిద్రలేని 'అమెరికా కల'.. మేల్కొనకపోతే అంతేనా?

తాజాగా జార్జియాలో నివసిస్తున్న తెలుగు ఐటీ ఉద్యోగి ముత్తా రవిశంకర్ గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూయడం ప్రవాస తెలుగు సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

By:  A.N.Kumar   |   13 July 2026 1:55 PM IST
నిశ్శబ్ద విషాదం: కంటి నిండా నిద్రలేని అమెరికా కల.. మేల్కొనకపోతే అంతేనా?
X

కన్నవారిని వదిలి.. కట్టుకున్న ఊరిని దాటి.. సప్తసముద్రాల అవతల ‘డాలర్ కల’ను నిజం చేసుకోవాలని వెళ్లిన మన తెలుగు బిడ్డల జీవితాల్లో ఇప్పుడు ఒక నిశ్శబ్ద విషాదం అలముకుంటోంది. అమెరికాలో ఐటీ ఉద్యోగం అంటే సమాజంలో ఒక హోదా.. విలాసవంతమైన జీవితం.. కరకరలాడే నోట్ల కట్టలు... ఇవే కదా అందరికీ కనిపించే వెలుగులు.. కానీ ఆ వెలుగుల వెనుక దాగున్న చీకటి, ఆ డాలర్ల వెనుక దాగున్న కన్నీరు, రక్తస్వేదం ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉద్యోగ ఒత్తిడి, నిద్రలేని రాత్రులు, మానసిక వేదనల నడుమ తెలుగు టెక్కీలు తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారనే చేదు నిజం గుండెల్ని పిండేస్తోంది.

తాజాగా జార్జియాలో నివసిస్తున్న తెలుగు ఐటీ ఉద్యోగి ముత్తా రవిశంకర్ గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూయడం ప్రవాస తెలుగు సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కుటుంబంతో కలిసి ఎన్నో ఆశలతో అమెరికాలో స్థిరపడిన రవిశంకర్ తన కెరీర్ కోసం నిరంతరం శ్రమించారు. రాత్రి షిఫ్టుల్లో పనిచేస్తూ ఇటు అమెరికా బాధ్యతలు, అటు భారతదేశంలోని టీమ్‌లతో సమన్వయం చేసుకుంటూ నెలల తరబడి కంటి నిండా నిద్ర లేకుండా గడిపారు. చివరకు ఆ అలసట, ఆ ఒత్తిడి ఒకేసారి గుండెపోటు రూపంలో ఆయన ప్రాణాలను బలితీసుకుంది. ఇది కేవలం ఒక రవిశంకర్ కథ కాదు... అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది తెలుగు టెక్కీల దైనందిన జీవితానికి అద్దం పడుతున్న భయానక చిత్రం.

డాలర్ల వేటలో కరిగిపోతున్న ఆయుష్షు

అమెరికాలో ఉన్న మన టెక్కీలు ఒకేసారి రెండు టైమ్‌జోన్ల నడుమ నలిగిపోతున్నారు. పగలు అమెరికా ఆఫీస్ పనులు, రాత్రి కాగానే ఇండియా టీమ్‌లతో సుదీర్ఘమైన మీటింగ్స్. గడియారంలోని ముల్లు తిరుగుతుందేమో కానీ వారి కంప్యూటర్ స్క్రీన్లు మాత్రం అస్సలు ఆరడం లేదు. దీనికి తోడు ప్రాజెక్ట్ డెడ్‌లైన్ల భయం.. ఎప్పుడు ఏ డెలివరబుల్ మిస్ అవుతుందోనన్న ఆందోళన. వీసా సమస్యలు, లేఆఫ్స్ గండం ఉండనే ఉంది. ఒక్క ఉద్యోగం పోతే మొత్తం జీవితమే తలకిందులవుతుందనే నిరంతర అభద్రతాభావం వెంటాడుతోంది. దీనికి తోడు ఆర్థిక లక్ష్యాలు, కుటుంబ బాధ్యతలు.. సొంతూరిలో ఇల్లు, పిల్లల చదువులు, సమాజంలో తలెత్తుకు బతకాలనే తాపత్రయం పట్టిపీడిస్తోంది.

ఈ కారణాలన్నీ కలిసి వారి గుండెల్లో నిరంతరం ఒక అగ్నిపర్వతాన్ని రగిలిస్తున్నాయి. వారానికో విషాదం చొప్పున వస్తున్న వార్తలు చూస్తుంటే అమెరికా కల కాస్తా కన్నీటి కళగా మారుతోందా అనే భయం వేస్తోంది. కొందరు గుండె ఆగి మరణిస్తుంటే మరికొందరు ఆ మానసిక ఒత్తిడిని భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతుండటం అత్యంత విచారకరం.

ఆరోగ్యమే అసలు సంపద.. మేల్కొనాల్సిన సమయం ఇదే

మనం సంపాదించే డబ్బు, పొందే హోదా... మన ప్రాణం ఉంటేనే కదా అనుభవించగలం? రోజుకు 12 నుండి 16 గంటలు యంత్రాల్లా పనిచేస్తూ శరీరాన్ని హింసిస్తే ఒక దశలో ఆ శరీరం తిరగబడుతుంది. గుండె ఒక్కసారిగా అలసిపోతుంది. అందుకే వైద్య నిపుణులు నెత్తీ నోరూ బాదుకుని మరీ చెబుతున్నారు. డాలర్లు సంపాదించడం ముఖ్యం కాదు.. జీవితాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ఏ రోజూ కంటి నిండా 7-8 గంటల నిద్రను నిర్లక్ష్యం చేయకండి. పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన లక్ష్మణ రేఖను గీయండి అని సూచిస్తున్నారు.

క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ఒత్తిడి ఎక్కువైతే సంకోచించకుండా కౌన్సెలింగ్ తీసుకోవడం, వ్యాయామం చేయడం ఇప్పుడు విలాసం కాదు... బతకడానికి అత్యవసరమైన అవసరాలు.

రవిశంకర్ మృతి ప్రవాస తెలుగు లోకానికి ఒక గట్టి హెచ్చరిక. కెరీర్ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే.. కానీ జీవితమే కెరీర్ కాదు. కన్నవారి కళ్ళల్లో ఆనందం చూడాలంటే మీరు డాలర్లు పంపడం కాదు.. మీరు ఆరోగ్యంగా తిరిగి ఇంటికి రావడం ముఖ్యం. ఇప్పటికైనా మేల్కొందాం... కెరీర్ కోసమో.. కంపెనీ కోసమో మన అమూల్యమైన ప్రాణాలను పణంగా పెట్టే అలవాటుకు స్వస్తి పలుకుదాం..